Dakavarapu Ashok
-
‘ఆడపిల్లల సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉంది’
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యక్తిగత డేటాను టీడీపీ ప్రభుత్వం దొంగిలించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టీడీపీ గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లు తదితర వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఠా దగ్గర ఉన్నాయని ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్స్‌కు ప్రజల డేటా చేరిందన్నారు. చంద్రబాబు బినామీలకే పలు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పజెప్పారని విమర్శించారు. అభయ యాప్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారని సూటిగా ప్రశ్నించారు.దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ఉపయోగించిన టెక్నాలజీకి పేరు మార్చి సీఎం డ్యాష్ బోర్డు అంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘2016లో జే సత్యనారాయణ యూఐడీఏ చైర్మన్ అయిన తర్వాత ఆధార్ డేటాను ఈ ప్రగతికి లింక్ చేశారు. సంక్షేమ పథకాల కోసం డేటాను ఈ ప్రగతికి లింక్ చేసినట్టు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రగతి నుంచి ఆధార్ డేటాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు మళ్లించారు. సేవామిత్ర యాప్‌ను ఐటీ గ్రిడ్స్ సంస్థ రూపొందించింది. డేటా చోరీ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్‌పై కేసు నమోదు చేశారు. ప్రజల ఫోన్లలో ఉండే సమాచారాన్ని సేవామిత్ర యాప్‌తో ట్రాక్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన బినామీ అశోక్‌తో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ఫోన్ స్టోరేజీ డేటా కూడా వారి వద్దకు వెళ్లిపోయింది. చంద్రబాబు, అశోక్ ద్వారా దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు అభద్రతా భావం కల్పించారు. సేవామిత్ర యాప్‌తోనే టీడీపీ ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్‌లు అశోక్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. అశోక్ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టీడీపీ ప్రభుత్వం బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే తాము ఏం చేశామో చెప్పాల్సిన బాధ్యత సిట్‌పై ఉంది. టీడీపీ ప్రభుత్వ దొంగతనాన్ని దాచడానికే సిట్ వేశారా?. ఈ ప్రగతి, సీఎం డ్యాష్ బోర్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాంకేతికతను ఉపయోగించుకోకుండా చంద్రబాబు తన బినామీలకు టెక్నాలజీ అప్డేట్ పేరిట కాంట్రాక్టులు అప్పజెప్పారు. బాలసుబ్రహ్మణ్యం సతీమణి నిర్వహిస్తున్న గ్రీన్ ఆర్గ్, ఓటీఎస్ఐ కంపెనీలకు ఆర్టీఏ వెబ్సైట్ సాంకేతిక బాధ్యతలను అప్పగించారు. రూ. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్ పైలెట్ ప్రాజెక్టును తీసుకువచ్చారు. అయితే అభయ యాప్ ద్వారా ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారు?. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్‌గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి.. అందులో ఏవరైతే టీడీపీకి అనుకూలంగా ఉండరో వారి ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. తమకు అనుకూలంగా లేని ఓటర్ల వివరాలు సేకరించాలని టీడీపీ ఆ పార్టీ వెబ్సైట్లోనే నాయకులను ఆదేశించింది. అశోక్ ఎక్కడున్నారో చంద్రబాబు, లోకేశ్, ఏబీ వెంకటేశ్వరరావులను అడగాలి. ఇటీవల అశోక్ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్ రోజు ఎలా హ్యాక్ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసింది. ఇంతా జరుగుతున్నా ఏపీ, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కౌంటింగ్ రోజున భద్రతా చర్యల గురించి ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. టీడీపీ నాయకులు శాంతి భద్రతల సమస్య సృష్టించే అవకాశం ఉందని తెలిపాం. వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు అరెస్ట్ అయినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి ఎదైయినా జరిగిందంటే దాని వెనుక టీడీపీ హస్తం ఉండే అవకాశం ఉంద’ని తెలిపారు. -
మంత్రి, ఐఏఎస్‌లతో అశోక్ సంభాషణ!
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దాకవరం అశోక్ కదలికలను సిట్ పసిగట్టింది. ఆర్నెలలుగా అశోక్ కీలక వ్యక్తులతో తరచూ సంభాషించడం.. పరారీ తర్వాత ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్లు పలు ప్రాంతాలను సూచించడం ఈ కేసులో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సిగ్నళ్ల ఆధారంగా అతన్ని దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇక నిందితుడు మంతనాలు జరిపిన ఫోన్ నెంబర్లలో ప్రముఖులవి కూడా ఉండడంతో సిట్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇదే క్రమంలో అశోక్ మరో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించడంతో తెలంగాణ సిట్‌ను మరెన్నో సందేహాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ.. గుంటూరుకు? డేటా చౌర్యం వెలుగుచూసిన తర్వాత అశోక్ ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. అందరికీ తెలిసిన అశోక్ నెంబరు తొలుత రెండు మూడు రోజుల వరకూ హైదరాబాద్ పరిసరాల సెల్ టవర్ల పరిధిలోనే ఉన్నట్టు గమనించారు. కానీ, అశోక్ ఆచూకీ మాత్రం పోలీసులకు లభించలేదు. సెల్‌ఫోన్ ద్వారా కదలికలను గుర్తిస్తారనే అశోక్ తన ఫోన్‌ను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చునని పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అనంతరం అతను మరో ఫోన్ వాడుతున్నట్టు ఇతర మార్గాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ రహస్య ఫోన్ నెంబర్ ద్వారా అశోక్ కదలికలను అధికారులు గుర్తించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఈ నెంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నెంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గుంటూరు, మంగళగిరిలో మకాం? అశోక్ వాడుతున్న సెల్‌ఫోన్.. డేటా చౌర్యానికి ముందు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి ఫోన్ నెంబర్ కూడా మాదాపూర్ టవర్ లొకేషన్లో ఉండటం, ఆయనతో తరచూ మాట్లాడుతుండటం ఈ ఎపిసోడ్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రితో మాట్లాడిన తర్వాత అశోక్ ఫోన్ నెంబర్ నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులకూ ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. అశోక్‌తో అసలా అధికారులకు సంబంధమేంటి? మంత్రితో మాట్లాడిన వెంటనే అశోక్ అధికారులతో ఏం మాట్లాడాడు? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. అలాగే, డేటా చౌర్యం తర్వాత అశోక్ వాడినట్లుగా భావిస్తున్న రహస్య నెంబర్‌గల ఫోన్ మరికొన్ని సందేహాలను కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి పారిపోయిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ మంగళగిరి, గుంటూరు టవర్ లొకేషన్స్‌ను సూచిస్తున్నాయి. తరచూ ఇవే సిగ్నల్స్‌ను గుర్తించిన పోలీసులు అశోక్ డేటా చౌర్యం కేసు తెరమీదకొచ్చాక గుంటూరు, మంగళగిరిలో మకాం వేశాడా? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అశోక్‌తో ఫోన్ సంప్రదింపులు జరిపిన అధికారుల ఫోన్లు కూడా ఇదే టవర్ లొకేషన్లను చూపిస్తున్నట్టు తెలిసింది. దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా? ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అశోక్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తోంది. అతను ఓ గంటపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను మళ్లీ విజయవాడ మీదుగా మంగళగిరి, గుంటూరు చేరుకున్నట్లు సమాచారం. వాస్తవానికి అశోక్‌ను దేశం దాటించి ఉంటారని పోలీసులు ముందుగా అనుమానించారు. అతను వాడిన ఫోన్‌ను ఇక్కడే ఎవరికో ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి అక్కడి నుంచి గుంటూరు వెళ్లినట్టు అనుమానించారు. అయితే, శాస్త్రీయ కోణంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్మీట్లో అశోక్ మరో రెండు రోజుల్లో బయటకొస్తారని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. ఎయిర్‌పోర్టుకొచ్చిన అశోక్ తిరిగి గుంటూరు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. దేశం దాటించేందుకే ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ, దీనివల్ల ఎక్కడో ఒకచోట అతను దొరికిపోతాడని భావించి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం మానుకున్నారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు. -
‘ఐటీ గ్రిడ్స్ అశోక్ అమరావతిలోనే ఉన్నారు’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార కాంక్షతోనే తన కుమారుడు లోకేష్‌ను అందలం ఎక్కించాలని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్ ఆరోపించారు. విజయవాడలో బీజేపీ కార్యాలయంలో కోసూరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ దాకవరం అశోక్‌తో, సేవా మిత్ర యాప్ తయారు చేయించి ప్రజల డేటాను చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దొంగిలించారని ఆరోపించారు. అశోక్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లోకేష్ బాబు సంరక్షణలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసే అక్రమాలకు టీడీపీ భూస్థాపితం అవ్వటం ఖాయమన్నారు. చంద్రబాబు మూట ముళ్లు సద్దుకుని కట్ట పక్క నుంచి హైదరాబాద్‌కి వెళ్లేపోయే సమయం దగ్గర పడిందని విమర్శించారు. చంద్రబాబు ఓట్ల తొలగింపు ఆగడాలపై ఎంపీ జీవీఎల్ నర్సింహరావు, కన్నా లక్ష్మీనారాయణలు ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి లోకేష్‌ని, చంద్రబాబు నాయుడు, అశోక్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?
సాక్షి, అమరావతి/కావలి : ఐటీ గ్రిడ్స్ డేటా స్కాంలో కీలక నిందితుడు దాకవరం అశోక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఎవరు? ఎవరికి బినామీ? ఎవరు కాపాడుతున్నారు? అనే అనుమానాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్‌తో తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్‌గా వార్తల్లోకి ఎక్కిన అశోక్.. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖా మంత్రి లోకేశ్ ఆశీస్సులే కారణమని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. (డేటా స్కాంలోనూ బాబు యూటర్న్!) అశోక్ అనతికాలంలోనే రూ.65 కోట్ల విలువైన ఐటీ గ్రిడ్స్ సంస్థకు అధిపతి ఎలా కాగలిగాడు? దాదాపు 40 ఎకరాలను ఎలా కొనగలిగాడు? తూర్పుగోగులపల్లిలో 100 సీజేఎఫ్ఎస్ రొయ్యల గుంటల సాగు ఎలా చేస్తున్నాడు?.. హైదరాబాద్‌లోని మాదాపూర్ సెంటర్లో సామాన్య వ్యక్తిగా.. సాదాసీదా బైక్‌పై తిరిగిన అతను ముఖ్యమంత్రి చంద్రబాబు సరసన కూర్చునే స్థాయికి ఎదిగేలా చేసిందెవరు? ..ఇలా అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు, నెల్లూరు జిల్లా కావలిలో మొదలైన అతని ప్రస్థానం అమరావతి వరకు సాగిన క్రమం ఇదిగో ఇలా ఉంది.. కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామానికి చెందిన అశోక్ తండ్రి బుజ్జయ్య చిన్నపాటి ఉప్పు రైతు. కుటుంబ పోషణ, ఉప్పు సాగుతో అప్పులపాలైన బుజ్జయ్య వాటిని తీర్చలేక చేతులెత్తేసాడు. ఆ తర్వాత ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ తరఫున బుజ్జయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అశోక్.. టీడీపీ నేతలు బీదా బ్రదర్స్‌కు దగ్గరయ్యాడు. మాజీ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని నిర్మాణ సలహా కమిటీ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్రలతో సన్నిహిత సంబంధాలు పెరగడంతో అశోక్ తండ్రి బుజ్జయ్యను టీడీపీలోకి తీసుకొచ్చాడు. అలా టీడీపీతో వారి బంధం మొదలైంది. (అప్పుడూ.. ఇప్పుడూ సేమ్ టు సేమ్!) లోకేశ్‌కు బినామీగా ఇలా.. రాజకీయ నాయకుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని సర్వేలు, సమీకరణాలు అంటూ అశోక్ పదేళ్ల క్రితమే డబ్బు సంపాదనే మార్గంగా రంగంలోకి దిగాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పార్టీ అనలిస్ట్ డాట్ కామ్‌ను స్థాపించాడు. అప్పట్లో ఇక్కడకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, విద్యావేత్త చుక్కా రామయ్య వంటి ప్రముఖులను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ‘పార్టీ అనలిస్ట్’ అనే వెబ్సైట్ ద్వారా ప్రజల్లో రాజకీయ పార్టీల బలాబలాలను అధ్యయనం చేస్తామని చెప్పాడు. ఆ సంస్థను ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా మార్చాడు. ఈ క్రమంలోనే లోకేశ్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. మూడేళ్ల క్రితం బీదా బ్రదర్స్ ద్వారా లోకేశ్‌తో అశోక్‌కు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో వేమూరి హరిప్రసాద్ ద్వారా లోకేశ్‌కు మరింత దగ్గరయ్యాడు. సీఎం చంద్రబాబును, ఐటీ మంత్రి లోకేశ్‌ను పలుమార్లు కలిసి ఐటీలో తన ఆలోచనా విధానాన్ని వివరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే టీడీపీ సేవామిత్ర యాప్‌కు రూపకల్పన చేశారు. సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ లోకేశ్ తొలివిడతగా అప్పట్లో రూ.8 కోట్లు డబ్బులు పెట్టుబడిగా పెట్టి లోకేశ్‌కు బినామీగా అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతోంది. యాప్ నుంచే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు ఈ నేపథ్యంలో.. రాజకీయ ప్రయోజనం కోసమే అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అంతర్గత సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్‌కు అందేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, లోకేశ్ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ రూపొందించింది. టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను కూడా తయారుచేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలుగుచూసిన డేటా స్కాంకు ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యుడని సీనియర్ ఐఏఎస్‌లు చర్చించుకుంటున్నారు. పోలీసుల వద్దే అశోక్? ఇదిలా ఉంటే.. అశోక్ ఇప్పుడు ఎక్కడున్నడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డేటా చోరీపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో పోలీసులకు చిక్కకుండా అతను పరారయ్యాడు. అతను పట్టుబడితే మొత్తం గుట్టురట్టవుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలే పోలీసుల రక్షణ కవచంలో రాజధాని పరిసరాల్లో కాపాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలోని ఒక క్లబ్లో దాచిన అశోక్‌ను శుక్రవారం రాత్రి మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌కు తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో అశోక్ ఉన్నట్టు చెబుతున్నారు. -
అశోక్ ఐఫోనే అత్యంత కీలకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దాకవరపు అశోక్ వాడే ఐఫోన్ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సంస్థ నిర్వహించిన సేవా మిత్ర యాప్‌కు చెందిన ప్రాసెస్డ్ డేటా మొత్తం దాని క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా భద్రపరిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసు లు మంగళవారం కూడా హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో చేసిన ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలిసింది. తెలంగాణ పోలీసులకు చిక్కకుండా, దర్యాప్తుకు సహకరించకుండా ఏపీలో తలదాచుకున్న అశోక్‌కు అక్కడి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. (‘రియల్ టైమ్’తో కాజేశారు) నంద్యాల ఉప ఎన్నికలోనే ట్రయల్ రన్... ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్ కర్ణాటకలోని దావణగెరెలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. తొలినాళ్లలో టీడీపీ కార్యకర్తగా, అభి మానిగా ఉన్న అశోక్‌కు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడైన లోకేశ్‌తో సన్నిహితంగా ఉన్న, ప్రస్తుతం పరిపాలనలోనూ జోక్యం చేసుకుంటున్న ఓ వ్యక్తి ద్వారా అశోక్ ఆ కోటరీలోకి చేరిపోయాడు. అప్పటికే అశోక్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఐటీ గ్రిడ్స్ సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న లోకేశ్ అండ్ కో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారిలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాల్సిందిగా అశోక్‌కు సూచించింది. (బ్లూ ఫ్రాగ్ దాగుడు‘మూత’లు) అతనితోపాటు మరో నలుగురితో ఏర్పాటైన అనధికారిక కమిటీ ఈ మేరకు అధ్యయనం చేశాక సేవామిత్ర యాప్‌కు రూపం ఇచ్చింది. బాబుతోపాటు లోకేశ్‌తోనూ పలుమార్లు సమావేశమైన అశోక్... ఇందులో అనేక మార్పుచేర్పులు చేశాడు. చివరకు 2017లో నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో యాప్ ట్రయల్ రన్ చేపట్టారు. ఆ ఉప ఎన్నికలో పలు సర్వే లు, అంచనాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చాయి. వివిధ కారణాల వల్ల నంద్యాల ఓటర్లు కూడా టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. అయినప్పటికీ సేవామిత్ర యాప్ ‘సర్వే’ల ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను గుర్తించడం, ప్రలోభాల నుంచి ఓట్ల తొలగింపు వరకు అనేక చర్యలు తీసుకోవడంతో అనూహ్యంగా ఆ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. దీంతో చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ‘సేవామిత్ర’ పనితీరుపై పూర్తి నమ్మకం ఏర్పడింది. (డేటాచౌర్యంలో చంద్రబాబే దోషి!) కస్టోడియన్లకు ఆదేశాలు ఇచ్చి... ఆ ఎన్నికలో తమకు బలం లేకపోయినా గెలిపించిన ‘సేవామిత్ర’ను మరింత విస్తరించాలని, టార్గెట్– 2019గా రూపొందించాలని లోకేశ్ అండ్ కో నిర్ణయించింది. ఆ వెంటనే అశోక్‌కు అవసరమైన అన్ని వన రులు కల్పించారు. ఏపీకి చెందిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఓటర్లు, ఆధార్ డేటాతోపాటు రైతులు, ఇతరులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ డేటాబేస్‌లుగా ఉంటాయి. వాటికి సీనియర్ ఐఏఎస్ అధికారులు, అత్యున్నత అధికారులు కస్టోడియన్లుగా ఉంటారు. అయితే వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన బాబు, లోకేశ్... ఆయా డేటాల సర్వర్లలోకి ఐటీ గ్రిడ్స్‌కు యాక్సెస్ ఇచ్చారు. దీనికి అవసరమైన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ను ప్రభుత్వాధికా రులే అందించారనే ఆరోపణలున్నాయి. వాటన్నిం టినీ క్రోడీకరించి ‘సేవామిత్ర’ను అప్‌గ్రేడ్ చేసిన ఐటీ గ్రిడ్స్ సంస్థ.. దురుద్దేశపూర్వక సర్వేల నుంచి ఓట్ల తొలగింపు వరకు పలు అక్రమాలకు పాల్పడుతూ టీడీపీకి సహకరిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘సేవామిత్ర’ తమను గెలిపిస్తే ఊహకందని భారీ నజ రానా ఇస్తానంటూ లోకేశ్.. అశోక్‌కు హామీ ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అశోక్ ఇటీవలి కాలంలో తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో భారీగా విస్తరించాడు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో సోదాలు... సైబరాబాద్ పోలీసులు మంగళవారం మరోసారి ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేశారు. ప్రధానంగా లాక్ చేసి ఉన్న మూడు అత్యాధునిక కంప్యూటర్లలో నిక్షిప్తమైన డేటాను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకున్నారు. పాస్వర్డ్ ప్రొటెక్టివ్‌గా ఉన్న ఆ కంప్యూటర్లను ఓపెన్ చేసిన ఎథికల్ హ్యాకర్లు... వాటి నుంచి 40 జీబీ ప్రాసెస్డ్ డేటాతోపాటు ఆ సంస్థ సర్వర్‌లో ఉన్న కలర్ ఫొటోలతో కూడిన ఏపీ ఓటర్ల జాబితా, ఆధార్ డేటాబేస్లను కొంత మేరకు సేకరించగలిగారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ తమ డేటా సేవ్ చేసుకోవడానికి ఉపకరించిన అమెజాన్, గూగుల్ సంస్థలకూ సైబరాబాద్ అధికారులు లేఖలు రాశారు. గూగుల్ ప్లేస్టోర్‌లో టీడీపీ సేవామిత్ర యాప్ అందుబాటులో ఉన్నందున ఆ సంస్థకు నోటీసులిచ్చారు. ఆ సంస్థలు 2, 3 రోజుల్లో ఐటీ గ్రిడ్స్ తమ సర్వర్లలో భద్రపరిచిన డేటా ఇస్తామని బదులిచ్చాయి. తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన రెండు కేసుల దర్యాప్తు జోరుగా సాగిస్తుండటంతో ఏపీ ‘ముఖ్యులు’, అధికారులు, పోలీసుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిఘా సిబ్బందిని రంగంలోకి దింపారు. వారు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లు, మాదాపూర్, ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్లు, మాదాపూర్ ఎస్ఓటీ, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ కార్యా లయాలు, డీజీపీ ఆఫీస్, ఇంటెలిజెన్స్ ఆఫీసుల వద్ద అనునిత్యం కాపలాకాస్తున్నారు. కాగా, ఎస్సార్ నగ ర్లో నమోదైన కేసును హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం సమీక్షించారు. ఈ కేసు దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులతో సమన్వ యం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏపీ పోలీసుల రక్షణలో అశోక్... డేటా స్కామ్‌కు సంబంధించి ఐటీ గ్రిడ్స్‌పై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో అశోక్ అప్రమత్తమయ్యాడు. ఫిర్యాదుకు, కేసు నమోదుకు మధ్య కొంత వ్యవధి ఉండటంతో చకచకా పావులు కదిపి సంస్థ నుంచి కీలక డేటా కొంత డిలీట్ చేశాడు. అలాగే బోగస్ సర్వే వివరాలను ప్రాసెస్ చేసిన ఈ సంస్థ... టీడీపీ వ్యతిరేక ఓట్లను గుర్తించింది. ఈ డేటాను క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అశోక్ తన ఐఫోన్లో భద్రపరిచాడు. హైదరాబాద్ నుంచి పారిపోయిన అశోక్... తనతోపాటు ఐఫోన్, మూడు హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లాడు. తాను ఎక్కడ ఉన్నా టీడీపీ అక్రమాలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలిసింది. డేటా స్కాంకు సంబంధించి ఐటీ గ్రిడ్స్‌పై సైబరాబాద్‌లోని మాదాపూర్‌తోపాటు హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ ఠాణాలోనూ కేసులు నమోదయ్యా యి. సైబరాబాద్ పోలీసులు అశోక్‌కు సోమవారం నోటీసులు జారీ చేసి 24 గంటల్లోగా లొంగిపోవాలని సూచించినా అతను పట్టించుకోలేదు. ప్రస్తుతం అతను ఏపీలోనే ఉన్నా డని పోలీసులు గుర్తించారు. అశోక్ దేశం వదిలి పారిపోయే అవకాశం లేకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు సైబరాబాద్ పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మధ్య సంచరిస్తున్న అశోక్‌కు ఏపీ పోలీసులు ఇద్దరు గన్మన్లను కూడా సమకూర్చినట్లు తెలిసింది. అశోక్‌ను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలు ఏపీలో గాలిస్తున్నాయి.