ఆదమరిస్తే అంతే సంగతి... | Expert tips for data protection | Sakshi
Sakshi News home page

ఆదమరిస్తే అంతే సంగతి...

Published Mon, Sep 3 2018 1:41 AM | Last Updated on Mon, Sep 3 2018 1:41 AM

Expert tips for data protection - Sakshi

టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ ఈ మధ్య ఉన్నట్టుండి హాట్‌ టాపిక్‌ అయ్యారు. కారణం... చేతనైతే నా డేటా హ్యాక్‌ చేయండంటూ తన ఆధార్‌ నెంబర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. హ్యాకర్లకు సవాల్‌ విసిరారు. ఇంది కొంత విమర్శలకు దారితీసినా... తన డేటా భద్రతపై తనకున్న నమ్మకమే అలా చేయించిందనే వాదనలు ఎక్కువగా వినిపించాయి.  

ఇది నిజమే కావచ్చు. కాకపోతే శర్మ మాదిరిగా అందరూ తమ డేటా భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోగలరా? తీసుకోగలరని గట్టిగా చెప్పలేం. ఎందుకంటే డేటా దుర్వినియోగం రోజురోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అందుకే ఆర్‌బీఐ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ పరంగా వ్యవస్థలను పటిష్ట పరిచి, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘మన వ్యక్తిగత డేటాను బయటపెడితే ఎవరూ కూడా రక్షించలేరు’’ అనేది లక్ష్మీ విలాస్‌ బ్యాంకు రిటైల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ పీరుష్‌ జైన్‌ మాట. ఈ నేపథ్యంలో డేటా రక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


వైఫైకి రక్షణ తప్పనిసరి...
మీ వైఫై కనెక్షన్‌ను భద్రంగా చూసుకోవడం అత్యంత ప్రధానం. చాలా పరికరాలు ఇపుడు వైఫైతో కనెక్ట్‌ అయిపోతున్నాయి. అందుకే డేటా చోరులు మీ వైఫై నెట్‌వర్క్‌లోకి చొరబడి సున్నితమైన డేటాకు హాని తలపెట్టొచ్చు. కాబట్టి మీరు వాడని సమయాల్లో వైఫైను స్విచాఫ్‌ చేయడం మంచిది. క్లిష్టమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవడం, దాన్ని తరచుగా మారుస్తుండడం వంటివి చేయాలి. ఇన్విజిబుల్‌... అంటే మీ నెట్‌వర్క్‌ మరొకరికి సెర్చ్‌లో కనిపించకుండా ఉండే ఆప్షన్‌ ఎంచుకుంటే ఇంకా మంచిది.  

ఉచితం కనెక్షన్లతో ప్రమాదమే...
బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లను వినియోగించుకోవడానికి కాస్తంత దూరంగా ఉండాలనేది నిపుణుల సూచన. ‘‘పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ వినియోగించే సమయంలో నేరగాళ్లు మీ పరికరం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రమాదం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు మీ పరికరాలను వాడుకునే ప్రమాదం కూడా ఉంది’’ అని అర్క సీఈవో శివంగి నందకర్ణి చెప్పారు.  

పరికరాలకు కవచం...
అధిక భద్రతా ప్రమాణాలు, నాణ్యతతో కూడిన యాంటీవైరస్, యాంటీ మాల్‌వేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఉచిత సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండడం మంచిదన్నది నిపుణుల సూచన. బ్లూటూత్‌ను సైతం వినియోగంలో లేని సమయంలో కచ్చితంగా ఆఫ్‌లోనే ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఓటీపీ వస్తుండడంతో మొబైల్‌కు తప్పకుండా పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసిన వారు కూడా మీ మొబైల్‌ను దుర్వినియోగం చేసే వీలుంటుంది.  

యాప్స్‌ పట్ల జర జాగ్రత్త!
నిజానికి ఈ రోజుల్లో చాలా వరకు డేటా చౌర్యం అన్నది మొబైల్‌ యాప్స్‌ ద్వారానే జరుగుతోందన్నది నిపుణుల హెచ్చరిక. యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తున్న సమయంలో కాంటాక్టుల సమాచారం, ఎస్‌ఎంఎస్‌ల సమాచారం, మీడియా యాక్సెస్, లొకేషన్‌ యాక్సెస్, కెమెరా తదితర అనుమతులు అడుగుతుండడం అందరికీ అనుభవమే. తద్వారా మీ మొబైల్‌లోని ఆయా సమాచారాన్ని ఇవి కాపీ చేసేస్తుంటాయి.

మీ ఫోన్లో సేవ్‌ చేసి ఉన్న ఇతరుల సమాచారాన్ని కూడా కొట్టేస్తుంటాయి. అలాగని ముఖ్యమైన యాప్స్‌ను వాడకుండా ఉండటం, డిలీట్‌ చేసుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి. కాకపోతే ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్‌ చూడాలి. అనవసరమైన పర్మిషన్స్‌ను తీసేయాలి. అలాగే, తప్పనిసరి అయిన యాప్స్‌ వినియోగానికే పరిమితం కావడం మంచిది. మరో ముఖ్యమైన అంశమేంటంటే ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి కాకుండా ప్రయివేటు వెబ్‌సైట్ల నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకునే యాప్స్‌కు దూరంగా ఉండటమే మంచిది.

ఈమెయిల్‌ అలర్ట్‌
ఈ మెయిల్‌ అన్నది ఎంతో కీలకమైనదిగా చాలా మంది భావించడం లేదు. ఈ మెయిల్‌ అనేది ఓ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలకు, వ్యక్తిగత వివరాలకు కేంద్రం వంటిది. కనుక ఈ మెయిల్‌కు కఠినమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. సెకండ్‌ ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌ కూడా ఉండడం మంచిది. కొత్త డివైజ్‌పై మెయిల్‌ లాగిన్‌ అయిన ప్రతిసారీ అలర్ట్‌ వస్తుంటుంది. దీంతో అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.  

కార్డులు భద్రం సుమా!!
ఏటీఎం కేంద్రాలు కూడా మోసాలకు నిలయాలవుతున్నాయి. మీరు ఏటీఎం కేంద్రంలో కార్డు స్వైప్‌ చేసే చోట క్లోనింగ్‌ పరికరాలను మోసగాళ్లు ఉంచి, అందులో స్వైప్‌ చేసిన కార్డుల సమాచారాన్ని కొట్టేస్తున్న ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. అందుకే ఏటీఎం కేంద్రాల్లో కార్డులను స్వైప్‌ చేసే చోట క్లోనింగ్‌ పరికరాలున్నాయేమోనని గమనించాలి. క్లోనింగ్‌ పరికరాల ద్వారా కొట్టేసిన సమాచారంతో మోసగాళ్లు తమకు అనువైన చోట మోసాలకు పాల్పడుతుంటారు.

అలాగే, పిన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసే సమయంలో అడ్డుగా ఓ చేయిని ఉంచడం ద్వారా చోరీకి అవకాశం లేకుండా చూసుకోవచ్చు. కార్డు వివరాలను ఆన్‌లైన్‌ రిటైలర్లతో పంచుకోవద్దు. పిన్‌ నంబర్‌ కూడా తరచుగా మారుస్తుండాలి. ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతాల్లోని ఏటీఎంలను నేరగాళ్లు ఎంపిక చేసుకుంటుంటారు. కనుక రిమోట్‌ ప్రాంతాల్లో కాకుండా జన్మసమ్మర్థ ప్రాంతాల్లో, సెక్యూరిటీ ఉన్న ఏటీఎంలను ఎంచుకోవడం ఒకింత నయం. ఇక రెస్టారెంట్లు, పీవోఎస్‌ మెషిన్ల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డులను అక్కడి సిబ్బందికి ఇచ్చి పక్కకు వెళ్లిపోకూడదు. ఈ లోపు వారు స్కిమ్మింగ్‌ పరికరంపై దాన్ని స్వైప్‌ చేయడం ద్వారా డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ సమక్షంలోనే కార్డును స్వైప్‌ చేసేలా చూసుకోవాలి.  

పాస్‌వర్డ్‌లకు రక్షణ ఉందా?
నేడు ఆన్‌లైన్‌లో దాదాపు ప్రతీ పోర్టల్‌ రిజిస్టర్‌ చేసుకోవాలని కోరుతున్నాయి. దీంతో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని గుర్తుంచుకోలేక మర్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకరు ఎన్నో పోర్టల్స్‌లో లాగిన్‌ అవుతుంటారు. అన్నింటి వివరాలూ గుర్తుంచుకోవడం కష్టమే మరి. అందుకే వీటిని ఎక్కడైనా నమోదు చేసుకోవాలి. అందుకోసం మీకు మాత్రమే అర్థమయ్యే కోడ్‌ భాషలో రాసుకోవడం మంచిది.  

