కోనసీమ రైల్వేలైన్ నా లక్ష్యం: పినిపే విశ్వరూప్
మూడేళ్లలో సాధిస్తా వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్
అమలాపురం/రాయవరం, న్యూస్‌లైన్ : ‘కోనసీమకు రైల్వేలైన్ సాధించడ మే నా లక్ష్యం . ఇందుకోసం లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచాను. ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపితే శక్తియుక్తులు ధారపోసి మూడేళ్లలో రైల్వేలైన్ సా ధిస్తాను’ అని అమలాపురం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. అంబాజీపేటలో పార్టీ నాయకుడు కొర్లపాటి కోటబాబు ఇంటి వద్ద పార్టీలోకి చేరిన వారికి సోమవారం ఆయన పార్టీ కండువాలు వేసి అభినందించారు. మండపేట అసెంబ్లీ అభ్యర్థి గిరజాల వెంకట స్వామినాయుడుతో కలిసి రాయవరం మండలం పసలపూడిలో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ ప్రాజెక్టు సాధనకు కృషి చేశారని, ఆయన మరణానంతరం ఇది మూలనపడిందన్నారు. పదేళ్లలో పది అంగుళాలు కూడా ప్రాజెక్టు కదల్దేదన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే ఈ ప్రాజెక్టు సాధన గొప్ప విషయం కాదన్నారు. ‘అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ స్థానాల్లో గెలిచాను. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేశాను. కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అయినా ఏదో వెలితి ఉండిపోయింది. కోనసీమ రైల్వేలైన్ సాధిస్తే అది తీరుతుంది’ అని చెప్పారు. పార్లమెంట్‌కు వెళితే రైల్వే ప్రాజెక్టు సాధిస్తాననే నమ్మకం ఉందని చెప్పారు. రైల్వే ప్రాజెక్టుతో పాటు కోనసీమలో చమురు, సహజవాయువుల అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కేజీ బేసిన్‌లో ఉన్న అపార చమురు నిక్షేపాలతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఆచరణ సాధ్యం కాని చంద్రబాబు హామీలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలన్నారు. సీఎంగా తొమ్మిదేళ్ల పాలనలో 13 వేల కోట్ల రైతు రుణాలపై వడ్డీనే మాఫీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు 1.20 లక్షల కోట్ల రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాస్, పార్టీ నాయకులు పేరి శ్రీనివాస్, ఎంఎం శెట్టి, వాసంశెట్టి చినబాబు, కొర్లపాటి నాగబాబు, అప్పన శ్రీనివాసరావు, ఆదూర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు.
మూడు వంతెనలు పూర్తి చేస్తా
జార్జిపేట (తాళ్లరేవు) : రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ముమ్మిడివరం నియోజకవర్గంలో పెం డింగ్‌లో ఉన్న మూడు వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేస్తానని విశ్వరూప్ హామీ ఇచ్చారు. జార్జిపేటలో పార్టీ నాయకురాలు అబ్బిరెడ్డి మంగతాయారు స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లంక గ్రామాల ప్రజల సౌకర్యార్ధం తాను ఎమ్మెల్యేగా ముమ్మిడివరంలో ప్రతిపాదించిన మూడు వంతెనలు నేటికీ పూర్తి కాలేదన్నారు. పశువుల్లంక-సలాదివారిపాలెం, జి.మూలపొలం-గొల్లగరవు వంతెనలకు నిధుల మంజూరైనా.. పనులు ముందుకుసాగలేదన్నారు. గోగుల్లంక-గుత్తెనదీవి వంతెన కలగానే మిగిలిపోయిందన్నారు.
వైఎస్సార్ సీపీకి సూర్యారావు మద్దతు
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : రాజకీయ కురువృద్ధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాము సూర్యారావును వైఎస్సార్ సీపీ నాయకులు చలమలశెట్టి సునీల్, పెండెం దొరబాబు ఆయన నివాసంలో సోమవారం కలుసుకున్నారు. 98 ఏళ్ల సూర్యారావుకు ఏడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాలన నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇలాఉండగా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సునీల్, దొరబాబు ఆయనను కోరారు. దీనిపై సూర్యారావు స్పందిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని, వైఎస్ పాలన స్వర్ణయుగమన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నా తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. కొన్ని కారణాల రీత్యా పార్టీలో చేరకపోయినా.. వైఎస్సార్ సీపీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాజీ ఎంపీపీ మొగలి సుబ్రహ్మణ్యం(చిట్టిబాబు) కూడా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపారు.