
నామినేషన్ వేయడానికి వెళ్తున్న హరిబాబు
విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కంభంపాటి హరిబాబు నామినేషన్ ఎలాంటి హడావిడి లేకుండా సాదాసీదాగా జరిగింది. దసపల్లా హిల్స్‌లోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నేతలంతా ఒకే వాహనంపై బయల్దేరగా మిగిలిన నేతలంతా కారుల్లో ఊరేగింపుగా వెళ్లారు. తమ వెంట వస్తారనుకున్న జనసేన పార్టీ కేడర్(పవన్ అభిమానులు), టీడీపీ పార్టీ నేతలు షాక్ ఇవ్వడంతో ఊరేగింపు చ ప్పగా సాగింది. హరిబాబు వెంట బీజేపీ నేతలంతా హాజరుకాగా కేడర్ కూడా ముఖం చాటేసింది. దీంతో బీజేపీ నేతల ముఖాలు చిన్నబోయాయి.
రాష్ర్ట అధ్యక్ష హోదాలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుంటే కార్యకర్తలు మరీ ఇంత పలచగా హాజరవడంపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది. టీడీపీ మాత్రం తాము లేకపోతే బీజేపీ సత్తా ఇంతేనంటూ పరోక్షంగా ఓటర్లకు తెలిసేందుకే ఇలా ప్రవర్తిస్తోందని ఆ పార్టీలోని కొందరంటున్నారు. హరిబాబు వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్‌రావు, నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు, పార్టీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, పార్టీ నేతలు ఫృధ్వీరాజ్, రామకోటయ్య, తదితరులు ఉన్నారు.