సామాజిక మాధ్యమాల వద్ద...
ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో సున్నితమైన డేట్‌ ఆఫ్‌ బర్త్, ఇల్లు, కార్యాలయం చిరునామాలు, ఫోన్‌ నంబర్లు తదితర సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా జాగ్రత్తపడాలి. కొందరు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ అన్నది పాస్‌వర్డ్‌గానూ పెట్టుకుంటుంటారు. కనుక ఈ వివరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  

‘లక్కీడ్రా’ లీకేజీ
లక్కీ డ్రా గెలుచుకున్నారని, వివరాలు తెలియజేస్తూ క్లెయిమ్‌ చేసుకోవాలనే తరహా ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వివరాలు తీసుకున్న తర్వాత వాటిని వ్యాపార సంస్థలకు విక్రయిం చి సొమ్ము చేసుకునేవారున్నారు. మీ ఫోన్‌ బిల్లులు, బ్యాంకు స్టేట్‌మెంట్‌లలోనూ కీలకమైన వివరాలు ఉంటాయని మర్చిపోవద్దు. లక్కీ డ్రా గెలుచుకున్నారని సైబర్‌ నేరగాళ్లు మెయిల్స్‌ ద్వారానూ వ్యక్తిగత వివరాల తస్కరణకు ప్రయత్నిస్తుంటారు.
 
మధ్యవర్తుల ద్వారా...
టెలికం కంపెనీల ఏజెంట్లు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థల ద్వారానూ మీ వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం  పొంచి ఉంది. మంచి వ్యవస్థలను కలిగి ఉన్న సంస్థల ద్వారానే సేవలను పొందడం ఒకింత సురక్షితం.


యాప్స్‌తో ప్రమాదం
మీరు ఇన్‌స్టాల్‌ చేసుకునే యాప్స్‌ పేరున్న మంచి సంస్థలవి అయితే ఫర్వాలేదు. కానీ, అంతగా తెలియనివి, థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చాలా ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఆ యాప్స్‌కు మీరిచ్చే పర్మిషన్స్‌తో మొబైల్‌లోని సమాచారం అంతా కొల్లగొడుతుంటారు.

బ్యాంకు నుంచి అంటూ కాల్స్‌ వస్తే?
కొందరు మోసగాళ్లు మీకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖ నుంచి కాల్‌ చేస్తున్నామంటూ మీ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. వివరాలు చెప్పారో ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేయగలరు. హైదరాబాద్‌లోని జ్ఞానేంద్రకు ఎదురైన అనుభవం ఇందుకు ఉదాహరణ. జ్ఞానేంద్ర ఎస్‌బీఐ నుంచి గృహ రుణం తీసుకుని ఈఎంఐ చెల్లిస్తున్నాడు.

ఈఎంఐ చెల్లింపునకు రెండు రోజుల ముందు ఓ రోజు ఓ వ్యక్తి జ్ఞానేంద్రకు కాల్‌ చేసి ‘‘మీ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అయింది. ఈఎంఐ చెల్లింపులకు సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు గాను అన్‌బ్లాక్‌ చేయాలి. కార్డు వివరాలు ఓ సారి చెప్పండి’’ అని కోరాడు. అతడికి జ్ఙానేంద్ర తన కార్డు వివరాలు చెప్పగా, ఆ తర్వాత అరగంటకే అతని బ్యాంకు ఖాతా నుంచి ఐదు లావాదేవీల్లో రూ.50,000 డెబిట్‌ చేసుకున్నాడు. జ్ఞానేంద్ర బ్యాంకులు, పోలీసు స్టేషన్, ఆర్‌బీఐ చుట్టూ తిరిగినా ప్రయోజం లేకపోయింది. కనుక ఈ తరహా కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  

ఇక నేరగాళ్లు వెండర్ల నుంచి వ్యక్తుల ఖాతా నంబర్, ఫోన్‌ నంబర్, ఆధార్‌ నంబర్, చిరునామా, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ తదితర సమాచారాన్ని సేకరించి, ఆ వివరాల ఆధారంగా తాము మోసానికి ఎంచుకున్న వారికి కాల్‌ చేస్తుంటారు. బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామంటూ ‘‘మీ ఖాతాలో సమస్య ఉంది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ రీసెట్‌ చేయాలి లేదా ఓటీపీ చెప్పండి’’ అని అడగడం ద్వారా ఖాతాల్లోని నగదును కొల్లగొట్టేయగలరు. నిజానికి బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు కాల్‌ చేసి ఈ తరహా సమాచారాన్ని అడగడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసిన సందర్భంలోనే వివరాలను నమోదు చేయాల్సి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement