టీఆర్ఎస్తో పొత్తు ఉంటే బాగుండేది: దత్తాత్రేయ
టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటే బాగుండేదని బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాబ్ లోక్సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ అన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోలేకపోయామని తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడారు. బీజేపీకి అన్ని పార్టీల మద్దతు అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
నరేంద్రమోడీ ప్రభావంతో ఓట్ల శాతాన్ని పెంచుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. అపాయింటెడ్ డేగా జూన్ 2వ తేదీ నిర్ణయించారు. అనంతరం దేశ సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే... తెలంగాణలో మాత్రం బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ బాగా లాభపడగా..... తెలంగాణలో మాత్రం ఆ పార్టీ సికింద్రాబాద్ లోక్సభతోపాటు అంబర్పేట, ఖైరతాబాద్, ఉప్పల్ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే మరిన్ని సీట్లు గెలుచుకుని ఉండేవాళ్లమని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. దాంతో తెలంగాణలో కూడా తమ హవా కొనసాగేదన్నారు.