తుంగోడులో ఎమ్మెల్యేను నిలదీస్తున్న స్థానికులు
సాక్షి, సోమందేపల్లి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథి ఏపల్లెకెళ్లినా ప్యాకప్ చెప్పాల్సి వస్తోంది. రోజురోజుకూ ఆయనకు చేదు అనుభవం ఎదురవుతోంది. గత ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టకున్నా.. పాలనా కాలమంతా పల్లెల మొహం ఎరగకున్నా ఏ మొహం పెట్టుకొని ఓట్లడగడానికి వస్తారు? అంటూ జనం నిలదీస్తున్నారు. శుక్రవారం మండలంలోని నాగినాయని తండా, తుంగోడు, చిన్నబాబయ్యపల్లి రోడ్‌షోలను ప్రజలు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే బీకే పార్థసారథి నాగినాయని చెరువు తండాలో రోడ్‌షోనిర్వహించేందుకు వెళ్లారు. అక్కడ చేరుకోగానే గ్రామస్తులు సమస్యలను ఎమ్మెల్యే అభ్యర్థి బీకేకు ఏకరువు పెట్టారు.
వేలుపుకొండ క్వారీకు సంబంధించి తమకు న్యాయం చేయలేని నువ్వు.. ఓట్లు అడిగే అర్హత లేదంటూ నిలదీశారు. ప్రచార రథం నుంచి దిగకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయారు. క్వారీ నిర్వాహకులకు వంతపాడారని, వేలుపుకొండకు సంబంధించి పురాతన అకమ్మగార్లు ఉన్నాయని చెప్పినా గ్రామస్తుల సమస్యను పట్టించుకోలేదని, ఐదేళ్లు నీటి సమస్యతో బాధపడుతున్నా సమస్య తీర్చేందుకు చొరవచూపలేదని నిలదీశారు. దీంతో కొద్దిసేపు గ్రామస్తులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్దంగా 12 కార్లు 100 బైక్‌లతో వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలను తీసుకొచ్చి బీకే హంగామా చేశారు.
చిన్నబాబయ్యపల్లిలోనూ చుక్కెదురే..:
అనంతరం చిన్నబాబయ్యపల్లికి చేరుకోగానే ఎస్సీ కాలనీ వద్ద ఖాళీ బిందెలతో స్థానికులు నిరసన తెలియజేశారు. నీళ్లు ఇవ్వని ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. స్థానిక రైతు ప్రతాప్‌రెడ్డి నీళ్ల సమస్యపై స్థానికులతో కలిసి ఎమ్మెల్యేను సమస్యను ప్రస్తావించగా కోపోదిక్తుడైన బీకే గతంలో మీ ఊరికి వచ్చినప్పుడు నువ్వే ప్రజలను రెచ్చగొట్టి నన్ను అవమానపరిచావు..ఇప్పుడు నువ్వే అతిగా వ్యవహరిస్తున్నావు.. నీ అంతు చూస్తా.. ’ అంటూ ఎమ్మెల్యే బెదిరించాడు. గ్రామస్తులు నినాదాలు చేస్తుండడంతో ‘చిల్లర వ్యక్తులతో మనకెందుకు అని ’ వెళ్లిపోయారు.
అసభ్య పదజాలంతో తిట్లదండకం :
అనంతరం తుంగోడు గ్రామానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా నీటి సమస్యతో పాటు రోడ్డు, డ్రైనేజీ, కాలువలు సైతం నిర్మించలేదని, తమను ఎందుకు ఓట్లు అడుగుతారని స్థానికులు ప్రశ్నించారు. కొందరు కార్యకర్తలు ఇళ్ల వద్దకువవెళ్లి కరపత్రాలు ఇవ్వగా టీడీపీ ఓటు వేసేదిలేదని చెప్పారు. దీంతో బయప్పరెడ్డి అనే రైతుపై ఆ పార్టీ కార్యకర్తలు అసభ్యకరంగా దూషించారు. ఎమ్మెల్యే బీకే కూడా కాన్వాయ్ నుంచి మైకులో పత్రికల్లో రాయలేని భాషలో తిట్లదండకం అందుకున్నారు. తుంగోడు వా ళ్లు ఏమైనా పాలేగాళ్లా.. ‘నీయమ్మా.. ’ ఎన్నికలు ముగియనీ.. మీ అంతు చూస్తా’ అంటూ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ వెంకటరమణ, జీవీపీ నాయుడు తదితరులు స్థానికులకు నచ్చజెప్పడానికి ప్రయత్నిం చారు. కాగా పోలీసులను ఎమ్మెల్యే ఉసిగొలిపి ఆయా గ్రామాల్లో నిలదీసిన వారిని భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment