న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికను వారంలో పూర్తి చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. శుక్రవారం అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ రెండేళ్ల పాలన విజయాలపై ప్రచారం కోసం 30 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 21వ శతాబ్దం ఇండియదే అన్న లక్ష్యంగా తమ పాలన సాగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలన తర్వాత దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తున్నామని అమిత్ షా తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని, రైతులకు ఉపయోగం కలిగేలా పథకాలు ప్రవేశపెట్టామని, దేశంలో వృద్ధి రేటును పెంచగలిగామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో సమతుల్యత పాటించినట్లు అమిత్ షా అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికపై టీడీపీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఏపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయంలో తలమునకలై ఉంది. కాగా ఇప్పటికే తెలంగాణలో ఆపార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ను నియమించిన విషయం తెలిసిందే.
వారంలో ఏపీ నూతన అధ్యక్షుడి ఎంపిక
Published Fri, May 27 2016 1:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement