పెనుకొండ కోటకు.. అవినీతి సారథి | TDP leaders Corruption With MLA Support Anantapur | Sakshi
Sakshi News home page

పెనుకొండ కోటకు.. అవినీతి సారథి

Published Sat, Feb 16 2019 8:42 AM | Last Updated on Sat, Feb 16 2019 8:42 AM

TDP leaders Corruption With MLA Support Anantapur - Sakshi

పెనుకొండ... పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అరాచక రాజకీయానికి నిలయం... అవినీతి, అక్రమాలను ఎదురించలేక బిక్కుబిక్కుమంటూ గడిపే అమాయక ప్రజలున్న ప్రాంతం. 2004 వరకూ పరిటాల రవీంద్ర, ఆ తర్వాత బీకే పార్థసారథి గుప్పిట్లో ఉన్న నియోజకవర్గం. దశాబ్దాలుగా ఇక్కడి జనం పేదలుగానే ఉన్నా....నేతలు మాత్రం రూ.వందల కోట్లకు పడగలెత్తారు. గత నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆర్జించిన మొత్తమే రూ.400 కోట్లు దాకా ఉంటే.... నియోజకవర్గంలోని టీడీపీ నేతలు సాగించిన దందా మరో రూ.400 కోట్ల మేర ఉంటుంది. ఎమ్మెల్యేతో పాటు ఆయన అల్లుడు శశిభూషణ్‌.. నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు.

ఇసుక అక్రమ రవాణా నుంచి కంకర క్వారీల దాకా...‘నీరు–చెట్టు’ పథకం పనుల నుంచి మరుగుదొడ్ల దాకా...ప్రభుత్వ భూముల నుంచి ఎస్సీల భూముల వరకు దేన్నీ వదల్లేదు. ప్రతీ పనిలోను ‘మాకేంటి? మా వాటా ఎంత?’ అనే రీతిలోనే దందా సాగిస్తున్నారు. నాలుగున్నరేళ్ల కిందట పార్థుడి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత స్థితి బేరీజు వేస్తే.... అందనంత ఎత్తుకు ఎదిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పార్థుడితో పాటు ఆయన సైన్యం పెనుకొండ కోటను అడ్డాగా చేసుకుని సాగించిన అవినీతికాండపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం  ఎస్సీల భూముల్లో ‘పార్థుడి’ క్వారీ 

రొద్దం మండలంలోని కంబాలపల్లి, శ్యాపురం గ్రామాల శివార్లలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి క్వారీ నడుపుతున్నారు. తన కుమారుడు సాయి పేరు మీద నడుస్తున్న ఈ క్వారీ కోసం కొండ సమీపంలోని 16 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన  40 ఎకరాల భూములను ఎమ్మెల్యే స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏడాదికి రూ.4 వేల చొప్పున లీజు ఇస్తామని బలవంతంగా లాక్కున్నారు. క్వారీ మిషనరీ ఈ పొలాల్లో ఏర్పాటు చేశారు. కొండ పైనుంచి రాళ్లు ఇక్కడికి తెచ్చి..కంకర చేసి విక్రయిస్తున్నారు. అయితే ఏడాదికి ఎకరాకు రూ.4 వేలు ఇస్తే తాము ఎలా బతకాలని ఎస్సీ రైతులు ప్రశ్నిస్తున్నారు.

తాము పంటలు పండించుకుంటే కనీసం రూ.30 వేలు దాకా సంపాదించుకుంటామని..అందువల్ల రూ.4 వేల లీజుకు పొలాలు ఇవ్వమని తొలుత     తేల్చిచెప్పారు. కానీ పొలాలు ఇవ్వకపోతే పూర్తిగా లాగేసుకుంటామని బెదిరించిన ఎమ్మెల్యే బీకే... వారి చేతిలో చిల్లర విదిల్చి క్వారీ పనులకు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే పార్థసారథి భారీగా ఆర్జిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలాల్లో క్వారీ పనులు జరుగుతున్న సమయంలో కంకర పొడి, దుమ్మ, ధూళి ప్రభావంతో చుట్టపక్కల వంద ఎకరాల్లోని పంటలు నాశనమవుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పనులు జరుగుతున్నపుడు దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లాలనే నిబంధన ఉన్నప్పటికీ...ఇక్కడ పాటించడం లేదు. దీంతోపాటు కేవలం 10 ఎకరాల్లో క్వారీ నడిపేందుకు అనుమతులు తీసుకున్న ఎమ్మెల్యే బీకే పార్థసారథి...అధికారం అండతో ఏకంగా 30 ఎకరాల్లో నడుపుతున్నారు. పగటి వేళల్లో కూడా క్వారీలో పేలుళ్లు నిర్వహిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

రోడ్డు పనుల్లో ఎమ్మెల్యే అల్లుడికి 6 శాతం కమీషన్లు 
రొద్దం మండలంలో 57 నెలల్లో రూ.90 కోట్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ ఎమ్మెల్యే అల్లుడు శశిభూషణ్‌ కనుసన్నల్లోనే సాగాయి. రోడ్డు పనులు దక్కించుకోవాలనుకున్న వారు శశిని కలిసి కమీషన్‌ మాట్లాడుకుంటారు. కమీషన్‌పై అవగాహన కుదిరిన తర్వాత అస్మదీయ కాంట్రాక్టర్లు మినహా ఎవ్వరూ టెండర్లు వేయకుండా శశి హుకుం జారీ చేస్తారు. ఇలా నియోజకవర్గంలో రోడ్డు పనుల ద్వారా దాదాపు రూ.6 కోట్ల మేర కమీషన్‌ రూపంలో శశి ఇంటికి చేరినట్లు తెలుస్తోంది.  

పరిగి మండలంలో... 

  • ‘నీరు–చెట్టు’ పథకం కింద పరిగి మండలంలో రూ.5.04 కోట్లు ఖర్చుపెట్టారు. ఇందులో పనులే చేయకుండా రూ.3.87 కోట్లు దుర్వినియోగం చేశారు.  
  • చెరువుల్లో పూడికతీత, మరమ్మతులు, కాల్వల తవ్వకం, చెక్‌డ్యాం పనుల్లో రూ.38.71 లక్షల అవినీతికి పాల్పడ్డారు.    
  • ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద గ్రామాల్లో సిమెంట్‌రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో కూడా టీడీపీ నేతలు ‘గుడ్‌విల్‌’ తీసుకున్నారు.  
  • ఊటుకూరులో 480.80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. 2018లో సర్వే నంబర్‌ 240, 241లో 15.1 ఎకరాల విస్తీర్ణంలో చెన్నైకి చెందిన కేఐఎల్‌ఎం పరిశ్రమ పనులు చేపట్టింది. ఇందులో 9. 31 ఎకరాలకు తప్పుడు రికార్డులతో అనుమతులు పొందారు. ఇందులో ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది.   
  • చెరువు స్థలాన్ని మాజీ సర్పంచ్‌  ఈశ్వరప్ప 5 ఎకరాలు ఆక్రమించారు.  
  • మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. శాసనకోటలో 85 మరుగుదొడ్లకు ఒక్కో యూనిట్‌ రూ.15 వేలతో 85 యూనిట్లకు కలిపి రూ.12.75 లక్షలకు టీడీపీ నేతలు తప్పుడు బిల్లులు చేసుకుని స్వాహా చేశారు.  

15.80 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా

రొద్దం మండలంలో ప్రభుత్వ జాగా కన్పిస్తే తమ్ముళ్లు పాగా వేస్తున్నారు. మండలంలోని రొద్దంకపల్లిలో సర్వే నంబర్‌ 23–1, 2, 3లో 11.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 23–1 లెటర్‌లో టీడీపీ నేత జనార్దన్‌ భార్య లక్ష్మీదేవి పేరుతో 5 ఎకరాలు, 23–2 లెటర్‌లో ఈశ్వరప్ప పేరుతో 2.65 ఎకరాలు, 23–3 లెటర్‌లో నాగరాజు భార్య సావిత్రమ్మ పేరుతో 4 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. దీంతో పాటు టీడీపీ నేత రామచంద్ర పేరుతో 1303–2లో 4.15 ఎకరాలకు పట్టాలు చేయించుకున్నారు. ఈ సర్వే నంబర్లలోని భూమి విలువ ప్రస్తుతం ఎకరా రూ. 10 లక్షల దాకా ఉంది. ఈ భూముల పట్టాలు బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా పొందారు. 

ఇసుక దోపిడీనే రూ.438 కోట్లు 

పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్పతో పాటు టీడీపీ నేతలకు భారీ ఆదాయన వనరు ఇసుక. నియోజకవర్గ పరిధిలో పెన్నా, జయంగళీ, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాలున్నాయి. రోజూ వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక రవాణా అక్రమంగా సాగుతోంది. డ్వాక్రా మహిళల కనుసన్నల్లో ఇసుక రీచ్‌లు నడిచిన రోజుల నుంచి ...నేటి వరకూ ఇసుక రవాణా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. ఎమ్మెల్యే సొంత మండలం రొద్దంలో పెన్నానది ఉంది. పరిగి, గోరంట్లలో పెన్నా, చిత్రావతితో పాటు జయమంగళి ఉన్నాయి. పెన్నా నుంచి ఒక టిప్పర్‌ ఇసుక కర్ణాటకు తరలిస్తే రూ.50 వేలు తీసుకుంటున్నారు.

ట్రాక్టర్‌కు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. రొద్దం నుంచే రోజూ 20 టిప్పర్లు, 50 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. గోరంట్ల, పరిగి నుంచి కూడా రోజూ 20 టిప్పర్ల చొప్పున ఇసుక తరలిపోతోంది. అంటే సగటున నియోజకవర్గం నుంచి 60 టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.50 వేల చొప్పున రోజూ రూ.30 లక్షలు ఆర్జిస్తున్నారు. మరో రూ.10 లక్షలు ట్రాక్టర్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఈ లెక్కన రోజుకు రూ.40 లక్షల చొప్పున టిప్పర్ల ద్వారా ఏడాదికి రూ.146 కోట్ల ఆదాయం వచ్చినట్లే. ఈ నాలున్నరేళ్లలో ఏడాదిన్నర పాటు ఇసుక తవ్వకాలు చేపట్టలేదనుకున్నా... మూడేళ్ల పాటు ఇసుక తవ్వకాలు జోరుగా సాగాయి. ఇసుక అక్రమ రవాణాతోనే రూ.438కోట్లు ఆర్జించి ఉంటారు. ఇందులో మెజార్టీ వాటా ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్లకు చేరితే...మిగతా సొమ్మును టీడీపీ నేతలు, కార్యకర్తలు వాటాలు పంచుకున్నారు. 

మరుగుదొడ్ల పేరుతో రూ.2.50 కోట్ల దోపిడీ 

రొద్దం...ఎమ్మెల్యే బీకే పార్థసారథి సొంత మండలం.  19 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్‌ కింద 8,700 మరుగుదొడ్లు మంజూరయ్యాయి.  వీటిలో 6,533 పూర్తయినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఇందుకు రూ. 9.79 లక్షల బిల్లులు చేశారు. అయితే 63 గ్రామాల్లో కూడా 35 శాతం మరుగుదొడ్లు చేయకుండానే చేసినట్లు తప్పుడు బిల్లులు చూపించి నిధులు స్వాహా చేశారు. ఇలా రూ.2.50 కోట్ల నిధులు టీడీపీ నేతల జేబుల్లోకి చేరాయి.

జెడ్పీటీసీ సభ్యుడు చిన్నప్పయ్య తప్పుడు బిల్లులతో రూ.50 లక్షలు ఆర్జించినట్లు తెలుస్తోంది. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు గ్రామాల్లో జెడ్పీటీసీ సభ్యులే పనులు చేశారు. దీంతో వారు పనులు చేయకుండానే ఎమ్మెల్యే బీకే పార్థసారథితో అధికారులకు ఫోన్‌లు చేయించుకుని, ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించుకున్నారు. దొంగబిల్లులు చేయడానికి నిరాకరించిన ఉపాధిహామీ పథకం టెక్నికల్‌ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ సభ్యుడు బదిలీ చేయించారు.

‘నీరు–చెట్టు’ పనుల్లో భారీ దోపిడీ 
మండలవ్యాప్తంగా ‘నీరు–చెట్టు’ పథకం కింద 120 పనులు జరిగాయి. రూ.7 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో పూడిక తీత, సప్లయి చానల్స్, కంపచెట్ల తొలగింపు, చెరువుల మరమ్మతులు, తూముల మరమ్మతు పనులు చేపట్టారు. నాసిరకంగా పనులు చేసి, చేయని పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి రూ.2.79 లక్షలు దోచుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు సుధాకర్, టీడీపీ మండల కన్వీనర్‌ చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చలపతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ నాగభూషణం, కొండయ్య ఈ పనులు చేశారు.

సోమందేపల్లి మండలంలో... 

గుడిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌– 64లో ఎమ్మెల్యే బీకే పార్థసారథి కుమారై బీకే రోజ, అల్లుడు చంపకదామ పేరుతో 4.96 ఎకరాల్లో క్వారీ ఉంది. ఈ క్వారీ ద్వారా భారీగా అర్జిస్తున్నారు. 
సోమందేపల్లి చెరువు సమీపంలో రాయ్‌బహద్దూర్‌ నరసింహదాస్‌ వై పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ క్వారీ, వేలుపుకొండలోని ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ క్వారీల నుంచి ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందుతున్నాయి. దీనికి రోడ్డు సౌకర్యం లేకపోతే ఎమ్మెల్యేనే జాతీయరహదారిని కలుపుతూ రోడ్డు వేయించారు. దీనికి ప్రతిఫలంగా క్వారీ యజమానులు ఎమ్మెల్యేకు మామూళ్లు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.  
నియోజకవర్గంలో ఎవరు రోడ్డు పనుల టెండర్లు దక్కించుకున్నా...ఎమ్మెల్యేకు సంబంధించిన క్వారీల నుంచే కంకర తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. 
పాపిరెడ్డిపల్లిలోని ఐ పవర్‌ నేషన్‌ ప్రైవేట్‌ కంపెనీ నిర్వహిస్తోన్న క్వారీతో గిరిజనుల ఆరాధ్య దైవమైన వేలపుకొండ దెబ్బతింటోంది. బ్లాస్టింగ్‌తో సమీపగ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.   
మండలంలో ‘నీరు–చెట్టు’ పథకం కింద రూ.12 కోట్ల పనులు చేశారు. 160 పనులకు రూ.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తక్కిన రూ.8 కోట్లను పనులు చేయకుండానే తప్పుడు బిల్లుల సృష్టించి స్వాహా చేశారు.  
గుడిపల్లి పొలంలో సర్వే నంబర్‌ 117–2ఎలో ఎమ్మెల్యే కుమారై బీకే రోజ పేరుతో భూములు కొనుగోలు చేశారు.

గోరంట్ల మండలంలో... 

  • గోరంట్ల మండలంలో రూ.5 కోట్లతో సిమెంట్‌ రోడ్లు వేశారు. ఈ పనులు ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులే చేస్తున్నారు.   
  • ఎంపీ నిమ్మల తన సొంత పొలాలు, కల్యాణమంటపాలకు ఎంపీ నిధులతో సిమెంట్‌రోడ్లు వేయించుకున్నారు. బీఎన్‌ తండా నుంచి హిందూపురం రోడ్డు వరకూ రూ.80 లక్షలు,  కాటేపల్లి నుంచి రూ.40 లక్షలతో రోడ్డు పనులు చేశారు. ఈ పనులు టెండర్‌ ద్వారా కాకుండా నామినేషన్‌ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెట్టారు.   
  • చిత్రావతి నది నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా కర్ణాటకకు రవాణా చేసి రూ.60 కోట్లు దాకా స్వాహా చేశారు. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మలకు వాటాలు అందాయి.   
  • ‘నీరు–చెట్టు’ పథకం ద్వారా మండలంలో రూ.20 లక్షల వరకూ టీడీపీ నేతలు స్వాహా చేశారు. 
  • తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసినట్లు తప్పుడు లెక్కలు చూపించి టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు.   
  • గోరంట్లలో చిత్రావతి నదిపై రూ.4.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో కూడా కాంట్రాక్టర్‌ నుంచి ముడుపులు అందుకున్నారు.  

పెనుకొండ మండల పరిధిలో...

  • శెట్టిపల్లిలో సర్వేనంబర్‌ 345–2లో ఎమ్మెల్యే బీకే... బినామీల పేరుతో గ్రానైట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. ఈ క్వారీ నుంచి ఎక్కువగా ముంబయికి గ్రానైట్‌ సరఫరా అవుతోంది. గ్రానైట్‌ ద్వారానే ఎమ్మెల్యే బీకే రూ.70 కోట్లు ఆర్జించి ఉంటారు.  
  • ‘కియా’ కార్ల పరిశ్రమ వస్తుందని తెలిసి అమ్మవారిపల్లి, ఎర్రమంచి ప్రాంతాల్లో తన అనుచరుల పేరుతో బీకే పార్థసారథి భూములు భారీగా కొనుగోలు చేశారు. వీటి విలువ రూ. 50 కోట్ల దాకా ఉండొచ్చు.   
  • గుట్టూరులో కురబ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ సబితకు కంకర క్వారీ ఉంది. ఇందులో కూడా ఎమ్మెల్యేకు వాటా ఉన్నట్లు తెలుస్తోంది.  
  • కాంట్రాక్టు పనుల్లో గుడ్‌విల్, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లలో ఎమ్మెల్యే అల్లుడు శశిభూషణ్‌ రూ.80 కోట్లపైనే ఆర్జించి ఉంటారని తెలుస్తోంది.  
  • పెనుకొండ మండలంలో చేపట్టిన ‘నీరు–చెట్టు’ పథకం పనుల్లో రూ.10 కోట్లు అవినీతి జరిగింది. ఈ వ్యవహారంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులు భారీగా లబ్ధిపొందారు.  
  • ‘కియా’ కార్ల పరిశ్రమ, గొల్లపల్లి రిజర్వాయర్‌లో భారీగా మామూళ్లు అందినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంపీ నిమ్మల కిష్టప్పకు కూడా వాటాలు అందినట్లు తెలుస్తోంది. 

పవర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టర్లకు బెదిరింపులు

పావగడ నుంచి దేవనహళ్లి వరకు పవర్‌ గ్రిడ్‌ ద్వారా విద్యుత్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నాలుగు నెలల క్రితం పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం, సోమందేపల్లి మండలాల పరిధిలో టవర్లు ఏర్పాటు చేస్తుండగా.. ఎమ్మెల్యే బీకే అల్లుడు శశిభూషణ్‌ అడ్డుకున్నారు. పెనుకొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వద్దకు కాంట్రాక్టర్లను పిలిపించి రూ.40 లక్షలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు తాము అంత మొత్తం ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారు పెనుకొండ నియోజకవర్గంలో టవర్‌ పనులు నిలిపి గౌరిబిదనూరు వద్ద పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక పెనుకొండ నియోజకవర్గంలో పనులు మొదలు పెడతామనీ, అప్పటి వరకు తాము అడుగుపెట్టమని కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే అనుచరుల వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement