
పొన్నూరు అభివృద్ధికి విస్తృతఅవకాశాలు
పొన్నూరు రూరల్
నవ్యాంధ్రప్రదేశ్‌లో పొన్నూరు అభివృద్ధికి విస్తృతఅవకాశాలు ఉన్నాయని, అందుకు బీజేపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన పొన్నూరు పురపాలక సంఘ స్వర్ణోత్సవాలకు ఆయన విశిష్ట అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పొన్నూరు అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ విశ్వ విద్యాలయానికి రైతు బాంధవుడు ఎన్‌జి రంగా పేరు పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.
తీరప్రాంతంలో 14 ఓడరేవులు ఉన్నాయని, వాటిలో నాలుగు మాత్రమే పని చేస్తున్నాయని ఆయన చెపుతూ పొన్నూరుకు అతి సమీపంలో ఉన్న నిజాంపట్నం ఓడరేవును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అలాగే విజయవాడ నుంచి చెన్నై వరకు బంకింగ్ హామ్ కాలువ ద్వారా జల రవాణాను అభివృద్ధి చేస్తామన్నారు. పొన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు.
అంతకు ముందు మరో ముఖ్య అతిథి ప్రభుత్వ, చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా పట్టణంలో పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పొన్నూరు పట్టణం అభివృద్ధి చెందాలంటే సక్రమంగా పన్నులు చెల్లించాలని పౌరులకు సూచించారు. ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ నడిచిన పట్టణంలో ఎందరో ప్రముఖులు ఉన్నారని, వారి గురించి వివరించారు.అనంతరం పట్టణంలోని కొందరు ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత సాంసృ్కతిక కార్యక్రమాలు పదర్శించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ సజ్జా హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, మహిళా నాయకురాలు స్వరూపరాణి, జెడ్పీటీసీ సభ్యుడు కోటా శ్రీనివాసరావు, ఎంపీపీ బొర్రు సీతమ్మ, మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.