సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి – విశాఖపట్నం : రాష్ట్ర ప్రయోజనాల పేరుతో సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతో ప్రవర్తి స్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, దానికోసం ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, ప్రతిపక్ష నేత జగన్ ఆ ఆందోళనను ముందుకు తీసుకెళ్తుంటే అందుకు సహకరించవద్దని, హోదాకు, ప్యాకేజీకి తేడా రూ.3 వేల కోట్లేనని గతంలో చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం నినాదాన్ని తెరపైకి తేవటంలో కుట్ర దాగుందని స్పష్టం చేస్తున్నారు. ఒక రోజు కేంద్రం అన్నీ ఇచ్చిందని అంటూ మరో రోజు ఏమీ రాలేదని సీఎం అనటాన్ని ఖండించారు. రాష్ట్రం మేలు కోసం ఆలోచించే వారు ఇలా పూటకో రకంగా మాట్లాడరని గుర్తు చేస్తున్నారు. రెండు నాలుకల ధోరణితో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
‘‘హోదా అంటే జైలుకే’’ అన్నది చంద్రబాబే
‘‘హోదా అంటే జైలుకే’’అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా హెచ్చరించారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజు గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం గతంలో పలు కార్యక్రమాలు చేపట్టినప్పుడు చంద్రబాబు ఈ మాటలు అన్నారని తెలిపారు. మరిప్పుడు జైలుకు ఎవరు వెళ్లాలో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పలు సందర్భాల్లో ప్రత్యేక హోదా గురించి బాబు చేసిన వ్యాఖ్యలను విలేకరులకు చూపారు.
తేడా రూ.3 వేల కోట్లన్నది మీరే
ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్నారని సోము వీర్రాజు తెలిపారు. హోదాకు, ప్యాకేజీకి తేడా రూ.3 వేల కోట్లే అని చెప్పిన సీఎంను మీడియా ప్రశ్నించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే చట్టం తనపని తాను చేసుకు పోతుందని హెచ్చరించిన బాబుకు ఏ చట్టం వర్తిస్తుందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా బంద్‌కు సహకరించవద్దని చంద్రబాబే చెప్పారని, హోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఏమీ జరగలేదని సీఎం అన్నారని వీర్రాజు గుర్తు చేశారు.
ఇంతకంటే ఎక్కువగా అడగలేం అనలేదా?
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఏం కావాలో అడగకుండా సీఎం రమేష్, సుజనా చౌదరి పార్లమెంట్‌లో సమన్యాయం కావాలన్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అనంతరం మంత్రి పదవి చేపట్టిన తరువాత.. ‘కేంద్రం అన్నీ ఇచ్చింది.. ఇంతకంటే ఎక్కువగా అడగలేం..’అని సుజనా చెప్పారన్నారు. ప్రత్యేక హోదాకు రాయితీలకు సంబంధం లేదని, ఒకవేళ ఇచ్చినా ఈ ఏడాది మార్చి వరకే ఉంటుందని సుజనా చెప్పారన్నారు.
నాడు ఆనందబాష్పాలు రాల్చారు...
రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైనప్పుడు ప్రధాని మోదీ మంత్రులతో పవిత్ర జలాలను తెప్పించి మంచి ఆశయంతో ఇచ్చారని, అప్పుడు ఆనందబాష్పాలు రాల్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దాన్ని వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని వీర్రాజు ప్రశ్నించారు. ప్రధాని రాజధానికి రాక ముందే అమరావతికి రూ.లక్ష కోట్లు ఇవ్వనున్నట్లు టీడీపీ నేతలే ప్రచారం చేసుకున్నారని చెప్పారు.
నేను ఎక్కువగా మాట్లాడటం వల్లే..
సీలేరు ప్రాజెక్టు, భద్రాచలం దేవాలయం సహా పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో ఉంచాలని కేసీఆర్ నాడు సోనియాగాంధీని అడిగారని, అయితే భద్రాచలాన్ని ఏపీలో ఉంచాలని కోరితే తనను సస్పెండ్ చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారని వీర్రాజు చెప్పారు. ఏపీ అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడటం వల్లనే టీడీపీ నేతలకు తాను దూరమయ్యానన్నారు.
వాస్తవాలనే ప్రజలకు చెబుతున్నాం...
మీరు టీడీపీనే ఎందుకు కౌంటర్ చేస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు వీర్రాజు సమాధానం ఇస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ విడుదల చేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించే వివరిస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాలుగు ఏళ్లుగా కేంద్రం నుంచి సహకారం పొంది ఇప్పుడు మాట మార్చారని, ఆ వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువగానే నిధులు వచ్చాయని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం లేదంటూ ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రధాని మోదీని అవమానపరిచే రీతిలో సంబోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై లేదా?; అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, దశలవారీగా విడుదల చేస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఆత్మగౌరవ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీఎం తో కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడిన తర్వాతే ప్యాకేజీ ఫైనల్ చేసి ప్రకటించారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదంటున్న బాబు మాటలు రెచ్చగొట్టే మాదిరిగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే వారు ఒక్క మాటకే కట్టుబడి ఉంటారు.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఆశించే వారు రోజుకో మాట మాట్లాడతారని బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, శిక్షణ విభాగాల కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.
హోదా అంటే జైల్ అన్నావ్
Published Sat, Feb 24 2018 1:43 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment