
టీడీపీతో కలిసుంటామో లేదో చెప్పలేం!
- నాలుగేళ్ల తర్వాత పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేమన్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఏర్పడిందని, దీన్ని భర్తీ చేయడం ద్వారా బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. బీజేపీ-టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని, రాజకీయాల్లో ఆరు నెలల కాలమే చాలా ఎక్కువని, నాలుగేళ్ల తర్వాత ఏమి జరుగుతుందో తాను జోస్యం చెప్పలేనన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, జేఎస్పీ, లోక్‌సత్తా ఇతర ప్రతిపక్ష పార్టీల్లోనూ అనిశ్చితి నెలకొందని చెప్పిన ఆయన ఆ పార్టీల నుంచి అనేక మంది నేతలు బీజేపీలో చేరడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ కన్నా వల్ల బీజేపీ సీమాంధ్రలో మరింత బలపడుతుందని చెప్పా రు. కొత్తవారిని బీజేపీ ఇముడ్చుకోలేదనే విమర్శ ఉందని, దాన్ని పోగొట్టేలా పాత నేతలు, కార్యకర్తలు వ్యవహరించాలని సూచించారు. మోదీని వ్యతిరేకించే పార్టీలు, నాయకులంతా బీజేపీకి ప్రత్యర్థులేనని చెప్పారు. విజయవాడలో రాజ ధాని ఏర్పాటును తాము బలపరిచామని, భూసమీకరణలో ఇబ్బందులు ఏర్పడితే వాటిని తొలగించాలని ప్రభుత్వానికి సూచిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఏపీలోనే ఉండి పనిచేయాలని గతంలోనే సూచించామని, త్వరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఏపీలో 58 ఏళ్లుగా ఒక్క జాతీయ విద్యా సంస్థ కూడా రాలేదని, ఎన్డీఏ ప్రభుత్వం 11 జాతీయ సంస్థలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థను ఒక్కో జిల్లాలో పెడుతూ అధికార వికేంద్రీకరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా నిర్ణయించి రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది తమ అభిప్రాయమని, దీన్ని ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు.
బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తా : కన్నా
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో గుంటూరులో ఒక సభ పెట్టి మరింత మందిని చేర్పించాలని చూస్తున్నామని, ఈ సభకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వస్తానని చెప్పారన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా సభకు వచ్చేలా చూడాలని ఆయన హరిబాబును కోరారు.