
కంభంపాటి హరిబాబు
* లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురిలో ఎవరికీ దక్కని అవకాశం
* రాష్ట్రం నుంచి అనూహ్యంగా నిర్మలా సీతారామన్‌కు సహాయ మంత్రి పదవి
* తమిళనాడులో జననం.. రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్‌తో వివాహం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన తొలి మంత్రివర్గ కూర్పులో అనుభవానికి, విధేయతకే పెద్దపీట వేశారు. 44 మంది మంత్రివర్గ సభ్యులలో రాష్ట్రానికి సంబంధమున్న ముగ్గురు నేతలకు స్థానం దక్కింది. అయితే సమైక్య రాష్ట్రంలో బీజేపీ తరఫున గెలిచిన ముగ్గురు లోక్‌సభ సభ్యులకు ఈసారి నిరాశ మిగిలింది.
బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిన వెంకయ్యనాయుడు, ప్రస్తుత బీజేపీ జాతీయ అధికారిక ప్రతినిధిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్, ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ కోటాలో విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజులను మంత్రి పదవులు వరించాయి. ఈ ముగ్గురు నేతలు సీమాంధ్ర ప్రాంతంతో సంబంధం ఉన్నవారే. తెలంగాణకు ఈసారి చాన్స్ లేకుండా పోయింది.
లోక్‌సభ, రాజ్యసభలో కనీసం ఎంపీ కూడా కాని నిర్మలా సీతారామన్‌కు అనూహ్యంగా స్వతంత్ర హోదాలో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కడమే రాష్ట్రంలో బీజేపీ నేతలను సైతం ఆశ్చర్యపరిచింది. ఆమె జన్మస్థలం తమిళనాడు రాష్ట్రం అయినప్పటికీ, మన రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త పరకాల ప్రభాకర్‌కు ఆమె సతీమణి. సీతారామన్ పార్టీకి పూర్తిగా విధేయతగా ఉండడంతో పాటు జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ భావజాలాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆమెకు ఈ పదవిని తెచ్చిపెట్టినట్టు భావిస్తున్నారు.
వెంకయ్య కోసమే వీరికి చోటు దక్కలేదా?
సీమాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం లోక్‌సభ నుంచి కంభంపాటి హరిబాబు(పార్టీ సీమాంధ్ర ప్రాంత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు), నరసాపురం లోక్‌సభ నుంచి గోకరాజు గంగరాజు గెలుపొందగా.. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీ తరఫున గెలిచిన దత్తాత్రేయ మంత్రి పదవి ఖాయమని బాగా ప్రచారం జరిగినప్పటికీ మోడీ తొలి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు.
నెల్లూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వెంకయ్య నాయుడు గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా మంత్రిపదవి ఖాయమైనట్టు తెలుస్తోంది. వెంకయ్యకు చోటు కారణంగానే సీమాంధ్రలో లోక్‌సభ సభ్యులుగా తొలిసారి గెలిచిన హరిబాబు, గంగరాజు పేర్లు కనీసం పరిశీలనలోకి తీసుకోనట్టు సమాచారం.
రాష్ట్రం నుంచి బీజేపీకి రాజ్యసభ సీటు?
ఏ సభలోనూ ఎంపీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ త్వరలో రాష్ట్రం నుంచే రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ మరణించిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి స్థానంలో సీతారామన్‌ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో సీమాంధ్రలో బీజేపీకి ఐదు లోక్‌సభ సీట్లు కేటాయించారు. అయితే తరువాత టీడీపీ కోరిక మేరకు ఒక లోక్‌సభ స్థానాన్ని కుదించుకొని బీజేపీ నాలుగు స్థానాల్లోనే పోటీ చేసింది. ఎన్నికల్లో తాము ఒక లోక్‌సభ స్థానం వదులుకున్నందుకు ప్రతిఫలంగా ఇప్పుడు బీజేపీ రాజ్యసభ సీటు కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మోడీ ప్రతిపాదనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలంటున్నారు.