
విశాఖ సిటీ: రాష్ట్రంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయ విమర్శలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. దేశంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకురాని విధంగా రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చానంటూ గతంలో ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాటమార్చేయడం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ఆర్థిక సాయం.. మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తమపై వస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలనే అస్త్రంగా సంధించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం శనివారం విశాఖపట్నంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మిత్రపక్షం టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై చర్చించారు.
తగిన రీతిలో బదులిస్తాం..
సమావేశం అనంతరం మీడియా సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది, ఏం చెయ్యబోతోంది అనే అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీకి తగిన రీతిలో సమాధానం చెప్పాలని నిర్ణయించామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ... కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకొచ్చానని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంద్ చేపడితే తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment