సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది.
ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్‌బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నాలుగు రాష్ట్రాల్లో గాలింపు..
ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం.
ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్‌కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్‌లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment