Pinipe Viswarup Press Meet On New Pension Scheme For APSRTC Employees - Sakshi
Sakshi News home page

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అత్యధిక పెన్షన్‌ విధానం

Published Thu, Jul 13 2023 2:57 PM | Last Updated on Thu, Jul 13 2023 4:01 PM

Pinipe Viswarup Press Meet On New Pension Scheme For Rtc Employees - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అత్యధిక పెన్షన్‌ విధానం (హైయ్యెస్ట్‌ పెన్షన్‌ సిస్టమ్‌) అమలు కానుందని, అందుకు ఆర్టీసీ కార్మికులు అర్హులయ్యారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక పెన్షన్‌ కోసం పీఎఫ్‌ ఫండ్‌ ట్రస్ట్‌కు తెలంగాణతో సహా వేరే రాష్ట్రాల సంస్థలు దరఖాస్తు  చేసినా, కేవలం మన ఆర్టీసీకే ఆ అవకాశం వచ్చిందని.. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపడమేనని తెలిపారు.

50 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కాగా, వారితో పాటు.. 2014 తర్వాత రిటైర్‌ అయిన దాదాపు 10,200 మంది ఉద్యోగులు, కార్మికులు అత్యధిక పెన్షన్‌ విధానంలో ప్రయోజనం పొందుతారని చెప్పారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ‘ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు పెన్షన్‌ రానుంది. గతంలో వారికి కేవలం రూ. 3 వేల నుంచి రూ. 4 వేల పెన్షన్‌ మాత్రమే వచ్చేది. అదే ఇవాళ వారికి గౌరవప్రదమైన పెన్షన్‌ వస్తుందని.. దీంతో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని’ మంత్రి అన్నారు.

ప్రభుత్వ వేతనాలు:
ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు దాదాపు రూ. 10,570 కోట్ల జీతాలు చెల్లించిందన్నారు. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ మూలధనాన్ని ముట్టుకోక పోవడం వల్ల.. సంస్థ మనుగడ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వీటితో పాటు రుణాలు కూడా తీరుస్తోందన్నారు. సీఎంజగన్‌ నిర్ణయం, ఆయన చూపిన చొరవ వల్ల, సంస్థ అప్పుల నుంచి బయట పడడమే కాకుండా, ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు.

నాలుగేళ్లలో సంస్థ పురోగతి:
‘నాలుగేళ్లలో ఆర్టీసీ ఎంతో పురోగతి సాధించింది. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ అమలు చేస్తున్నాం. ఇంకా జనవరి 1, 2016 నుంచి డిసెంబరు 31, 2019 వరకు దాదాపు 858 మందికి కారుణ్య నియామకాల కింద వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్‌ఎస్‌ కార్డు వారికీ ఇచ్చాం. కొత్తగా 1500 డీజిల్‌ బస్సులు, 1000 విద్యుత్‌ బస్సులు కొంటున్నాం. ప్రతి ఉద్యోగికి రూ. 40 లక్షల ప్రమాద బీమా, రూ. 5 లక్షల సహజ మరణ బీమా సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటికే 390 కుటుంబాలకు ఆ బీమా ద్వారా లబ్ధి చేకూరిందని’ చెప్పారు.

చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement