
భూములు లాక్కుంటే ఒప్పుకోం
రైతుల నుంచి గుంజుకుంటే వ్యతిరేకిస్తాం: కంభంపాటి హరిబాబు
గుంటూరు: రాజధాని నిర్మాణానికి రైతుల భూములను బలవంతంగా లాక్కోవటాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఒప్పించే అవసరమైన భూములను తీసుకోవాలన్నారు. గురువారం గుంటూరులో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, రాజధాని నిర్మాణానికి సహకారంపై కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుందన్నారు. రాజధాని నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూములు అవసరమవుతాయో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పారు.
ప్రధాని నరేంద్రమోదీ విధానాలు నచ్చి బీజేపీలో చేరేవారినే పార్టీలోకి ఆహ్వానిస్తామని, ఎవరినీ ప్రలోభాలు పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. మంత్రి పదవులు అనుభవించిన వారైనా బీజేపీలో చేరాక కార్యకర్త స్థాయి నుంచి పనిచేయాల్సిందేనని చెప్పారు. హుద్‌హుద్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విధంగా రూ. వెయ్యి కోట్ల సాయం పూర్తిగా అందుతుందని తెలిపారు. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వాటిల్లిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేస్తుందన్నారు.
బాబు తీరునే పరిగణనలోకి తీసుకుంటాం..
బీజేపీతో పొత్తుల విషయంపై టీడీపీకి చెందిన మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని, అవి వారి వ్యక్తిగతమనే భావిస్తామని హరిబాబు పేర్కొన్నారు. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహారశైలినే తాము పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలించడంపై వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమ, ప్రత్యేకాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్‌బాబు, సీనియర్ నేత కావూరి సాంబశివరావు, నగర అధ్యక్షుడు ఆలూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు.