అశోక్‌ ఐఫోనే అత్యంత కీలకం | IT Grids CEO Ashok in Amaravati safe location | Sakshi
Sakshi News home page

అశోక్‌ ఐఫోనే అత్యంత కీలకం

Published Wed, Mar 6 2019 2:40 AM | Last Updated on Wed, Mar 6 2019 8:58 AM

IT Grids CEO Ashok in Amaravati safe location - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్‌ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ దాకవరపు అశోక్‌ వాడే ఐఫోన్‌ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సంస్థ నిర్వహించిన సేవా మిత్ర యాప్‌కు చెందిన ప్రాసెస్డ్‌ డేటా మొత్తం దాని క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా భద్రపరిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సైబరాబాద్‌ పోలీసు లు మంగళవారం కూడా హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో చేసిన ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలిసింది. తెలంగాణ పోలీసులకు చిక్కకుండా, దర్యాప్తుకు సహకరించకుండా ఏపీలో తలదాచుకున్న అశోక్‌కు అక్కడి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. (‘రియల్‌ టైమ్‌’తో కాజేశారు)

నంద్యాల ఉప ఎన్నికలోనే ట్రయల్‌ రన్‌... 
ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్‌ కర్ణాటకలోని దావణగెరెలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. తొలినాళ్లలో టీడీపీ కార్యకర్తగా, అభి మానిగా ఉన్న అశోక్‌కు ఆ పార్టీకి చెందిన కొందరు కీలక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడైన లోకేశ్‌తో సన్నిహితంగా ఉన్న, ప్రస్తుతం పరిపాలనలోనూ జోక్యం చేసుకుంటున్న ఓ వ్యక్తి ద్వారా అశోక్‌ ఆ కోటరీలోకి చేరిపోయాడు. అప్పటికే అశోక్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఐటీ గ్రిడ్స్‌ సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న లోకేశ్‌ అండ్‌ కో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారిలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాల్సిందిగా అశోక్‌కు సూచించింది. (బ్లూ ఫ్రాగ్‌ దాగుడు‘మూత’లు)

అతనితోపాటు మరో నలుగురితో ఏర్పాటైన అనధికారిక కమిటీ ఈ మేరకు అధ్యయనం చేశాక సేవామిత్ర యాప్‌కు రూపం ఇచ్చింది. బాబుతోపాటు లోకేశ్‌తోనూ పలుమార్లు సమావేశమైన అశోక్‌... ఇందులో అనేక మార్పుచేర్పులు చేశాడు. చివరకు 2017లో నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో యాప్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టారు. ఆ ఉప ఎన్నికలో పలు సర్వే లు, అంచనాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చాయి. వివిధ కారణాల వల్ల నంద్యాల ఓటర్లు కూడా టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. అయినప్పటికీ సేవామిత్ర యాప్‌ ‘సర్వే’ల ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను గుర్తించడం, ప్రలోభాల నుంచి ఓట్ల తొలగింపు వరకు అనేక చర్యలు తీసుకోవడంతో అనూహ్యంగా ఆ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. దీంతో చంద్రబాబు, లోకేశ్‌ తదితరులకు ‘సేవామిత్ర’ పనితీరుపై పూర్తి నమ్మకం ఏర్పడింది. (డేటాచౌర్యంలో చంద్రబాబే దోషి!)

కస్టోడియన్లకు ఆదేశాలు ఇచ్చి... 
ఆ ఎన్నికలో తమకు బలం లేకపోయినా గెలిపించిన ‘సేవామిత్ర’ను మరింత విస్తరించాలని, టార్గెట్‌– 2019గా రూపొందించాలని లోకేశ్‌ అండ్‌ కో నిర్ణయించింది. ఆ వెంటనే అశోక్‌కు అవసరమైన అన్ని వన రులు కల్పించారు. ఏపీకి చెందిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఓటర్లు, ఆధార్‌ డేటాతోపాటు రైతులు, ఇతరులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ డేటాబేస్‌లుగా ఉంటాయి. వాటికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, అత్యున్నత అధికారులు కస్టోడియన్లుగా ఉంటారు. అయితే వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన బాబు, లోకేశ్‌... ఆయా డేటాల సర్వర్లలోకి ఐటీ గ్రిడ్స్‌కు యాక్సెస్‌ ఇచ్చారు. దీనికి అవసరమైన యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ను ప్రభుత్వాధికా రులే అందించారనే ఆరోపణలున్నాయి. వాటన్నిం టినీ క్రోడీకరించి ‘సేవామిత్ర’ను అప్‌గ్రేడ్‌ చేసిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ.. దురుద్దేశపూర్వక సర్వేల నుంచి ఓట్ల తొలగింపు వరకు పలు అక్రమాలకు పాల్పడుతూ టీడీపీకి సహకరిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘సేవామిత్ర’ తమను గెలిపిస్తే ఊహకందని భారీ నజ రానా ఇస్తానంటూ లోకేశ్‌.. అశోక్‌కు హామీ ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అశోక్‌ ఇటీవలి కాలంలో తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో భారీగా విస్తరించాడు. 

ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో సోదాలు... 
సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం మరోసారి ఐటీ గ్రిడ్‌ సంస్థలో సోదాలు చేశారు. ప్రధానంగా లాక్‌ చేసి ఉన్న మూడు అత్యాధునిక కంప్యూటర్లలో నిక్షిప్తమైన డేటాను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎథికల్‌ హ్యాకర్ల సాయం తీసుకున్నారు. పాస్‌వర్డ్‌ ప్రొటెక్టివ్‌గా ఉన్న ఆ కంప్యూటర్లను ఓపెన్‌ చేసిన ఎథికల్‌ హ్యాకర్లు... వాటి నుంచి 40 జీబీ ప్రాసెస్డ్‌ డేటాతోపాటు ఆ సంస్థ సర్వర్‌లో ఉన్న కలర్‌ ఫొటోలతో కూడిన ఏపీ ఓటర్ల జాబితా, ఆధార్‌ డేటాబేస్‌లను కొంత మేరకు సేకరించగలిగారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్‌ తమ డేటా సేవ్‌ చేసుకోవడానికి ఉపకరించిన అమెజాన్, గూగుల్‌ సంస్థలకూ సైబరాబాద్‌ అధికారులు లేఖలు రాశారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో టీడీపీ సేవామిత్ర యాప్‌ అందుబాటులో ఉన్నందున ఆ సంస్థకు నోటీసులిచ్చారు.

ఆ సంస్థలు 2, 3 రోజుల్లో ఐటీ గ్రిడ్స్‌ తమ సర్వర్లలో భద్రపరిచిన డేటా ఇస్తామని బదులిచ్చాయి. తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌కు సంబంధించిన రెండు కేసుల దర్యాప్తు జోరుగా సాగిస్తుండటంతో ఏపీ ‘ముఖ్యులు’, అధికారులు, పోలీసుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిఘా సిబ్బందిని రంగంలోకి దింపారు. వారు సైబరాబాద్, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్లు, మాదాపూర్, ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్లు, మాదాపూర్‌ ఎస్‌ఓటీ, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌ కార్యా లయాలు, డీజీపీ ఆఫీస్, ఇంటెలిజెన్స్‌ ఆఫీసుల వద్ద అనునిత్యం కాపలాకాస్తున్నారు. కాగా, ఎస్సార్‌ నగ ర్‌లో నమోదైన కేసును హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ మంగళవారం సమీక్షించారు. ఈ కేసు దర్యాప్తులో సైబరాబాద్‌ పోలీసులతో సమన్వ యం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఏపీ పోలీసుల రక్షణలో అశోక్‌... 
డేటా స్కామ్‌కు సంబంధించి ఐటీ గ్రిడ్స్‌పై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు అందడంతో అశోక్‌ అప్రమత్తమయ్యాడు. ఫిర్యాదుకు, కేసు నమోదుకు మధ్య కొంత వ్యవధి ఉండటంతో చకచకా పావులు కదిపి సంస్థ నుంచి కీలక డేటా కొంత డిలీట్‌ చేశాడు. అలాగే బోగస్‌ సర్వే వివరాలను ప్రాసెస్‌ చేసిన ఈ సంస్థ... టీడీపీ వ్యతిరేక ఓట్లను గుర్తించింది. ఈ డేటాను క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా అశోక్‌ తన ఐఫోన్‌లో భద్రపరిచాడు. హైదరాబాద్‌ నుంచి పారిపోయిన అశోక్‌... తనతోపాటు ఐఫోన్, మూడు హార్డ్‌డిస్క్‌లను తీసుకెళ్లాడు. తాను ఎక్కడ ఉన్నా టీడీపీ అక్రమాలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలిసింది. డేటా స్కాంకు సంబంధించి ఐటీ గ్రిడ్స్‌పై సైబరాబాద్‌లోని మాదాపూర్‌తోపాటు హైదరాబాద్‌లోని ఎస్సార్‌ నగర్‌ ఠాణాలోనూ కేసులు నమోదయ్యా యి.

సైబరాబాద్‌ పోలీసులు అశోక్‌కు సోమవారం నోటీసులు జారీ చేసి 24 గంటల్లోగా లొంగిపోవాలని సూచించినా అతను పట్టించుకోలేదు. ప్రస్తుతం అతను ఏపీలోనే ఉన్నా డని పోలీసులు గుర్తించారు. అశోక్‌ దేశం వదిలి పారిపోయే అవకాశం లేకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మధ్య సంచరిస్తున్న అశోక్‌కు ఏపీ పోలీసులు ఇద్దరు గన్‌మన్లను కూడా సమకూర్చినట్లు తెలిసింది. అశోక్‌ను పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలు ఏపీలో గాలిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement