కోరలు తీస్తా.. ఖబడ్దార్
♦ మగాడివైతే.. దమ్ముంటే..సిగ్గులేదు..
♦ అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇదీ సీఎం, మంత్రుల పదజాలం
♦ వేలెత్తి చూపించిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సోమవారం అధికారపక్షం సభా మర్యాదలకు పూర్తిగా తిలోదకాలిచ్చింది. ప్రతిపక్ష సభ్యులను ఇష్టానుసారం అన్‌పార్లమెంటరీ పదజాలంతో దూషించింది. వేలుపెట్టి చూపిస్తూ బెదిరింపులకు దిగింది. విపక్ష వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ కోడెల సోమవారం సభలో చర్చకు పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా.. జగన్‌పైనా, దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిపైనా అధికార పక్ష సభ్యులు, మంత్రులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సిగ్గులేదా.. ధైర్యం ఉంటే.. ఖబడ్దార్.. మగాడివైతే లాంటి మాటలను యథేచ్ఛగా ఉపయోగించారు. సీఎం సైతం ప్రతిపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా వేలెత్తి చూపుతూ, బల్లను కొడుతూ కోరలు తీస్తానని ప్రతిపక్షాన్ని హెచ్చరించారు.
ఒకరిని మించి మరొకరు..
జగన్‌మోహన్‌రెడ్డి వివిధ అంశాల్లో ప్రభుత్వ అవినీతిని, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రస్తావించగా.. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేచి ‘మిస్టర్ జగన్‌మోహన్‌రెడ్డి ఖబడ్దార్..’ అంటూ వేలెత్తి చూపుతూ బెదిరింపులకు దిగారు. విపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో స్పీకర్ కల్పించుకొని ఆ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. జగన్ సోలార్ కుంభకోణం గురించి ప్రస్తావించినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకున్నారు. ఆధారాలు చూపించాలంటూ ‘దమ్ముంటే.. ధైర్యముంటే.. మగాడివైతే..’ అంటూ మాట్లాడారు.
ఇంకో సందర్భంలో జగన్‌ను ఉద్దేశించి ‘కొవ్వెక్కి..’ అనే పదాన్ని అచ్చెన్నాయుడు ఉపయోగించారు. ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక చంద్రబాబైతే ఆవేశంతో ఊగిపోయారు. తాను చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయించాలని జగన్ డిమాండ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తూ.. (వేలెత్తి చూపు తూ) ‘సిగ్గు లేదు మీకు.. మీది దివాలా కోరు పార్టీ.. మీ ఆటలు ఇక్కడ సాగవు. నీలాంటి దుర్మార్గులు (జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి) ఉండబట్టే.. ఏం మాట్లాడుతున్నారు..’ అంటూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని జగన్ డిమాండ్ చేసినప్పుడల్లా.. అధికార టీడీపీ సభ్యులు ఈ విధంగా రెచ్చిపోయిన ఘటనలు సోమవారం సభలో అనేకసార్లు చోటుచేసుకున్నాయి.