konaseema railway line
-
అవాంతరాలు అధిగమిస్తేనే 2022 నాటికి రైల్వేకూత
కోనసీమలో రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు దండిగా ఉన్నా అడుగడుగునా అవాంతరాలే ఏర్పడుతున్నాయి. ఒకవైపు నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉంది. ప్రధాన వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి.రెండొంతుల భూసేకరణ పూర్తయింది. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి మలికిపురం మండలం దిండి వరకు భూసేకరణ పూర్తి కాకపోవడంతో రైల్వే నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని కోనసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకునిధుల కేటాయింపుపై జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అమలాపురం: దశాబ్దకాలం నాటి కోనసీమ రైల్వేలైన్‌కు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత భారీగా నిధుల కేటాయింపు జరిగింది. గడిచిన నాలుగు బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.1,030 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.126 కోట్లు కేటాయించాయి. మొత్తం రూ.1,156 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయి. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం తొలి అంచనా రూ.1,045.20 కోట్లు కాగా, అది ఇప్పుడు రూ.2,120 కోట్లకు చేరింది. ఇంతవరకు రూ.667.11 కోట్ల విలువ చేసే మూడు ప్రధాన వంతెనల నిర్మాణాలు మొదలయ్యాయి. దీనిలో గౌతమీ మీద వంతెనకు రూ.346.87 కోట్లు, వైనతేయ, వశిష్ఠ నదులపై రూ.320.24 కోట్లకు టెండర్లు ఖరారై పనులు వేగంగా సాగుతున్నాయి. గౌతమీ పనులు వేగంగా సాగుతుండగా, వైనతేయ, వశిష్ఠ పనులు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. మంజూరైన నిధుల్లో వంతెనలకు కేటాయించిన నిధులు పోగా, ఇంకా రూ.488.89 కోట్ల పనులు మొదలు కావాల్సి ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణాలు పూర్తయిన తరువాత ట్రాక్ పనులు జరిగే అవకాశముంటుంది. పూర్తికాని భూసేకరణ ప్రధాన వంతెనల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతున్నా ట్రాక్ నిర్మాణ పనులకు ఇంతవరకు టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇందుకు భూసేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఈ రైల్వే నిర్మాణానికి కోటిపల్లి నుంచి అయినవిల్లి మండలం మాగాం మీదుగా అమలాపురం మండలం భట్నవల్లి వరకు సుమారు 154 ఎకరాల భూసేకరణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చించినాడ నుంచి నరసాపురం వరకు దాదాపుగా భూసేకరణ పూర్తయింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ వంతెనకు అవసరమైన 14.87 ఎకరాల భూసేకరణ సైతం పూర్తయ్యింది. పాశర్లపూడి వైపు వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న మత్స్యకారుల కోసం 3.6 ఎకరాలను సమీపంలోని పాశర్లపూడి బాడవలో రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వారికి పునరావాసం కల్పించనున్నారు. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి రోళ్లపాలెం, పేరమ్మ అగ్రహారం, పేరూరు, తోట్లపాలెం, మామిడికుదురు మండలం పాశర్లపూడి, జగ్గంపేట, రాజోలు నుంచి దిండి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. ఇందుకు రైల్వే శాఖ నుంచి భూమికి అవసరమైన ప్రతిపాదన రెవెన్యూ అధికారులకు అందలేదు. దీంతో ఇక్కడ భూసేకరణ ముందుకు సాగడం లేదు. రైల్వే ప్రధాన వంతెనల నిర్మాణం పూర్తయిన తరువాత శాఖ ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతుందని, ఇందుకు సమయం పడుతున్నందునే రైల్వేశాఖ రాజోలు దీవిలో భూసేకరణ ప్రతిపాదనలు వేగంగా చేయడం లేదని పలువురు అంటున్నారు. ట్రాక్ నిర్మాణం వేగవంతం చేస్తేనే లక్ష్యానికి చేరేది నిధులున్నందున ప్రధాన వంతెనలతోపాటు ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాలని కోనసీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. డెల్టాలో కీలకమైన కోనసీమలో పంట, మురుగునీటి ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంట బోదెల వ్యవస్థ ఎక్కువ కావడం వల్ల పెద్ద ఎత్తున వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ రైల్వేట్రాక్‌లో మూడు నదీపాయలపై ప్రధాన వంతెనలు మాత్రమే కాకుండా ఇంకా 185 వరకు వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనిలో 15 పెద్దవి కాగా, 170 వరకు చిన్నవి ఉన్నాయి. ఒక వంతెన మాత్రం రోడ్డుపై నిర్మించాల్సి ఉండగా, రోడ్డుకు దిగువన 48 వంతెనలు నిర్మించాల్సి ఉంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కావాలని అనుకుంటే ఇంకా 35 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచి పెద్ద, చిన్న వంతెనల నిర్మాణాలు మొదలు పెడితే నిర్ణీత షెడ్యూలు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని కోనసీమవాసులు అంటున్నారు. పైగా ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.488.89 కోట్లు ఉండనే ఉన్నాయి. అయితే రైల్వేశాఖ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే కోనసీమవాసులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఈ ఏడాది ఎంత? కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్లో కోనసీమ రైల్వేలైన్‌కు కేటాయించే నిధులపై ఈ ప్రాంత వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గత నాలుగు బడ్జెట్లలో కేంద్రం భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు 2001–02 నుంచి 2015–16 వరకు కేటాయించిన నిధులు కేవలం రూ.90.2 కోట్లు మాత్రమే. 2016–17 నుంచి నిధులు కేటాయింపు భారీగా పెరిగింది. ఆ ఏడాది రూ.200 కోట్లు, 2017–18లో రూ.430 కోట్లు, 2018–19లో రూ.200 కోట్లు, 2019–20లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపు భారీగా ఉంటుందని కోనసీమ వాసులు ఆశతో ఉన్నారు. త్వరలోనే భూసేకరణ కోనసీమ రైల్వేలైన్‌కు త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. మత్స్యకారులకు పునరావాసం కల్పించేందుకు 3.6 ఎకరాలను సేకరించాం. రైల్వేశాఖ నుంచి ప్రతిపాదనలు అందగానే భూసేకరణ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది. – బీహెచ్ భవానీశంకర్,ఆర్డీవో, అమలాపురం సమాంతరంగా ట్రాక్‌నిర్మాణం చేయాలి రైల్వే ప్రాజెక్టు నిర్ణీత షెడ్యూలు ప్రకారం పూర్తి కావాలంటే ప్రధాన వంతెనల నిర్మాణాలతోపాటు సమాంతరంగా ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. వంతెనలు ఎక్కువగా నిర్మించాల్సి ఉన్నందున వెంటనే ఆ పనులకు టెండర్లు పిలవాలి. అప్పుడు ఇది 2022 నాటికి పూర్తవుతుంది.– బండారు రామ్మోహన్, కోనసీమరైల్వేసాధన సమితి సభ్యుడు -
‘కోనసీమకు రైల్వేలైన్ సాధిసా’్త
అమలాపురం, న్యూస్‌లైన్: కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ సాధిస్తానని అమలాపురం ఎంపీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్ల సత్యనారాయణరావు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై రైల్వేబోర్డు సభ్యులు, చీఫ్ ఇంజనీర్లతో చర్చించానన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను కాకినాడ-పిఠాపురం మీదుగా మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేస్తేనే ఉపయోగం ఉంటుందని రైల్వే అధికారులు చెప్పారన్నారు. ఈ లైన్‌పై కోటిపల్లి, బోడసకుర్రు, నర్సాపురం గోదావరిలపై 150 మైనర్ వంతెనలు, 50 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందని రైల్వేబోర్డు అధికారులు ప్రతిపాదనలు చేశారన్నారు. దీనికి అవసరమైన భూసేకరణ, సాయిల్ టెస్ట్ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారన్నారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం అంశం ప్రధానమంత్రి నరేంద్రమోడి దృష్టికి తీసుకెళ్లానని, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వేమంత్రి సదానందగౌడ్‌లతో చర్చించి రైల్వేబడ్జెట్‌లో నిధులు సాధించి అమలాపురానికి రైలు తీసుకొస్తానని ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. కోనసీమలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక సిద్ధం చేశానన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వ అధికారులు, ఓఎన్జీసీ, చమురు సంస్థలతో చర్చించానన్నారు. కోనసీమలో సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జీఎస్పీసీ సంస్థ మత్స్యకారులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించలేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మెట్ల సత్యనారాయణరావు మాట్లాడుతూ కోనసీమను ప్రత్యేక జిల్లా చేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ రవీంద్రబాబు రైల్వేలైన్ సాధించగలరన్న ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ విజేత అధికారి జయవెంకటలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యాళ్ల మల్లేశ్వరరావు, టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, అల్లాడి స్వామినాయుడు, తిక్కిరెడ్డి నేతాజీ, చిక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
కోనసీమ రైల్వేలైన్ సాధనకు కృషి చేయాలి
అమలాపురం రూరల్ : చిరకాలవాంఛ అయిన కోనసీమ రైల్వేలైను సాధనకు కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవచూపేలా చేయాలని కోనసీమకు చెందిన బీజేపీ నాయకులు విశాఖపట్నం ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కలసి విజ్ఞప్తి చేశారు. కోనసీమ రైల్వే లైనుకు గతంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనే పునాది రాయ పడిందని..గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ లైను ఎలాంటి ప్రగతికి నోచుకోలేదని వివరించారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్న తరుణంలో కోనసీమ లైను నిర్మాణం తక్షణమే చేపట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని హరిబాబును కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, సీమాంధ్ర ఉద్యమ కమిటీ కన్వీనర్ కర్రి చిట్టిబాబు, రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, జిల్లా యువమోర్చ ప్రధాన కార్యదర్శి యల్లమిల్లి కొండ, అమలాపురం పట్టణ యువమోర్చ అధ్యక్షుడు బసవా సత్యసంతోష్ తదితరులు హరిబాబును కలిసినవారిలో ఉన్నారు. వీరు విశాఖపట్నంలో ఆదివారం హరిబాబును కలిసి శుభాకాంక్షలు తెలపడంతోపాటు కోనసీమ పెండింగ్ సమస్యలపై చర్చించారు. ఈ విషయాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లి కోనసీమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హరిబాబు హామీ ఇచ్చారు. -
