రథసారథి కోసం బీజేపీ అన్వేషణ
* హరిబాబు, వీర్రాజులతో పాటు మరికొందరి పేర్ల పరిశీలన
* కుల సమీకరణాలు, ఆరెస్సెస్ నేతలతో సంప్రదింపులు
* టీడీపీతో పొత్తు లేకుంటేనే మేలంటున్న శ్రేణులు
సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఎన్నికలకు ముందుగానే కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. బీజేపీ జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడుతో పాటు ఆ పార్టీ జాతీయ సంస్థాగత కార్యదర్శి సతీష్‌జీ రెండు రోజుల క్రితం నగరానికి వచ్చినప్పుడు ఈ మేరకు కసరత్తు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా 13 జిల్లాలకు చెందిన కొంతమంది ముఖ్య నేతలతో పాటు ఆరెస్సెస్ నేతలను కూడా సంప్రదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పలు కోణాల్లో అన్వేషణ
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీపై కూడా సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమర్థుడైన నాయకులు లేకపోతే ఈ ప్రాంతంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని, అందుకోసం కుల సమీకరణాలు, ఆరెస్సెస్‌కు అనుకూలంగా ఉండేవారి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జాతీయ క్రమశిక్షణ సంఘం చైర్మన్, విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు పేరును తొలుత పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వెంకయ్యనాయుడుతో కలిసి ఆంధ్రా యూనివర్సిలో విద్యార్థి సంఘనేతగా ఎదిగిన హరిబాబుకి మంచి వ్యూహాకర్తగా గుర్తింపు ఉంది.
వెంకయ్యనాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా హరిబాబు ఇక్కడే ఉండి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ఆ పార్టీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకు వెళ్లడంతోనూ కీలక పాత్ర పోషించారు. మరో సామాజిక వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా నేత, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పేరు కూడా పరిశీలనలో ఉంది. గతంలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవంతో పాటు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే ఆరెస్సెస్ కార్యక్రమాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ రెండు సామాజిక వర్గాలకు కాకుండా చిత్తూరు జిల్లా నేత నరసింహారెడ్డి లేదా నెల్లూరు జిల్లా నేత ఎస్.సురేష్‌రెడ్డిల పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్‌కిషోర్ సైతం రేస్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే రాజకీయ రాజధాని అయిన కృషా ్ణజిల్లా నుంచి అధ్యక్ష పదవికి పోటీపడేవారు ఒక్కరూ లేకపోవడం విశేషం.
ఆర్థిక వనరుల మాటేంటి?
పార్టీని రాష్ట్ర స్థాయిలో నడపడం ఖర్చుతో కూడుకున్నదని నేతలందరికీ తెలుసు. ఇప్పటివరకు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ కీలకనేతలైన బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బద్దంబాల్‌రెడ్డి చూసుకునేవారు. వీరంతా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కొత్తగా వచ్చే అధ్యక్షుడిపై పడుతుంది. దీంతో పదవిపై మోజు ఉన్నప్పటికీ నేతలు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. బీజేపీకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చేవారు కూడా ఈ ప్రాంతంలో తక్కువేనని, కొద్దిమంది ఉన్నా జాతీయస్థాయిలోనే అందజేస్తారని చెబుతున్నారు.
టీడీపీతో పొత్తు లేకపోతేనే లాభం
టీడీపీతో పొత్తులేకుండా ఉంటేనే లాభమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దేశం లో నరేంద్రమోడీ గాలి వీస్తోందని, అందువల్ల కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారంటున్నారు. మొదటి నుంచి విభజనకు అనుకూలమని బీజేపీ చెబుతోందని, అయితే చంద్రబాబు వెళ్లి తమపార్టీ జాతీయ నేతల్ని కలిసి రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నట్లు హడావుడి చేసి, ఇప్పుడు విభజన పాపాన్ని తమపైకి నెడుతున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోఉంది. బాబుకు దూరంగా ఉండి సీమాంధ్రలో పార్టీని జాగ్రత్తగా అభివృద్ధి చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుపై దృష్టి
రాష్ట్ర రాజధాని ప్రకటించేందుకు మరో ఆరేడు నెలలు పడుతుంది. అప్పటి వరకు విజయవాడలో ఉన్న పార్టీ కార్యాలయాన్నే రాష్ట్ర పార్టీ కార్యాలయంగా నడపాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో ఆ పార్టీ కార్యాలయానికి సొంత భవనం ఉండటంతో పాటు విశాలంగా కూడా ఉండటంతో ఇదే సరిపోతుందని చెబుతున్నారు.