సాక్షి మెగా ఆటో షో.. అదరహో!
- విశాఖ ఎంవీపీ కాలనీలో రెండు రోజుల సంరంభం
- ఒకే వేదికపైకి అన్ని కంపెనీల కార్లు, బైక్‌లు
- ఉత్సాహంగా తరలివచ్చిన సిటీజనులు
కలల షి‘కారు’ను నిజం చేసే వేదిక...జాలీ రైడ్ బైక్‌ల మేళా.....‘సాక్షి మెగా ఆటో షో’ అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ కంపెనీలకు చెందిన పలు రకాల కార్లు, బైక్‌లతో విశాఖ ఎంవీపీ కాలనీలో కొలువుదీరింది. సందర్శకులకు కనువిందు చేసింది. వాహనప్రియులను ఆకట్టుకుంది. తొలిరోజు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. నేడు కూడా షో కొనసాగనుంది.
విశాఖపట్నం: ఓవైపు హుందాగా కొలువు తీరిన అందాలకార్లు.. ఇంకోవైపు చూపు తిప్పనివ్వని సొగసులతో చూడముచ్చటైన బైక్‌లు. అటు వాహన యోగాన్ని వాస్తవం చేయడానికి వరుసగా వచ్చిన ప్రఖ్యాత సంస్థల డీలర్లు.. ఇటు ఒళ్లంతా కళ్లుగా వాహనాలను తిలకిస్తూ, వాటి ఫీచర్లపై ఉత్సాహంతో ఆరా తీస్తున్న విశాఖ వాసులు. ఎన్నెన్నో సంస్థలు.. మరెన్నో వాహనాలు! అన్నీ ఒకే చోట బారులు తీరడంతో ఆసక్తిగా ఆరా తీస్తున్న విభిన్న వర్గాల ప్రజలు! తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ప్రారంభమైన మెగా ఆటోషోలో అలరించిన చిత్రమిది. అన్ని విక్రయ సంస్థలనూ ఒకే చోటికి తెచ్చి వినియోగదారుడి ఆకాంక్ష నెరవేర్చాలన్న ‘సాక్షి’ సత్సంకల్పం అందమైన కలలా అవతరించింది.
ఘనంగా ప్రారంభం
రెండు రోజుల పాటు జరిగే సాక్షి మెగాఆటో షోను విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఉప రవాణా కమిషనర్ ఎం.ప్రభురాజ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శన ఆరంభించారు. ఎంవీపీ కాలనీ ఉడా గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని తర హా వాహనాలు ఒకే వేదిక మీద కొలు వు తీరడంతో అంతా ఆసక్తిగా వాటిని తిలకించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. చిన్నపాటి మోపెడ్ నుంచి ఖరీదైన లగ్జరీ కార్ల వరకూ బారులు తీరడంతో వాహన ప్రియులు తమకు నచ్చిన వాహనాల కోసం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు కూడా సేవలు అందించారు.
తక్కువ పన్నులతో ఎక్కువ మేలు
తక్కువ పన్నులతో ఎక్కువ మేలు ఒనగూరుతుందని, కేంద్ర ప్రభుత్వానిదీ అదే లక్ష్యమని విశాఖ ఎంపీ కె.హరిబాబు ప్రకటించారు. ‘సాక్షి మెగా ఆటో షో’ను ప్రారంభించి ప్రజలతో మాట్లాడారు. అధిక పన్నుల విధానంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని వ్యాఖ్యానించారు. అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చి అమ్మకాలు చేపట్టడం హర్షణీయమన్నారు. ‘మెగా ఆటో షో’ నిర్వహించిన ‘సాక్షి’ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతీ కౌంటర్‌ను హరి బాబు సందర్శించి ఆయా కంపెనీల ప్రతినిధులను ఉత్సాహపరిచారు. కార్ల లో, బైకుల మీద కూర్చుని వాహనాల విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
అన్ని కంపెనీల షోరూం
అన్ని కంపెనీలు ఒకే షోరూంలో ఉన్నట్టుగా ఉందని ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నా రు. వినియోగదారుడికి కావాల్సిన సదుపాయాలన్నీ ఒకే చోట అందించడాన్ని కొనియాడారు. ‘ఆటో షో’ల నిర్వాహణతో కంపెనీల ప్రాముఖ్యత పెరుగుతుందని, అమ్మకాలు పుంజు కుంటాయని అభిప్రాయపడ్డారు. ‘సాక్షి’ సేవలను ప్రశంసించారు.
అందరికీ లాభదాయకం
‘ఆటో షో’ల నిర్వహణతో అమ్మకందారులు, కొనుగోలుదారులు ప్రయోజనం పొందుతారని రవాణా ఉప కమిషనర్ ఎం.ప్రభురాజ్‌కుమార్ చెప్పా రు. అన్ని కంపెనీలు ఒకే వేదికపైకి రావడంతో వినియోగదారుడు షో రూంల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. తనకు నచ్చిన వాహ నం ఎంచుకోవడం, కొనుగోలు చేయడంతో శ్రమ తగ్గుతుందని పేర్కొన్నా రు. ప్రత్యేక ఆఫర్‌లు, రాయితీలు వ ర్తించడంతో ప్రయోజనం కలుగుతుం దని చెప్పారు. ‘మెగా ఆటో షో’లో రవాణా శాఖను భాగస్వామ్యం చేయడాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీవో ఎ.హెచ్.ఖాన్,సాక్షి యాడ్స్ జనరల్ మేనేజర్ కమల్ కిషోర్‌రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు వినోద్, బి.రంగనాథ్, విశాఖ బ్రాంచి మేనేజరు కోటారెడ్డి, బ్యూరో చీఫ్ వి.శ్రీనివాస్, పాల్గొన్నారు.
నేడు కూడా ఆటో షో
ఆటో షో ఆదివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8గంటల వరకూ సందర్శించవచ్చు. కొనుగోలుపై తీసిన డ్రాలో బంపర్ బహమతి ఉంటుంది.