కోనసీమ రైల్వేలైన్ నా లక్ష్యం: పినిపే విశ్వరూప్
మూడేళ్లలో సాధిస్తా వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అమలాపురం/రాయవరం, న్యూస్‌లైన్ : ‘కోనసీమకు రైల్వేలైన్ సాధించడ మే నా లక్ష్యం . ఇందుకోసం లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచాను. ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపితే శక్తియుక్తులు ధారపోసి మూడేళ్లలో రైల్వేలైన్ సా ధిస్తాను’ అని అమలాపురం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. అంబాజీపేటలో పార్టీ నాయకుడు కొర్లపాటి కోటబాబు ఇంటి వద్ద పార్టీలోకి చేరిన వారికి సోమవారం ఆయన పార్టీ కండువాలు వేసి అభినందించారు. మండపేట అసెంబ్లీ అభ్యర్థి గిరజాల వెంకట స్వామినాయుడుతో కలిసి రాయవరం మండలం పసలపూడిలో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ ప్రాజెక్టు సాధనకు కృషి చేశారని, ఆయన మరణానంతరం ఇది మూలనపడిందన్నారు. పదేళ్లలో పది అంగుళాలు కూడా ప్రాజెక్టు కదల్దేదన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే ఈ ప్రాజెక్టు సాధన గొప్ప విషయం కాదన్నారు. ‘అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ స్థానాల్లో గెలిచాను. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేశాను. కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అయినా ఏదో వెలితి ఉండిపోయింది. కోనసీమ రైల్వేలైన్ సాధిస్తే అది తీరుతుంది’ అని చెప్పారు. పార్లమెంట్‌కు వెళితే రైల్వే ప్రాజెక్టు సాధిస్తాననే నమ్మకం ఉందని చెప్పారు. రైల్వే ప్రాజెక్టుతో పాటు కోనసీమలో చమురు, సహజవాయువుల అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కేజీ బేసిన్లో ఉన్న అపార చమురు నిక్షేపాలతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఆచరణ సాధ్యం కాని చంద్రబాబు హామీలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలన్నారు. సీఎంగా తొమ్మిదేళ్ల పాలనలో 13 వేల కోట్ల రైతు రుణాలపై వడ్డీనే మాఫీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు 1.20 లక్షల కోట్ల రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాస్, పార్టీ నాయకులు పేరి శ్రీనివాస్, ఎంఎం శెట్టి, వాసంశెట్టి చినబాబు, కొర్లపాటి నాగబాబు, అప్పన శ్రీనివాసరావు, ఆదూర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు. మూడు వంతెనలు పూర్తి చేస్తా జార్జిపేట (తాళ్లరేవు) : రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ముమ్మిడివరం నియోజకవర్గంలో పెం డింగ్‌లో ఉన్న మూడు వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేస్తానని విశ్వరూప్ హామీ ఇచ్చారు. జార్జిపేటలో పార్టీ నాయకురాలు అబ్బిరెడ్డి మంగతాయారు స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లంక గ్రామాల ప్రజల సౌకర్యార్ధం తాను ఎమ్మెల్యేగా ముమ్మిడివరంలో ప్రతిపాదించిన మూడు వంతెనలు నేటికీ పూర్తి కాలేదన్నారు. పశువుల్లంక-సలాదివారిపాలెం, జి.మూలపొలం-గొల్లగరవు వంతెనలకు నిధుల మంజూరైనా.. పనులు ముందుకుసాగలేదన్నారు. గోగుల్లంక-గుత్తెనదీవి వంతెన కలగానే మిగిలిపోయిందన్నారు. వైఎస్సార్ సీపీకి సూర్యారావు మద్దతు గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : రాజకీయ కురువృద్ధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాము సూర్యారావును వైఎస్సార్ సీపీ నాయకులు చలమలశెట్టి సునీల్, పెండెం దొరబాబు ఆయన నివాసంలో సోమవారం కలుసుకున్నారు. 98 ఏళ్ల సూర్యారావుకు ఏడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాలన నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇలాఉండగా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సునీల్, దొరబాబు ఆయనను కోరారు. దీనిపై సూర్యారావు స్పందిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని, వైఎస్ పాలన స్వర్ణయుగమన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. కొన్ని కారణాల రీత్యా పార్టీలో చేరకపోయినా.. వైఎస్సార్ సీపీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాజీ ఎంపీపీ మొగలి సుబ్రహ్మణ్యం(చిట్టిబాబు) కూడా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపారు.