
ప్రజలే లక్ష్య సారథులు
విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వఛ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రజలే సారథ్యం వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. బీజేపీ నగర నాయకులు చిన్ని చిట్టిబాబు ఆధ్వర్యాన సోమవారం 58వ డివిజన్ సుందరయ్యనగర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. విశాఖ ఎంపీ కె.హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు పాల్గొని రోడ్లు శుభ్రంచేసి చెత్తను తొలగించారు. హరిబాబు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పారిశుధ్య ప్రాముఖ్యత గుర్తించాలని సూచించారు.
పరిసరాలను మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు సహజంగా నగరం, రాష్ట్రంతోపాటు దేశం పరిశుభ్రంగా ఉంటుందని, దీని ద్వారా అంతర్జాతీయ సమాజంలో దేశానికి గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి 2 గంటల సమయాన్ని పరిసరాలను శుభ్రం చేసేందుకు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, నిరక్షరాస్యులకు పారిశుధ్యంపై అవగాహన లేకపోవడంతో వారు నివశిస్తున్న ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు.
బహిరంగంగా చెత్తను వేయకుండా అందరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి పి.మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ దేహ పరిశుభ్రత ఎంత అవసరమో పరిసరాల పరిశుభ్రత అంతే అవసరమని అన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రులు స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు జమ్ముల శ్యాంకిషోర్, రవీంద్రరాజు, నగర అధ్యక్షుడు డి.ఉమామహేశ్వరరావు, నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, 58వ డివిజన్ కార్పొరేటర్ పైడి తులసి, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎస్.నాగేశ్వరరావు, పి.పూర్ణచంద్రరావు తదిరులు పాల్గొన్నారు.