సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దాకవరం అశోక్ కదలికలను సిట్ పసిగట్టింది. ఆర్నెలలుగా అశోక్ కీలక వ్యక్తులతో తరచూ సంభాషించడం.. పరారీ తర్వాత ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్లు పలు ప్రాంతాలను సూచించడం ఈ కేసులో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సిగ్నళ్ల ఆధారంగా అతన్ని దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇక నిందితుడు మంతనాలు జరిపిన ఫోన్ నెంబర్లలో ప్రముఖులవి కూడా ఉండడంతో సిట్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇదే క్రమంలో అశోక్ మరో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించడంతో తెలంగాణ సిట్‌ను మరెన్నో సందేహాలు చుట్టుముట్టాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడ.. గుంటూరుకు?
డేటా చౌర్యం వెలుగుచూసిన తర్వాత అశోక్ ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. అందరికీ తెలిసిన అశోక్ నెంబరు తొలుత రెండు మూడు రోజుల వరకూ హైదరాబాద్ పరిసరాల సెల్ టవర్ల పరిధిలోనే ఉన్నట్టు గమనించారు. కానీ, అశోక్ ఆచూకీ మాత్రం పోలీసులకు లభించలేదు. సెల్‌ఫోన్ ద్వారా కదలికలను గుర్తిస్తారనే అశోక్ తన ఫోన్‌ను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చునని పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అనంతరం అతను మరో ఫోన్ వాడుతున్నట్టు ఇతర మార్గాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ రహస్య ఫోన్ నెంబర్ ద్వారా అశోక్ కదలికలను అధికారులు గుర్తించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఈ నెంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నెంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
గుంటూరు, మంగళగిరిలో మకాం?
అశోక్ వాడుతున్న సెల్‌ఫోన్.. డేటా చౌర్యానికి ముందు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి ఫోన్ నెంబర్ కూడా మాదాపూర్ టవర్ లొకేషన్‌లో ఉండటం, ఆయనతో తరచూ మాట్లాడుతుండటం ఈ ఎపిసోడ్‌లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రితో మాట్లాడిన తర్వాత అశోక్ ఫోన్ నెంబర్ నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులకూ ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. అశోక్‌తో అసలా అధికారులకు సంబంధమేంటి? మంత్రితో మాట్లాడిన వెంటనే అశోక్ అధికారులతో ఏం మాట్లాడాడు? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. అలాగే, డేటా చౌర్యం తర్వాత అశోక్ వాడినట్లుగా భావిస్తున్న రహస్య నెంబర్‌గల ఫోన్ మరికొన్ని సందేహాలను కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి పారిపోయిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ మంగళగిరి, గుంటూరు టవర్ లొకేషన్స్‌ను సూచిస్తున్నాయి. తరచూ ఇవే సిగ్నల్స్‌ను గుర్తించిన పోలీసులు అశోక్ డేటా చౌర్యం కేసు తెరమీదకొచ్చాక గుంటూరు, మంగళగిరిలో మకాం వేశాడా? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అశోక్‌తో ఫోన్ సంప్రదింపులు జరిపిన అధికారుల ఫోన్లు కూడా ఇదే టవర్ లొకేషన్లను చూపిస్తున్నట్టు తెలిసింది.
దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా?
ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అశోక్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తోంది. అతను ఓ గంటపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను మళ్లీ విజయవాడ మీదుగా మంగళగిరి, గుంటూరు చేరుకున్నట్లు సమాచారం. వాస్తవానికి అశోక్‌ను దేశం దాటించి ఉంటారని పోలీసులు ముందుగా అనుమానించారు. అతను వాడిన ఫోన్‌ను ఇక్కడే ఎవరికో ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి అక్కడి నుంచి గుంటూరు వెళ్లినట్టు అనుమానించారు. అయితే, శాస్త్రీయ కోణంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్‌మీట్‌లో అశోక్ మరో రెండు రోజుల్లో బయటకొస్తారని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. ఎయిర్‌పోర్టుకొచ్చిన అశోక్ తిరిగి గుంటూరు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. దేశం దాటించేందుకే ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ, దీనివల్ల ఎక్కడో ఒకచోట అతను దొరికిపోతాడని భావించి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం మానుకున్నారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment