నెల్లూరులోని మూలాపేటలో వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్త
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ బరితెగిస్తోంది. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతోనూ, ఓటర్ల జాబితాలో ఓటు ఉందో, లేదో తెలుసుకునే పేరుతోనూ ప్రతి ఇంటికీ వెళ్తున్న టీడీపీ డేటా దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వివరాలు, ఓటీపీ వంటి అత్యంత సున్నిత సమాచారాన్ని ఈ ముఠా సేకరిస్తోంది.
కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ ఈ పచ్చ మూకల దండు ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపైన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీదకొచ్చి పడుతోందని.. పట్టపగలే ఇళ్లలోకి చొరబడుతోందని..
ఆ ముఠా చేసే తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇంతలోనే రాజంపేట కోవలోనే తాజాగా నెల్లూరులోనూ టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించింది.
నెల్లూరులో నారాయణ గ్యాంగ్ బరితెగింపు..
నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ గ్యాంగ్ శనివారం పట్టపగలే ప్రజల ఇళ్లలోకి చొరబడింది. ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారం సేకరించింది. ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ సున్నిత వ్యక్తిగత సమాచారం రాబట్టింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లు, మొబైల్ ఫోన్ నంబర్, దానికి వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పాలని అడగడంతో నెల్లూరులో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.
నెల్లూరు నగరంలోని మూలాపేట డివిజన్‌లో ఓ ఇంటికి వెళ్లి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న టీడీపీ ముఠా సభ్యుడ్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ సున్నిత వ్యక్తిగత సమాచారం మీకెందుకంటూ నిలదీశారు. దీంతో ఆ డేటా దొంగ పరార్ కావడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తన విద్యాసంస్థల్లో పనిచేసే చిరుద్యోగులను ముఠాగా ఏర్పాటు చేసి నారాయణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.
నెల్లూరు నగర నియోజకర్గంలో దాదాపు 75 వేల కుటుంబాలు ఉన్నాయి. 2.35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరందరి సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు నారాయణ తన ముఠాను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారాయణకు రూ.కోట్లు కుమ్మరించినా ఓటమి తప్పలేదు.
తన విద్యాసంస్థల ఉద్యోగులు, అధ్యాపకులను రంగంలోకి దింపి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు వెదజల్లినా ఓటర్లు వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ ధపా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడానికి కుట్ర పన్నారని చెబుతున్నారు.
పచ్చ దొంగల డేటా తస్కరణ ఇలా..
టీడీపీ పచ్చ దొంగల ముఠా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ల తనిఖీ కోసం వచ్చామంటూ చెబుతున్నారు. ఆ ఇంటి ఓటర్ల పేర్లు చదువుతున్నారు. ఆపై వారిని మాటల్లో పెట్టి సున్నిత వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తున్నారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ కుటుంబం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైతే వారి ఓట్లు తొలగింపు ఫారం–7 నమోదు చేసి మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వచ్చిందని.. దాన్ని చెప్పాలని దబాయిస్తున్నారు.
కొందరు అమాయకులు ఓటీపీ చెబుతుండటంతో వారి ఓట్లు తొలగింపునకు ఫారం–7 నమోదవుతుంది. దాంతో పాటు ఓటర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం టీడీపీ నేత నారాయణ మీ ఖాతాలో నగదు జమ చేస్తాడని చెబుతూ మాయ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల నగదు కూడా జమ అవుతుందని పచ్చి అబద్ధాలకు దిగుతున్నారు.
ఓటీపీ క్లిక్ చేస్తే అంతే సంగతులు
పట్టపగలే దొంగల్లా ప్రజల ఇళ్లల్లోకి చొరబడుతున్న టీడీపీ దొంగల ముఠా ప్రజల సున్నిత వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని తమ దగ్గర ఉన్న ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. మొబైల్ నంబర్‌కు ఓటీపీ, మేసేజ్ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేస్తే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ అంటూ కార్డు వస్తోంది. ఆ కార్టులో.. ‘ఐదేళ్లలో రూ.2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు.. మీకు అభినందనలు.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది’ అంటూ కనిపిస్తోంది.
ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేటలో మర్రి మౌనిక అనే మహిళను ఇలాగే టీడీపీ దొంగల ముఠా బురిడీ కొట్టించింది. అంతటితో ఆగటంలేదు.. చంద్రబాబు సంతకం చేశారంటూ ఒక గ్యారెంటీ పత్రాన్ని సైతం ఇస్తుండటం ఈ ముఠా బరితెగింపుకు నిదర్శనం. ఆలూ లేదు.. సూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తుండటం వీరి పైత్యానికి పరాకాష్ట.
ఎల్లో మీడియా తీరు మారదా?
రాష్ట్రంలో పచ్చ ముఠా ఇళ్లలోకి చొరబడి ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నా.. ఎల్లో మీడియా మాత్రం ఓటర్ల సవరణలు, చేర్పులు, తొలగింపుల్లో వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తప్పుడు రాతలు రాస్తోంది. ఇటీవల సర్వేపల్లిలో టీడీపీ ముఠా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు ఫారం–7 నమోదు చేసి అడ్డంగా దొరికినా ఎల్లో మీడియా పచ్చ కళ్లకు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment