బీజేపీ నేతలు హరిబాబు, జీవీఎల్‌ను కలసి రైల్వే మంత్రితో భేటీకి రావాలని ఆహ్వానిస్తున్న సుజనాచౌదరి, జేసీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించడానికి టీడీపీ మంత్రులు కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సుజయ్‌కృష్ణా రంగారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు మంగళవారం రాత్రి ఢిల్లీలోని పీయూష్ గోయల్ కార్యాలయానికి వచ్చారు.
ఇదే సమయంలో బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కంభంపాటి హరిబాబు కూడా రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు ఒకరికొకరు తారసపడడంతో అందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. తాము కేంద్ర మంత్రితో రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు వెళ్తున్నామని, మీరు కూడా రండి అంటూ బీజేపీ ఎంపీ హరిబాబును టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించారు. తాము కూడా ఇదే అంశంపై చర్చించేందుకు వచ్చామని హరిబాబు చెప్పారు. తర్వాత కేంద్ర మంత్రితో టీడీపీ నేతల సమావేశం సందర్భంగా బీజేపీ ఎంపీలు కూడా అందులో పాల్గొన్నారు. జోనూ లేదు.. గీనూ లేదు అని వీడియో టేపులో దొరికిపోయిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు గడచిపోయాయని, విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
జీవీఎల్‌ను ఎందుకు పిలిచారు?
టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, సుజనా చౌదరి, రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తరువాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. ఆయన రైల్వే జోన్‌పై మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆయనపై మాటల యుద్ధానికి దిగారు. అసలు జీవీఎల్‌ను ఎందుకు పిలిచారంటూ టీడీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎంపీ హరిబాబు కల్పించుకుని సుజనా చౌదరి పిలిస్తేనే ఈ సమావేశానికి వచ్చామని చెప్పారు. దీనికి సుజనాచౌదరి అంగీకరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జోన్ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment