అవాంతరాలు అధిగమిస్తేనే 2022 నాటికి రైల్వేకూత | Konaseema Railway Lane Works Speedup East Godavari | Sakshi
Sakshi News home page

నిధులుండీ రాని రైలు బండి

Published Fri, Jan 31 2020 1:19 PM | Last Updated on Fri, Jan 31 2020 1:19 PM

Konaseema Railway Lane Works Speedup East Godavari - Sakshi

కోనసీమలో రైల్వేలైన్‌ నిర్మాణానికి నిధులు దండిగా ఉన్నా అడుగడుగునా అవాంతరాలే ఏర్పడుతున్నాయి. ఒకవైపు నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉంది. ప్రధాన వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి.రెండొంతుల భూసేకరణ పూర్తయింది. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి మలికిపురం మండలం దిండి వరకు భూసేకరణ పూర్తి కాకపోవడంతో రైల్వే నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని కోనసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకునిధుల కేటాయింపుపై జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

అమలాపురం: దశాబ్దకాలం నాటి కోనసీమ రైల్వేలైన్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత భారీగా నిధుల కేటాయింపు జరిగింది. గడిచిన నాలుగు బడ్జెట్‌లలో కేంద్ర ప్రభుత్వం రూ.1,030 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.126 కోట్లు కేటాయించాయి. మొత్తం రూ.1,156 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయి. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం తొలి అంచనా రూ.1,045.20 కోట్లు కాగా, అది ఇప్పుడు రూ.2,120 కోట్లకు చేరింది. ఇంతవరకు రూ.667.11 కోట్ల విలువ చేసే మూడు ప్రధాన వంతెనల నిర్మాణాలు మొదలయ్యాయి. దీనిలో గౌతమీ మీద వంతెనకు రూ.346.87 కోట్లు, వైనతేయ, వశిష్ఠ నదులపై రూ.320.24 కోట్లకు టెండర్లు ఖరారై పనులు వేగంగా సాగుతున్నాయి. గౌతమీ పనులు వేగంగా సాగుతుండగా, వైనతేయ, వశిష్ఠ పనులు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. మంజూరైన నిధుల్లో వంతెనలకు కేటాయించిన  నిధులు పోగా, ఇంకా రూ.488.89 కోట్ల పనులు మొదలు కావాల్సి ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణాలు పూర్తయిన తరువాత ట్రాక్‌ పనులు జరిగే అవకాశముంటుంది.

పూర్తికాని భూసేకరణ
ప్రధాన వంతెనల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతున్నా ట్రాక్‌ నిర్మాణ పనులకు ఇంతవరకు టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇందుకు భూసేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఈ రైల్వే నిర్మాణానికి కోటిపల్లి నుంచి అయినవిల్లి మండలం మాగాం మీదుగా అమలాపురం మండలం భట్నవల్లి వరకు సుమారు 154 ఎకరాల భూసేకరణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చించినాడ నుంచి నరసాపురం వరకు దాదాపుగా భూసేకరణ పూర్తయింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ వంతెనకు అవసరమైన 14.87 ఎకరాల భూసేకరణ సైతం పూర్తయ్యింది. పాశర్లపూడి వైపు వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న మత్స్యకారుల కోసం 3.6 ఎకరాలను సమీపంలోని పాశర్లపూడి బాడవలో రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వారికి పునరావాసం కల్పించనున్నారు. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి రోళ్లపాలెం, పేరమ్మ అగ్రహారం, పేరూరు, తోట్లపాలెం, మామిడికుదురు మండలం పాశర్లపూడి, జగ్గంపేట, రాజోలు నుంచి దిండి వరకు భూసేకరణ పూర్తి కాలేదు. ఇందుకు రైల్వే శాఖ నుంచి భూమికి అవసరమైన ప్రతిపాదన రెవెన్యూ అధికారులకు అందలేదు. దీంతో ఇక్కడ భూసేకరణ ముందుకు సాగడం లేదు. రైల్వే ప్రధాన వంతెనల నిర్మాణం పూర్తయిన తరువాత శాఖ ట్రాక్‌ నిర్మాణ పనులు చేపడుతుందని, ఇందుకు సమయం పడుతున్నందునే రైల్వేశాఖ రాజోలు దీవిలో భూసేకరణ ప్రతిపాదనలు వేగంగా చేయడం లేదని పలువురు అంటున్నారు.

ట్రాక్‌ నిర్మాణం వేగవంతం చేస్తేనే లక్ష్యానికి చేరేది
నిధులున్నందున ప్రధాన వంతెనలతోపాటు ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టాలని కోనసీమవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. డెల్టాలో కీలకమైన కోనసీమలో పంట, మురుగునీటి ప్రధాన పంట కాలువలు, చానల్స్, పంట బోదెల వ్యవస్థ ఎక్కువ కావడం వల్ల పెద్ద ఎత్తున వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ రైల్వేట్రాక్‌లో మూడు నదీపాయలపై ప్రధాన వంతెనలు మాత్రమే కాకుండా ఇంకా 185 వరకు వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనిలో 15 పెద్దవి కాగా, 170 వరకు చిన్నవి ఉన్నాయి. ఒక వంతెన మాత్రం రోడ్డుపై నిర్మించాల్సి ఉండగా, రోడ్డుకు దిగువన 48 వంతెనలు నిర్మించాల్సి ఉంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2022 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కావాలని అనుకుంటే ఇంకా 35 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచి పెద్ద, చిన్న వంతెనల నిర్మాణాలు మొదలు పెడితే నిర్ణీత షెడ్యూలు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని కోనసీమవాసులు అంటున్నారు. పైగా ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.488.89 కోట్లు ఉండనే ఉన్నాయి. అయితే రైల్వేశాఖ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే కోనసీమవాసులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.

ఈ ఏడాది ఎంత?
కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌లో కోనసీమ రైల్వేలైన్‌కు కేటాయించే నిధులపై ఈ ప్రాంత వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గత నాలుగు బడ్జెట్లలో కేంద్రం భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు 2001–02 నుంచి 2015–16 వరకు కేటాయించిన నిధులు కేవలం రూ.90.2 కోట్లు మాత్రమే. 2016–17 నుంచి నిధులు కేటాయింపు భారీగా పెరిగింది. ఆ ఏడాది రూ.200 కోట్లు, 2017–18లో రూ.430 కోట్లు, 2018–19లో రూ.200 కోట్లు, 2019–20లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపు భారీగా ఉంటుందని కోనసీమ వాసులు ఆశతో ఉన్నారు.

త్వరలోనే భూసేకరణ
కోనసీమ రైల్వేలైన్‌కు త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. మత్స్యకారులకు పునరావాసం కల్పించేందుకు 3.6 ఎకరాలను సేకరించాం. రైల్వేశాఖ నుంచి ప్రతిపాదనలు అందగానే భూసేకరణ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది.   – బీహెచ్‌ భవానీశంకర్,ఆర్డీవో, అమలాపురం

సమాంతరంగా ట్రాక్‌నిర్మాణం చేయాలి
రైల్వే ప్రాజెక్టు నిర్ణీత షెడ్యూలు ప్రకారం పూర్తి కావాలంటే ప్రధాన వంతెనల నిర్మాణాలతోపాటు సమాంతరంగా ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. వంతెనలు ఎక్కువగా నిర్మించాల్సి ఉన్నందున వెంటనే ఆ పనులకు టెండర్లు పిలవాలి. అప్పుడు ఇది 2022 నాటికి పూర్తవుతుంది.– బండారు రామ్మోహన్, కోనసీమరైల్వేసాధన సమితి సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement