భారతీయ జనతా పార్టీ నేతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలనలో ఘోర వైఫల్యం, అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తప్పంతా కేంద్రంపై నెట్టివేసి తప్పుకోవాలని చూస్తోందంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ వచ్చిన టీడీపీ ఎన్నికల సంవత్సరం దగ్గరపడుతున్న సమయంలో కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కేంద్రాన్ని దోషిగా చూపించి లబ్ధి పొందాలన్న ఎత్తుగడలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం సూచనలు జారీచేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
గత నాలుగేళ్లుగా కేంద్రం అందించిన సాయం వివరాలతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు 27 పేజీల నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్రం సహాయం చేయడంలేదన్న టీడీపీ వాదనలకు గణాంకాలతో చెక్ పెట్టారు. పొత్తులపై తేల్చుకోవాల్సింది టీడీపీయేనంటూ కుండబద్దలు కొట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచలేమన్నందుకే మాపై కుట్ర చేస్తున్నారా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
కేంద్రం ఎంతో సాయం చేస్తుందంటూ నాలుగేళ్లుగా పొగిడిన చంద్రబాబు ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయించారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు ఎలా భేటీ అవుతారంటూ నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా గొడవ చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తమను ముంచాలని చూస్తే చంద్రబాబే మునిగిపోతారని హెచ్చరించారు. కేంద్రం ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చుచేశారో బహిరంగ ప్రకటన చేయాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈవెంట్ల పేరుతో, సదస్సుల పేరుతో ఫైవ్‌స్టార్ హోటళ్లకు కోట్లాది రూపాయలు తగలేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఏపీకి నిధుల లోటు ఉందంటే ప్రజలు కూడా నమ్మబోరని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం దుబారాపై చర్చకు సిద్ధమా? అంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ... ప్రభుత్వ నిర్ణయాలను ఒకవైపు ఆమోదిస్తూ... మరోవైపు ప్రజలను మభ్యపెట్టడానికి సభలో నిరసనలకు దిగుతున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు అస్త్రాలను సన్నద్ధం చేసుకుంటున్నారు.
రాజీనామాలు ఎందుకు చేయడం లేదు?
ఇటీవల చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రెండు ఎకరాల ఆసామి రెండు వేల కోట్లకు పైగా ఆస్తులు ఎలా సమకూరాయని కూడా ఆయన పరోక్షంగా సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆ సమయంలో టీడీపీ నేతలు వీర్రాజు ఇంటిపై దాడికి తెగబడ్డారు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలతో వీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. చంద్రబాబును విమర్శించే ముందు వీర్రాజు తమ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నేతలు కేంద్ర మంత్రి పదవులకు ఎందుకు రాజీనామాలు చేయలేకపోతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పదవుల్లో కొనసాగుతూ ప్రశ్నించే అర్హత టీడీపీ వారికి లేనేలేదని, ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నదే తమ వ్యూహమని చెబుతున్నారు. అదే సమయంలో ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను, ఇతర ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నామని పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని, అవినీతి అక్రమాలను పాల్పడిందని, వాటినీ ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. పోలవరం, రాజధాని నిధులే కాకుండా వివిధ పథకాల కింద వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతలు పక్కదారి పట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియోజకవర్గంలోనే రూ.10 కోట్లమేర ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టిన వైనాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు పేర్లు మార్చి తన సొంత పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని, కనీసం ప్రధాని ఫొటో కూడా పెట్టడం లేదని ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సోము వీర్రాజు ప్రకటనల తరువాత బీజేపీ రాష్ట్ర నేతల ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడికి తెలుగుదేశం నేతలు కొన్ని లీకులు ఇప్పించి సోము వీర్రాజును ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మందలించినట్లు తమ మీడియాలో ప్రచారం చేయించారు. బీజేపీ నేతలు వాటిని ఖండించడమే కాకుండా మరింత ఉధృతంగా టీడీపీపై విమర్శల దాడి పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షాత్తూ అమిత్‌షానే తమకు మార్గనిర్దేశం చేసినందున జిల్లా స్థాయి వరకు టీడీపీ మోసపూరిత నిరసన నాటకాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని నిర్ణయించారు.
బీజేపీ లేకపోతే టీడీపీకి అధికారమెక్కడిది?
మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని నిర్వీర్యం చేయడానికి తెలుగుదేశం తెరవెనుక కుట్రలు చేస్తోందని ఆ పార్టీ నేతలు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేతల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌ఛార్జులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తమ వారికి పనులు కూడా చేయనివ్వకుండా అధికారులకు ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. ఇదంతా రాజకీయంగా దెబ్బతీసేందుకు చంద్రబాబునాయుడు తెరవెనుక ఆడిన నాటకమని పేర్కొంటున్నారు. కాకినాడ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారని గుర్తుచేస్తున్నారు. ‘బీజేపీకి రాష్ట్రంలో స్వతంత్రంగా 18% ఓట్లు సాధించుకొనే సత్తా ఉంది. గతంలో ఇది నిరూపితమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటే అది మా చలవే. టీడీపీ వైఎస్సార్‌సీపీకి కేవలం ఓట్ల తేడా ఐదు లక్షల ఓట్లే. మా వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పడు మమ్మల్నే అణగదొక్కాలని చూస్తోంది’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. ‘రాష్ట్ర బీజేపీ పార్టీనే కాకుండా జాతీయ పార్టీని, ప్రధాని మోడీని కూడా రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది. దీనిని మేమెంత మాత్రం సహించబోము. మా తడాఖా ఏమిటో మేమూ చూపిస్తాం’ అని మరో బీజేపీ నేత చెప్పారు.
లెక్కలు చెప్పడానికి భయమెందుకు?
కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇచ్చిన నిధులు లెక్కలు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భయమెందుకని బీజేపీ రాష్ట్రనేత ఒకరు ప్రశ్నించారు. ‘‘టీడీపీ నేతలు నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రాలేదని ఇప్పుడు చెబుతున్నారు. అసలు ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన వాటికి లెక్కలు కూడా చెప్పడం లేదు. పోలవరానికి ఇచ్చిన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. యూసీలు ఇవ్వడానికి ఎందుకు అంత భయం? అక్కడ జరిగిన అవినీతి బయటపడుతుందని భయమా? రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల పరిస్థితీ అలాగే ఉంది. శాశ్వత నిర్మాణాలు కాకుండా తాత్కాలిక నిర్మాణాలంటూ ఆ నిధులు వృథా చేస్తున్నారు. తెరవెనుక లాలూచీలతో ఇవన్నీ తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నారు. వీటన్నిటిలో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. నిధులు కేంద్రం నుంచి సహాయం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన రిపోర్టులు ఉండాలి. ఇతర రాష్ట్రాలు త్వరితంగా డీపీఆర్‌లు పంపించి నిధులు రప్పించుకుంటుండగా ఇక్కడ మాత్రం అలా చేయడం లేదు. వారి వైఫల్యాలకు కేంద్రంపై, బీజేపీపై నిందలు వేస్తున్నారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment