పురందేశ్వరి ఫైల్ ఫోటో
సాక్షి, విజయవాడ : పొత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని అన్నారు. తమతో కలిసి ఉంటారో...ఉండరో...టీడీపీనే తేల్చుకోవాలని ఆమె శనివారమిక్కడ అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని పురందేశ్వరి అన్నారు. టీడీపీకి ఉండాలనే ఉద్దేశం లేకుంటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడాలని ఆమె సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలనే టీడీపీ సర్కార్ పేరు మార్చి తనదిగా చెప్పుకుంటుందని, పంచాయతీలకు కేంద్రం నిధులు నేరుగా అందుతున్నాయని ఆమె అన్నారు. అలాగే ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాసినట్లు పురందేశ్వరి తెలిపారు. కాగా బీజేపీ తమతో పొత్తు వద్దనుకుంటే...నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని చంద్రబాబు ఇవాళ మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాబు వ్యాఖ్యలపై స్పందించే సమయం వచ్చింది.. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ...‘ చంద్రబాబుపై స్పందించే సమయం ఆసన్నమైంది. మా పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందిస్తుంది. చంద్రబాబు ఉండనంటే అది వారిష్టం. అసలు టీడీపీ మిత్ర ధర్మం పాటిస్తుందా?. ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టారు?. కేంద్రంపై మీరు సుప్రీంకోర్టుకు వెళ్తారా?. అలా కేసు వేస్తాననడం మిత్రధర్మం ఉల్లంఘన కాదా? చంద్రబాబుకు పొత్తు ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా?.’ అని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment