సాక్షి, హైదరాబాద్ : 2019లో గెలుపే లక్ష్యంగా యధేచ్చగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ సర్కార్ భాగోతం మరోసారి బట్టబయలు అయింది. ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ పేరుతో చేస్తున్న ‘పచ్చ’ కుట్రలను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు అయింది. ప్రజల వ్యక్తిగత డాటాను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను కొట్టేసిన ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చెందిన పలువురుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడు అశోక్ దాకవరపు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీ... టీడీపీకి చెందిన అధికారక ‘సేవామిత్ర’ యాప్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రజల ఓటర్ల ఆధార్ డాటాతో పాటు వ్యక్తిగత వివరాలును ఐటీ గ్రిడ్స్ యధేచ్ఛగా వాడుకుంది. దీంతో ఐటీ గ్రిడ్ కంపెనీ డాటా కుంభకోణంపై వైఎస్సార్ సీపీ నేత లోకేశ్వర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన‍్ల కింద కేసు నమోదు చేశారు. గత మూడు రోజుల నుంచి మాదాపూర్‌లోని ఆ కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు.
పోలీసుల తనిఖీల నేపథ్యంలో ఐటీ గ్రిడ్‌లో పని చేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదంటూ ఆ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భాస్కర్ కోసం ఏపీ పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వచ్చారు. అయితే డాటా చోరీ కేసులో భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని తెలంగాణ పోలీసులు వారికి తెలిపారు. భాస్కర్‌ను తమకు అప్పజెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అనధికారికంగా గస్తీ తిరుగుతున్నారు. ఆ కార్యాలయం సమీపంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో పోలీసులకు ఏపీ ప్రభుత్వం బస ఏర్పాటు చేసింది.
సేవా మిత్ర యాప్‌లో...
కాగా సేవా మిత్ర యాప్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు ఆధార్ వివరాలు, ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారి వివరాలతోపాటు కలర్ ఫోటో కూడా ఉంది. ఇది ఎన్నికల సంఘం, ఆధార్ నిబంధనలకు విరుద్ధం. అయితే ఆ కంపెనీకి డాటా ఎలా వచ్చిందనే దానికి ఇప్పటికీ ఆధారాల్లేవు. పైగా ఆ కంపెనీకి ప్రమోటర్స్ టీడీపీకి చాలా దగ్గర వ్యక్తులు కావడంతో గోప్యంగా ఉంచాల్సిన డాటాను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిప్పులు చెరిగిన చంద్రబాబు...
మరోవైపు ఐటీ గ్రిడ్స్ ఇండియా కంపెనీలో తెలంగాణ పోలీసులు సోదాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. టీడీపీ వ్యవహారం బట‍్టబయలు కావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో నుంచి బయటపడేందుకు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారు. సాక్షాత్తూ ఏపీ ఐటీ మంత్రి లోకేష్... ముఖ్యమంత్రి కూడా తమ కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేస్తోందని గగ్గోలు పెట్టడం చూస్తుంటే.. ఏపీలో ఓటర్ల జాబితా నుండి వైఎస్సార్ సీపీ అభిమానుల పేర్లను తొలగించడంలో ఈ కంపెనీయే కీలక పాత్ర పోషిస్తోందన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment