ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌! | TDP App Breached Data Of AP Voters | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్‌!

Published Mon, Mar 4 2019 3:47 AM | Last Updated on Mon, Mar 4 2019 6:37 PM

TDP App Breached Data Of AP Voters - Sakshi

ఏపీ మంత్రి లోకేశ్‌కు యాప్‌ పనితీరును వివరిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్, తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ / అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడానికి ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదార్లు తొక్కుతోంది. ఇందుకోసం 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవ్యతిరేకంగా వాడుకుంటోంది. ప్రభుత్వ పనితీరు పట్ల వ్యతి రేకంగా ఉన్నవారి ఓట్లను తొల గించడానికి, ఎన్నికల సమయంలో ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేయడానికి కుట్ర పన్నుతోంది. హైదరాబాద్‌లో బయటపడ్డ డేటా చోరీ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ యాప్‌ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థే ఈ డేటా చోరీ స్కామ్‌కు పాల్పడినట్టు గుట్టురట్టు కావడంతో ‘పచ్చ’నేతల్లో వణుకు మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. ఈ కుంభకోణంపై హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన తుమ్మల లోకేశ్వర్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసేందుకు ఏపీ పోలీసులు ఆదివారం ప్రయత్నించడం గమనార్హం.  (డేటా చౌర్యం కేసులో విచారణ వేగవంతం)

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ టీడీపీకి చెందిన అధికారిక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఇందుకోసం విశాఖపట్నంలోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ సంస్థ అవసరమైన సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లూ ఫ్రాగ్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందినవారితోపాటు ప్రజల వ్యక్తిగత సమా చారాన్ని వారి కలర్‌ ఫొటోలతో సహా భద్రపరుస్తోంది. అంటే ఈ వివరాలన్నింటినీ ఐటీ గ్రిడ్స్‌కు అందజేసిందన్నమాట. టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్‌నకు ప్రజల ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. వాస్తవానికి ఈ వివరాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉంచాలి. కానీ, రాష్ట్రంలో దాదాపు 3.50 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికార పార్టీ యాప్‌లో చేర్చారు. ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీల వివరాలు ప్రైవేట్‌ సంస్థ చేతిలో ఉండడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. దీన్ని గుర్తించిన సామాజిక కార్యకర్త, ఇందూ ఫార్టూన్‌ ఫీల్డ్స్‌ వాసి తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 ఓటర్‌ జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు 2019 ఓటర్ల జాబితాలో లేకపోవడాన్ని లోకేశ్వరరెడ్డి గుర్తించారు. (ఐటీగ్రిడ్స్‌ స్కాం: అధికారుల్లో టెన్షన్‌.. టెన్షన్‌)

లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసులు 120(బి), 379, 420, 188 ఐపీసీ, సెక్షన్‌ 66(బి), 72 ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి కొండాపూర్, కేపీహెచ్‌బీ కాలనీల్లో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్‌ను సైతం ఆధీనంలోకి తీసుకున్న సైబరాబాద్‌ పోలీసులు ఆ సంస్థ ఉద్యోగులైన రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్‌లు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్‌ కింద ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన ఆదివారం విచారణకు హాజరు కాలేదు. డాకవరం అశోక్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. (చంద్రబాబు, లోకేష్‌ల కుట్రే)

కీలక సమాచారం తొలగింపు!  
డేటా స్కామ్‌సై గత నెల ఆఖరి వారంలో సైబరాబాద్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయం ఫిబ్రవరి 26న మీడియాలో వచ్చింది.  దీంతో ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వెంటనే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 27న సేవామిత్ర యాప్‌లో మార్పులు చేర్పులు చేసి, అప్‌గ్రేడ్‌ చేసినట్లు స్పష్టమైంది. దీనికి సంబంధించిన ఫొటో ఆదివారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ తమ వద్ద ఉన్న ప్రజల వ్యక్తిగత, ఓటర్‌ ఐడీ కార్డులు, ఆధార్‌ డేటాను తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేవామిత్ర యాప్‌ను లోకేశ్వర్‌రెడ్డి గమనించినప్పుడు అందులో ఓటర్‌ జాబితా ప్రకారం ప్రజల ఫొటోలు, వివరాలు కనిపించాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలియడంతో ఐటీ గ్రిడ్స్‌ సర్వర్‌ నుంచి కీలక సమాచారాన్ని డిలీట్‌ చేయడంతోపాటు సర్వర్లను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయాల్లో సోదాలు చేసిన పోలీసుల కొన్ని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. డిలీట్‌ చేసిన వివరాలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. (ఐటీ గ్రిడ్‌ డేటా స్కామ్‌ సూత్రధారి బాబే)

లోకేశ్వర్‌రెడ్డి కిడ్నాప్‌కు ఏపీ పోలీసుల యత్నం 
ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన లోకేశ్వర్‌రెడ్డిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారు. గుంటూరుకు చెందిన డీఎస్పీ కులశేఖర్, ఇన్‌స్పెక్టర్‌ బాలమురళీ కృష్ణ సహా నలుగురు పోలీసులు లోకేశ్వర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుర్భాషలాడారు. ఫిర్యాదు చేయడానికి డేటా ఎక్కడి నుంచి వచ్చిదంటూ బెదిరించారు. ఓ దశలో కిడ్నాప్‌ చేసి తమతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆయన ఫోన్‌ ద్వారా సైబరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేపీహెచ్‌బీ, మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్లు లోకేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులను అడ్డుకున్నారు.

భాస్కర్‌ అనే ఉద్యోగి అదృశ్యంపై గుంటూరులోని ఓ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందని, దర్యాప్తులో భాగంగా లోకేశ్వర్‌రెడ్డిని ఏపీకి తరలిస్తున్నామంటూ ఏపీ పోలీసులు వాదించారు. తమ సంస్థ ఉద్యోగిభాస్కర్‌ కనిపించడం లేదంటూ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పడం గమనార్హం. స్థానిక  పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు వచ్చారు? కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని తెలంగాణ పోలీసులు నిలదీయడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం లోకేశ్వర్‌రెడ్డి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో అధికారులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరిగారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేయడం గమనార్హం. 

అడ్వొకేట్‌ జనరల్‌తో చంద్రబాబు మంత్రాంగం 
ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాకం బయటపడి, తామే దోషిగా నిలబడే పరిస్థితి రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఈ కేసు నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై ఆదివారం ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీధర్‌తో గంటన్నరపాటు చర్చించారు. డేటా స్కామ్‌పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఎదురు కేసు పెట్టాలా? మరేదైనా చేయాలా? అనేదానిపై సమాలోచనలు జరిపారు. డేటా చోరీ కుంభకోణాన్ని తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య వివాదంగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హడావుడిగా మీడియాకు లీకులు ఇచ్చి ఇదేదో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగాను, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజేపీలపై నెపాన్ని నెట్టేందుకు పాట్లు పడ్డారు. 

ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ సీరియస్‌ క్రైమ్‌ 
ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం చోరీకి గురికావడం సీరియస్‌ క్రైమ్‌ అని ఒక రిటైర్డ్‌ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్‌నకు ఎలా అనుసంధానిస్తారని సైబర్‌ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇదే పని యూరప్, అమెరికా దేశాల్లో చేస్తే తక్షణమే జైలులో పెడతారని గుర్తుచేస్తున్నారు.  సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌(ఆధార్‌ కార్డు) లాంటి వాటిని చట్ట వ్యతిరేకంగా వాడినా, ప్రైవేట్‌ వ్యక్తులకి అందచేసినా అది తీవ్రమైన నేరమే. ఇలాంటి నేలరకు కఠిన శిక్షలు అమలు చేయాలని డేటా ప్రైవసీ చట్టాలు చెబుతున్నాయి. ఈ కేసు విచారణ సక్రమంగా జరపాలని, రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడానికి ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, దీనిపై చంద్రబాబు, లోకేశ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

కుంభకోణంలో అధికారుల పాత్ర! 
ఆధార్‌ డేటాబేస్‌ అనేది పూర్తిగా వ్యక్తిగత వివరాలతో కూడి ఉంటుంది. ఆధార్‌ చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ డేటా యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) సహా ఎవరి వద్దా ఉండకూడదు. కనీసం నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు, పోలీసులకు కూడా ఈ డేటాబేస్‌లోకి యాక్సెస్‌ ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంక్షేమ పథకాలకు సంబం«ధించిన లబ్ధిదారుల జాబితాలను వ్యక్తిగత వివరాలతో సహా ఎవరికీ/ప్రైవేట్‌ సంస్థలకు అందించకూడదు. తాజాగా బయటపడిన డేటా చోరీ కుంభకోణంలో ప్రభుత్వ అధికారుల పాత్ర (ఐపీసీ 188) కూడా ఉందని అనుమానిస్తున్నారు. చోరీ (ఐపీసీ 370) ద్వారానే డేటా సంగ్రహించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. దీన్ని వినియోగించి సేవామిత్ర సంబంధీకులు ప్రజల్ని మోసం చేస్తున్నారని (ఐపీసీ 420) కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం ఆన్‌లైన్‌ కేంద్రంగా జరగడంతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని 66, 72 సెక్షన్లనూ ఈ కేసులో జోడించారు.   

సేవామిత్ర యాప్‌తో ఏం చేస్తున్నారు? 
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు పకడ్బందీగా స్కెచ్‌ వేశారు. సేవామిత్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసిన ట్యాబ్‌లను తమ బృందాలకు ఇచ్చి, మైక్రో లెవెల్‌ సర్వేలు అంటూ గ్రామాల్లో పంపిస్తున్నారు. ఈ యాప్‌లో ప్రజలందరి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. బృందాలుగా వెళ్లే యువకులు ఓటర్లను స్వయంగా కలుసుకుంటున్నారు. మీరు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని నచ్చజెబుతున్నారు. సదరు ఓటరును టీడీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా? ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు? తదితర ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాబ్‌ల్లోనే సమాధానాలు నమోదు చేసి, పార్టీ పెద్దలకు అందజేస్తున్నారు. సర్కారు పనితీరుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసిన, ప్రతిపక్షానికి ఓటు వేస్తామని చెప్పిన వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇందుకోసం తమ ఓటును తొలగించాలంటూ ఓటర్ల పేరిటే ఆన్‌లైన్‌లో ఫారం–7 సమర్పిస్తున్నారు. యాప్‌లో ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఓట్లు కొనేయడానికి నేరుగా నగదు జమ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. 

‘మిస్సింగ్‌’ డ్రామా 
తమ ఉద్యోగి కన్పించడం లేదని ఒక సంస్థ నిర్వాహకుడు ఇచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌పై ఏపీ పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. రాత్రికి రాత్రే కేసు నమోదు చేసారు. అంతేవేగంగా వందలాది మంది పోలీసులు అర్ధరాత్రికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయం వద్దకు చేరి కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం గాలించేందుకు వచ్చామన్నారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ స్కామ్‌ గుట్టురట్టు కావడంతో శనివారం రాత్రి జరిగిన ‘మిస్సింగ్‌ హైడ్రామా’ ఇది. డేటా చోరీ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకుడు రేగండ్ల అశోక్‌ తమ ఉద్యోగి కటకం భాస్కర్‌ కన్పించడం లేదంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావుకు శనివారం రాత్రి వాట్సాప్‌లో మెసేజ్‌ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

గత నెల 28న పెదకాకాని ప్రాంతంలోని ఐజేఎం అపార్టుమెంట్‌కు వచ్చిన భాస్కర్‌ హైదరాబాద్‌కు తిరిగిరాలేదంటూ అశోక్‌ పంపిన వాట్సాప్‌ మెసేజ్‌ను ఎస్పీ పెదకాకాని సీఐకి పంపించి కేసు నమోదు చేయించినట్టు సమాచారం. పెదకాకాని పోలీసులు మిస్సింగ్‌ కేసును నమోదు చేయగా, కేవలం గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ ఆఫీస్‌కు చేరుకున్నారు. భాస్కర్‌ మిస్సింగ్‌ కేసు నమోదైనందునా అతని ఆచూకీ కోసం వచ్చినట్టు చెప్పిన ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ ఆఫీస్‌ వద్ద సోదాలు చేసే ప్రయత్నం చేశారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థ డేటా చోరీ స్కామ్‌కు పాల్పడిందని, దానిపై కేసు నమోదు చేసి భాస్కర్‌తోపాటు మరికొందరు ఉద్యోగులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్టు తేల్చిచెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement