‘కోనసీమకు రైల్వేలైన్ సాధిసా’్త
అమలాపురం, న్యూస్‌లైన్: కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ సాధిస్తానని అమలాపురం ఎంపీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్ల సత్యనారాయణరావు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై రైల్వేబోర్డు సభ్యులు, చీఫ్ ఇంజనీర్లతో చర్చించానన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను కాకినాడ-పిఠాపురం మీదుగా మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేస్తేనే ఉపయోగం ఉంటుందని రైల్వే అధికారులు చెప్పారన్నారు.
ఈ లైన్‌పై కోటిపల్లి, బోడసకుర్రు, నర్సాపురం గోదావరిలపై 150 మైనర్ వంతెనలు, 50 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందని రైల్వేబోర్డు అధికారులు ప్రతిపాదనలు చేశారన్నారు. దీనికి అవసరమైన భూసేకరణ, సాయిల్ టెస్ట్ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారన్నారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం అంశం ప్రధానమంత్రి నరేంద్రమోడి దృష్టికి తీసుకెళ్లానని, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వేమంత్రి సదానందగౌడ్‌లతో చర్చించి రైల్వేబడ్జెట్‌లో నిధులు సాధించి అమలాపురానికి రైలు తీసుకొస్తానని ఎంపీ రవీంద్రబాబు చెప్పారు. కోనసీమలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక సిద్ధం చేశానన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రప్రభుత్వ అధికారులు, ఓఎన్జీసీ, చమురు సంస్థలతో చర్చించానన్నారు.
కోనసీమలో సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జీఎస్‌పీసీ సంస్థ మత్స్యకారులకు చెల్లించాల్సిన పరిహారం చెల్లించలేదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మెట్ల సత్యనారాయణరావు మాట్లాడుతూ కోనసీమను ప్రత్యేక జిల్లా చేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ రవీంద్రబాబు రైల్వేలైన్ సాధించగలరన్న ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ విజేత అధికారి జయవెంకటలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యాళ్ల మల్లేశ్వరరావు, టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, అల్లాడి స్వామినాయుడు, తిక్కిరెడ్డి నేతాజీ, చిక్కాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.