
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్వరంలో మార్పు వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని అని చెబుతూ ఉద్యమించి పార్లమెంటులో పోరాడేందుకు, ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ మళ్లీ ఆ బాట పట్టాలనే ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు హోదా గురించే మాట్లాడుతున్న తరుణంలో దాన్ని పట్టించుకోకపోతే ఇబ్బందుల్లో పడతామని టీడీపీ భావిస్తోంది.
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దనున్న ప్రజాదర్బార్ హాలులో ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశం పై చర్చ జరిగినట్లు తెలిసింది. హోదా నినాదాన్ని వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళుతుండటం, ప్రజాభిప్రా యమూ అటువైపే ఉన్న తరుణంలో దాన్ని వ్యతిరేకించకూడదనే అభిప్రా యం సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. జగన్ హోదా పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తూనే, మిగిలిన రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు దాన్ని ఏపీకి ఎందుకివ్వరనే విషయాన్ని లేవనెత్తుదామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. 14వ ఆర్థిక సంఘం కొత్తగా ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేమని, అందుకు సమానంగా ప్రత్యేక సాయం చేస్తామంటేనే ఒప్పుకున్నామనే వాదనను వినిపించాలని సూచించారు.
ప్రభుత్వంలో ఉంటూ అవిశ్వాసం పెట్టలేం
ప్రభుత్వంలో ఉండి అవిశ్వాసం పెట్టలేమని చెప్పారు. అవిశ్వాసం పెట్టినా ఉపయోగం ఉండదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. బీజేపీ నాయకుల విమర్శలు, రాష్ట్రానికి ఇచ్చామంటున్న నిధులపై గట్టిగా మాట్లాడాలని చంద్రబాబు చెప్పారు.