ఇంట్లో నుంచి కాలు బయటపెడితే అనుచరుల హంగామా...పార్టీ నేతల స్వాగతాలు. అధిష్టానానికి తమగురించి చెప్పాలంటూ నాయకుల వినతులు. ఒకప్పుడు బీకే పార్థసారథి హవా ఇది...ఇప్పుడు మొత్తం మారిపోయింది. అధిష్టానం పట్టించుకోవడం లేదు. పైగా టికెట్ యూత్‌కేనంటూ తేల్చేసింది. వైరివర్గం ఫుల్‌జోష్‌లో ఉంది. మాట్లాడించే కార్యకర్త లేడు. కలిసి నడిచే నాయకుడు కరువు. పేరుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడే అయినా...మాట చెల్లడం లేదు.
సాక్షి, సత్యసాయి జిల్లా(పెనుకొండ): టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అందుకే పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన పూర్తిగా డీలా పడినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
బాబు ‘బాది’పోయాడా..
ఇటీవల చంద్రబాబు సోమందేపల్లిలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి బీకే పార్థసారథి పూర్తిగా నిరుత్సాహపడినట్లు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. 2024లో పెనుకొండ టికెట్‌పై చంద్రబాబు గానీ, లోకేష్ గానీ హామీ ఇవ్వకపోగా, ఈ సారి యువతకే అవకాశమని స్పష్టం చేయడంతో బీకే దిక్కుతోచని స్థితిలో పడ్డారని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీకే పార్థసారథి ఇప్పటికే 2, 3 సార్లు చంద్రబాబును, లోకేష్‌ను కలసినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అందువల్లే నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. దీంతో నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
చీలిన నాయకులు, కార్యకర్తలు..
పెనుకొండలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. బీకే వ్యవహారశైలి, ఆయన అల్లుడి అజమాయిషీ నచ్చని తెలుగు తమ్ముళ్లు రెండుగా విడిపోయారు. గతంలో బీకేకు అనుకూలంగా ఉన్న వారే ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్నారు. సొంతంగా గుంపుకట్టి పార్టీ కార్యక్రమాలు వేరుగా చేస్తున్నారు. బలప్రదర్శనతో అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ చుట్టూ్ట తిరిగిన వారంతా బాయ్ బాయ్ బీకే అంటూ వ్యతిరేక వర్గంలో చేరిపోయారు. బీకేకు పోటీగా కార్యక్రమాలు చేస్తూ నిరసన నిప్పు రాజేస్తున్నారు.
ప్రోత్సహిస్తున్న అధిష్టానం..
బీకే వ్యతిరేక వర్గాన్ని టీడీపీ అధిష్టానమే ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు సోమందేపల్లికి రాగా...బీకే అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీకే వ్యతిరేక వర్గం ‘కియా’ కార్ల పరిశ్రమ వద్దే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును ఆహ్వానించింది. క్రమశిక్షణ ముఖ్యమని పదేపదే చెప్పే చంద్రబాబు కూడా బీకే వైరి వర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అనంతరం సోమందేపల్లి కార్యక్రమానికి వచ్చారు. దీంతో భంగపడిన బీకే అధినేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బిడ్డ లేదా అల్లుడికైనా...
తనకు టికెట్ ఇవ్వని పక్షంలో తన పెద్ద కుమార్తెకు గానీ, లేదా కుడి భుజంగా ఉంటున్న అల్లుడు శశిధర్‌కు గానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీకే... చంద్రబాబు, లోకేష్‌ను కోరినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి బయోడేటాలను పార్టీ నేతలకు అందించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇది కూడా బీకేకు ఆశించిన ఫలితం కనిపించేలా లేదని సమాచారం.
ఎంపీగా వెళ్దామంటే...
అసెంబ్లీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయగా...బీకే హిందూపురం ఎంపీ టికెట్ అయినా అడుగుదామన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వాల్మీకి వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ అడ్డుగా నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు అధినేత చంద్రబాబు కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాలని ఆదేశించడంతో మాజీ ఎమ్మెల్యే బీకే ...తన రాజకీయ భవిష్యత్తును తలచుకుని మదన పడుతున్నట్లు చర్చ సాగుతోంది. ఆయన అనుచరులు సైతం తమ నాయకుడు పరిస్థితి చూసి జాలి పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment