జూలై 3న అర్ధరాత్రి అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌కు తాళాలు వేసి నిర్వాహకులతో వాగ్వాదం చేస్తున్న సిబ్బంది
సాక్షి, అనంతపురం : అన్నార్థులు ఆకలి తీర్చేందుకే రూ.5కే భోజనం అందిస్తామని 2014 ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ఆ పథకం గురించి మరిచిపోయాడు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2018లో హడావుడిగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఇలా జిల్లాలో 16 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. 60కి పైగా క్యాంటీన్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు 2016లో ప్రతిపాదనలు పంపితే అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018లో 17 అన్న క్యాంటీన్లు మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలో 7 క్యాంటీన్లకు అధికారులు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నాలుగు మంజూరు చేసింది. దీంతో 2018 జూలై 15న బళ్లారి బైపాస్‌లో, 2018 డిసెంబర్ 19న గుత్తి రోడ్డులో, 2019 జనవరి 11న ఆర్‌ఎఫ్ రోడ్డులో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇక 11 మున్సిపాలిటీల్లో పదులు సంఖ్యలో క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళితే అందులో 17 మాత్రమే మంజూరయ్యాయి. వాటిలో ఒకటి నేటికీ ప్రారంభం(గుత్తి) కాలేదు. కేవలం గోడలు మాత్రం నిర్మించి వదిలేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన ఈ క్యాంటీన్‌ల వల్ల పేదల కడుపునిండటం పక్కన పెడితే ప్రజాధనం దోపిడీతో తెలుగుతమ్ముళ్ల బొజ్జలు నిండాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆది నుంచి వివాదాస్పదమే
జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఆది నుంచి వివాదాస్పదంగానే సాగింది. క్యాంటీన్లకు స్థలాలకు కూడా చూపించలేని అప్పటి జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కాలం వెళ్లబుచ్చారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో మొదట బళ్లారి బైపాస్‌లో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవంగా ఆర్‌అండ్‌బీ నిబంధనల ప్రకారం ఫ్లైఓవర్ కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. దీనిపై అప్పట్లోనే ఆర్‌అండ్‌బీ అధికారులు అభ్యంతరం చెప్పారు. కానీ అప్పటి ఎమెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ఆర్భాటంగా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయించారు. అయితే వారం రోజుల్లోనే భోజనం సరిగా ఏర్పాటు చేయలేదని స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు్లవెత్తాయి. కేవలం 150 మందికి మాత్రమే(పూటకు) భోజనం ఏర్పాటు చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సంఖ్యను మరో 150 మందికి పెంచేలా అప్పటి కమిషనర్ పీవీవీఎస్ మూర్తి చర్యలు తీసుకున్నారు. ఇక మిగితా మూడు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఆర్‌ఎఫ్ రోడ్డు జూనియర్ కళాశాల ఆవరణలో, గుత్తిరోడ్డు నాగవెంకోబరావు పాఠశాల ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. కదిరి మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి. మొదట్లో జనాలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. చివరకు వివిధ కారణాలతో వేరే ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
సిబ్బందికి వేతనాలివ్వలేని దౌర్భాగ్యం
వాస్తవానికి అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్థలాన్ని ఆయా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ చూపించాలి. షాపూర్‌జీ పూలంజీ సంస్థ ఓ భవనాన్ని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలకు అందజేస్తుంది. భోజనాన్ని అక్షయపాత్ర వారు సమకూరుస్తారు. అందులో పనిచేసే సిబ్బందికి ఓ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లిస్తారు. కానీ సిబ్బందికి వేతనాలివ్వడంలోనూ తీవ్ర జాప్యం జరిగింది. దీంతో పలుచోట్ల వారు ఆందోళనకు దిగారు. ఐదు నెలలకు మూడు నెలల జీతం బాకీ ఈ ఏడాది జూలై 3న గుత్తిరోడ్డులోని అన్న క్యాంటీన్‌లోని సిబ్బంది ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా వేతనాలివ్వలేదని ఏజెన్సీ నిర్వాహకులు రంగన్నతో వాగ్వాదం చేశారు. కేవలం ఐదు నెలలే క్యాంటీన్లు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం సిబ్బందికి మూడు నెలల జీతాలు ఇవ్వకపోవడం చూస్తే వాటి నిర్వహణపై ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment