ఏపీలో 2,184 కుటుంబాలకు ఆరోగ్య బీమా లబ్ధి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య బీమా పథకం కింద ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 2,184 కుటుంబా లు లబ్ధిదారులుగా ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. బీమా పథకానికి సంబంధించి లోక్‌సభలో సోమవారం బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి దత్తాత్రేయ బదులిచ్చారు.
అసంఘటిత రంగాల కార్మికులకు వర్తించేలా ఈ పథకం సేవలను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులు, లెసైన్సు రైల్వే పోర్టర్లు, వీధి వ్యాపారులు, ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులు, బీడీ కార్మికులు, ఇళ్లలో పనులు చేసేవారు, పారిశుద్ధ్య, గని కార్మికులు, సైకిల్ రిక్షా, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ బీమాను అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.