అమలాపురం రూరల్ : చిరకాలవాంఛ అయిన కోనసీమ రైల్వేలైను సాధనకు కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవచూపేలా చేయాలని కోనసీమకు చెందిన బీజేపీ నాయకులు విశాఖపట్నం ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కలసి విజ్ఞప్తి చేశారు. కోనసీమ రైల్వే లైనుకు గతంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలోనే పునాది రాయ పడిందని..గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ లైను ఎలాంటి ప్రగతికి నోచుకోలేదని వివరించారు. మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తున్న తరుణంలో కోనసీమ లైను నిర్మాణం తక్షణమే చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని హరిబాబును కోరారు.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, సీమాంధ్ర ఉద్యమ కమిటీ కన్వీనర్ కర్రి చిట్టిబాబు, రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, జిల్లా యువమోర్చ ప్రధాన కార్యదర్శి యల్లమిల్లి కొండ, అమలాపురం పట్టణ యువమోర్చ అధ్యక్షుడు బసవా సత్యసంతోష్ తదితరులు హరిబాబును కలిసినవారిలో ఉన్నారు. వీరు విశాఖపట్నంలో ఆదివారం హరిబాబును కలిసి శుభాకాంక్షలు తెలపడంతోపాటు కోనసీమ పెండింగ్ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లి కోనసీమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హరిబాబు హామీ ఇచ్చారు.
కోనసీమ రైల్వేలైన్ సాధనకు కృషి చేయాలి
Published Tue, May 20 2014 12:28 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement