సాక్షి, అమరావతి: ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, నిజాయితీ చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన అన్ని విషయాలను, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ, వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’.. ఇది చంద్రబాబునాయుడు సీఎం పదవీ స్వీకారోత్సవంలో చేసిన ప్రమాణం.
..డేటా స్కాం బాగోతం వెలుగుచూడడంతో ఈ ప్రమాణాలన్నీ అటకెక్కించేసినట్లేనని స్పష్టమైంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, సున్నితమైన రహస్యాలను కాపాడాల్సిన సర్కారు పెద్దలే బాధ్యత మరిచి పార్టీ సేవల కోసం, రాజకీయ స్వార్థం కోసం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అందిస్తే దానిని తీవ్ర నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహించే ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీలోని మూడున్నర కోట్లకు పైగా ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీకి పాల్పడటం తీవ్ర నేరమేనని న్యాయవాదులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ఐటీ మంత్రి లోకేశ్‌లు బాధ్యత వహించాల్సిందేననే వాదన వారి నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలకే పరిమితం కావాల్సిన ప్రజాసాధికార సర్వేను అడ్డుపెట్టుకుని ప్రజల కీలక సమాచారాన్ని ప్రైవేటు యాప్‌లకు అనుసంధానం చేయడం తీవ్ర నేరమేనని అంటున్నారు. వీటన్నింటితోపాటు ఏకంగా ఓటర్ల మాస్టర్ జాబితాను టీడీపీ సేవామిత్ర యాప్‌కు అనుసంధానం చేసి ఓట్ల తొలగింపులు, చేర్పులు చేసేలా అనధికారికంగా పెద్ద నెట్‌వర్క్‌ను నడపడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం.
ఎన్నికల్లో గెలుపు కోసమే ఇదంతా..
కాగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ అందుకు అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారితోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి కలర్ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్‌కు బ్లూ ఫ్రాగ్ సంస్థే అందజేసింది. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్‌నకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు ఖాతా, తదితర వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం భారీ డేటా స్కామ్‌కు పాల్పడడం నిబంధనలకు విరుద్ధమని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. డేటా చోరీ విషయం బయటపడటంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఎదురుదాడికి దిగడాన్ని కూడా న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు.
‘సుప్రీం’ తీర్పునకు విరుద్దం..
రాజ్యాంగం ద్వారా సక్రమించిన వ్యక్తిగత సమాచార గోప్యత హక్కును పరిరక్షించాలని 2012లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పౌరుడికి తెలియకుండా ఆయన వ్యక్తిగత వివరాలును ఇతరులకు తెలియజేయకూడదని అందులో స్పష్టంగా పేర్కొంది. అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని నిర్ధారణ అయ్యింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు తూట్లు పొడిచే ఇటువంటి నేరాలకు పాల్పడే ప్రభుత్వ పెద్దలైనా శిక్షార్హులే.
- పాకా వెంకట సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది
పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌కూ తూట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటుపరం చేసి పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్‌కు తూట్లు పొడిచారు. ఇలా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం సరికాదు. ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తుల వద్దకు చేరవేసి ప్రజలను మోసగించారు. ఇది ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ, ఐపీసీ–420, దొంగతనం నేరాల పరిధిలోకి వస్తుంది. ఇందుకు బాధ్యులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్‌లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. నైతిక బాధ్యత వహించి వారు తమ పదవులకు రాజీనామా చేయాలి.
– పిళ్లా రవి, బెజవాడ బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు
డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే!
Published Tue, Mar 12 2019 8:23 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment