అవును.. చంద్రబాబే ఆ విషయాన్ని ఒప్పుకున్నారు! | Ksr Comments On Chandrababu Politics On New Job Vacancies | Sakshi
Sakshi News home page

అవును.. ఆ విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నారు!

Published Sat, Aug 31 2024 12:46 PM | Last Updated on Sat, Aug 31 2024 4:09 PM

Ksr Comments On Chandrababu Politics On New Job Vacancies

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారిగా తన ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందన్న సంగతిని అంగీకరించారు. కాకపోతే ఆయన తెలివిగా దానిని కొద్దిమంది ఎమ్మెల్యేలపైన, మంత్రులపైనతోసేసి, తను మాత్రం ఆ చెడుతో సంబంధం లేని వ్యక్తిగా ఫోకస్ చేసుకుంటారు. లీకులు ఇవ్వడంలో చంద్రబాబు నేర్పరితనం బహుశా దేశంలోనే మరే నేతకు లేదేమో! అయితే ఆ లీకులు పూర్తిగా తనకు పాజిటివ్‌గా ఉండడానికి, తనకు గిట్టని వారిపై బురద వేయడానికి వాడుతుంటారు.

ఈ విషయంలో తన మామ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీరామారావును సైతం వదలిపెట్టలేదు. తను ముఖ్యమంత్రి పదవిలోకి రావడానికి గాను ఎన్‌టీఆర్‌పై చంద్రబాబు అనండి, ఆయన అనుచరులు అనండి.. మద్దతు ఇచ్చే కొన్ని మీడియా సంస్థల ద్వారా ఉన్నవి, లేనివి వదంతులు ప్రచారం చేయించారన్న భావన అప్పట్లో రాజకీయవర్గాలలో ఉండేది. ఎన్‌టీఆర్‌ రెండో భార్య లక్ష్మీపార్వతి కేంద్రంగా ఈ ప్రచారాలు సాగుతుండేవి.

ఈ క్రమంలో ఎన్‌టీఆర్‌ను అప్రతిష్ట పాలుచేయడం, తనే పార్టీని రక్షిస్తున్నట్లుగా పిక్చర్ ఇవ్వడం జరిగేది. ఆ ప్లాన్ సఫలం అవడంతో అదే వ్యూహాన్ని గత మూడు దశాబ్దాలుగా ఆయన కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్‌ తమాషాగా ఉన్నాయి. గతంలో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్ సమావేశాల్లో ఇలాగే మాట్లాడేవారు. ఆ తర్వాత అవి లీకులుగా బయటకు వస్తాయి. తద్వారా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు బాగా భాదపడుతున్నట్టుగా అలాగే కొంత మంది వల్ల పార్టీ నష్టపోతున్నట్టుగా దానిని నివారించడానికి తాను కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా లీకులు వస్తాయి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే.

నిజానికి గత మూడు నెలలుగా ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ఒకటి రెండు హమీలు తప్ప మిగిలిన హమీల ఊసు ఎత్తడం లేదు. మరోవైపు హింసాకాండ, దౌర్జన్యలు పెచ్చుమీరి ఆరాచకం రాజ్యం ఏలుతుంది. విధ్య, వైద్యంతో సహ పలు రంగాలు కుంటుపడ్డాయి. గత ఐయిదేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక విప్లవాత్మక సంస్కరణలు, వ్యవస్థలు అన్నింటిని చంద్రబాబు కుప్పకూలుస్తున్నారు. ప్రజలకే ఏలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలకు పౌర సేవలను అందించే ఏర్పాట్లు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటన్నింటిని తొంగలో తొక్కింది. ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేష్‌లు కొత్త ఉద్యోగాల ఎంగతి ఏమో కాని ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నార .

లక్షన్నర మంది వలంటీర్లను ఊడబెరికే పనిలో ఉన్నారు. ఇలాంటివి చెప్పుకుంట పోతే చాలానే ఉన్నాయి. ఇవన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేలేదా! ఇలాంటివి కప్పిపుచ్చే కొనే పనిలో ఎమ్మెల్యేలు, మంత్రులపై తనే విమర్శలు చేస్తుంటారు. ఆ తర్వాత వారిని మందలించినట్టు కూడా ప్రచారం చేస్తారు. కాని జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. ఆయన ఒకరిద్దరు ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తుందని చెప్పారు. నిజానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చెడ్డపేరు తెస్తున్నారనది పార్టీలో పలువురి అభిప్రాయం అవి ఆయనకు తెలుసు. దానిని గట్టిగా చెబితే ఎక్కడ చికాకు వస్తుందో అని ఇలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంటారు.

మొత్తం ప్రభుత్వ తీరు వల్ల వచ్చే చెడ్డపేరును ఎమ్మెల్యేలు, మంత్రులపై నెట్టేసి తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. తద్వారా తన ప్రభుత్వంకు వస్తున్న అప్రతిష్టను డైవర్ట్ చేస్తారన్నమాట. ఈ విషయంలో ఆయనకు ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి అనుకూల మీడియా చాలా పాజిటివ్‌గా కవర్ చేస్తుంటుంది. క్యాబినేట్‌లో చేసిన కామెంట్స్‌పై ఈ పత్రికల్లో వచ్చిన ఒక వార్త చూడండి. "ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు బుల్ డోజర్‌లు, ప్రోక్లెయినర్‌లతో కూల్చి వేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసారట" కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన భాద్యత మంత్రులదే అని చెప్పారట.

మనం చేస్తున్న మంచిపై ప్రజల్లో చర్చ జరగాలి తప్ప... చెడుపై కాదని చంద్రబాబు.. అన్నట్లు ఈ మీడియా రాసింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆయన అలోచన సరళి ఏంటో. చెడ్డపనులు, స్కామ్‌లు రహస్యంగా జరగాలి తప్ప ఓపెన్‌గా జరగకూడదన్న విశ్లేషణ వస్తుంది. నిజానికి ఈ మూడు నెలలుగా ఏ రకంగా ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందో చెప్పలేని పరిస్థితి ఆయనకు ఉంది. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీల గురించి ప్రజల్లో చర్చ జరగకూడదన్నది ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

నిత్యం మాజీ సీఎం జగన్‌పై ఆయన వేస్తున్న బురదను ప్రజలంతా గమనించి దాని గురించే మాట్లడాకోవలన్నది ఆయన లక్ష్యం. కాని ఇటివలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఒపెన్‌గా చేస్తున్న పనులు ప్రజల్లో మరింత నష్టం చేస్తుండవచ్చు. ఉదాహరణకు చిలకలూరి పేట ఎమ్మెల్యే భార్య వెంకయామ్మ పుట్టిన రోజుకు పోలీసులు వెళ్లి కేక్ కట్ చేయించడం, శ్రీకాకుళంలో ఒక రౌడి షీటర్ పుట్టిన రోజుకు టీడీపీ ఎమ్మెల్యే వెళ్లడం, తాడిపత్రిలో పోలీసులపై ఆస్మిత్ రెడ్డి దురుసుగా వ్యవహరించడం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులపై దర్పం ప్రదర్శించిన వైనం వంటివి కొన్ని వెలుగులోకి వచ్చాయి.

లోకేష్‌ సతిమణి బ్రాహ్మణికి పోలీసులు వందనం చేయడం వివాదాస్పదం అయ్యింది. అయితే ఆ విషయంను మాత్రం పెద్దగా ప్రచారం కాకుండా జాగ్రత్తపడ్డారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు రాష్ట వ్యాప్తంగా సాగుతున్నాయి. దానికి కారణం చంద్రబాబు వ్యవహర సరళి కూడా అని చెప్పకతప్పదు. పోలీసుల పట్ల చంద్రబాబు అనుసరించి వైఖరి గాని, వైఎస్సార్సీపీ వారిపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నప్పుడు పోలీసులను చూసి చూడనట్టు వెళ్లాలని సంకేతాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా వారు వ్యవహరిస్తూ రావడం జరిగింది. దీనితో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలు మంత్రులు రెచ్చిపోతున్నారు.

ఇవన్నీ గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వంకు చెడ్డపేరు రావడానికి కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు కాదని చంద్రబాబు ప్రభుత్వ తీరు కూడా అని అర్ధం అవుతుంది. మళ్లీ గతంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అప్రతిష్టపాలు అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే వైఖరితో ముందుకు వెళుతున్నారు. కాకపోతే ఈ సారి తెలివిగా పార్టీలో చేరే ఎంపీలతో రాజీనామా చేయిస్తున్నారు. అయితే ఇలా రాజీనామా చేసి వచ్చే నేతలకు టీడీపీ ప్యాకేజీలు ఇస్తుందని కధనాలు వస్తున్నాయి. చంద్రబాబు మీడియాతో మాట్లడుతూ వైఎస్సార్సీపీ నేతల క్యారెక్టర్ గురించి వింటుంటే షేమ్ అనిపిస్తుంది అని అన్నారట.

ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేతలు ఏవరైన రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని చెప్పారట. మరి ఇది పార్టీకి ప్రభుత్వంకు చెడ్డపేరు తెచ్చేది కాదా? అదే టైమ్‌లో ఆయా చోట్ల నగర మేయర్లు, కార్పొరేటర్లు రాజీనామాలు చేయకుండానే టీడీపీలో చేరుతున్నారు. ఇలా డబుల్ స్టాండర్స్ టీడీపీకి బాగా అలవాటైందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన ఇటుకలు పేర్చారో లేదో కాని... ప్రజలపై మాత్రం రకరకాల రూపాల్లో బుల్ డోజర్‌లను నడుపుతున్నారు. కనుక కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్లే పార్టీకి అప్రతిష్ట రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల వల్ల చెడ్డపేరు వచ్చింది. ఈ విషయంను ఎంత కప్పిపుచ్చుకుందాం అన్నా అది బయటపడుతోంది. కాకపోతే ఎట్టకేలకు తన ప్రభుత్వంకు చెడ్డపేరు వచ్చిందని మాత్రం చంద్రబాబు అంగీకరించక తప్పలేదు.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement