
'దేశాభివృద్ది కోసమే జనసేన మద్దతు'
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశాభివృద్ధి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడ వచ్చిన హరిబాబు విలేకర్లతో మాట్లాడారు. విజయవాడ, తెనాలి, గుంటూరు నగరాలను కలుపుతూ మెట్రో రైలును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా విశదీకరించారు.
గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ హమీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు గత ఏడెనిమిదేళ్లుగా ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర, తెలంగాణ అభివృద్ధికే కాదు, దేశం యొక్క ఆర్థిక దిశను ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలల్లో టీడీపీతోపాటు ప్రముఖ టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లింది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లో రెండు లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.