
రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే...: హరిబాబు
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రైతుల అనుమానాలు నివృత్తి చేశాకే భూ సమీకరణ జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. అయితే రాజధాని విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను రాజధానిలో నిర్మించినా... అధికారుల కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హరిబాబు అన్నారు. పరిపాలనను వీలైనంత త్వరగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని హరిబాబు అన్నారు.
టీడీపీ-బీజేపీ మైత్రిపై చంద్రబాబు స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేయాలని హరిబాబు కోరారు. ఉమ్మడి ఇంటర్ బోర్డు వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.