సాక్షి, హైదరాబాద్: ‘సమగ్ర వేదిక’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటాను అధికారికంగా అనుసంధానం చేయడంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ దాసోజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వేదిక పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యంగా ఉండాల్సిన వివరాల్ని సేకరించి రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించిందని, డేటా గోప్యత రక్షణ చట్టం-2017, ఐటీ యాక్ట్‌లనే కాకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని సైతం ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు. అధికారిక డేటాను రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. గత నెల 5న హైదరాబాద్‌లో జరిగిన ఐసీఏఐ జాతీయ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ’సిటిజెన్ 360’ పేరిట సేకరించిన వివరాలను తెలియజేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. వివిధ విభాగాల ద్వారా పౌరులకు సంబంధించిన ప్రైవేట్ డేటా సేకరించినట్లు జయేశ్ రంజన్ అంగీకరించారని వారు ఆరోపించారు.
‘జయేశ్ రంజన్ చేసిన ప్రకటన ద్వారా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా రహస్యంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని తేలింది. ప్రజల అనుమతి లేకుండా ఈ విధంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్టాలను ఉల్లంఘించడమే’ అని శ్రవణ్ తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత, రహస్య డేటా సేకరణ చేయడం చట్టవ్యతిరేకమని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డాక్టర్ శ్రవణ్ కేంద్ర మంత్రిని కోరారు. ఏ ఏజెన్సీ ద్వారా ఈ డేటాను సేకరించారో వెల్లడించలేదని, ఆ ఏజెన్సీ దగ్గర డేటా గుట్టుగా ఉండదనే గ్యారెంటీ ఏముంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తిగత ఈమెయిల్స్, పాస్‌వర్డ్‌లు, మొదలైవన్నింటినీ, పౌరుల ప్రతి డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం సేకరించిందని స్పష్టం అవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరుల సమాచారాన్ని గుట్టుగా సేకరించిన ప్రభుత్వం డేటాను ఎందుకు సేకరించిందో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా చేయడం పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని, రాజ్యాంగం 14, 21 అధికరణాల కింద పౌరుల కల్పించిన హక్కులకు ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించిందని శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మార్చిలో ఐటి గ్రిడ్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయాన్ని డాక్టర్ శ్రవణ్ గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ’సేవామిత్ర’ అనే యాప్ పేరుతో రాజకీయ అవసరాల కోసం టీడీపీ డేటా సేకరించిందన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ‘సిటిజన్-360 ‘ని దుర్వినియోగం చేయట్లేదని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ కేసులో నిందితులపై కేసులు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మాత్రం అదే తరహా నేరానికి పాల్పడి పౌరుల డేటాను చోర్యం చేస్తున్నట్లు అనుమానాలున్నాయియని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని, లేకపోతే, తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని శ్రవణ్ విలేకరులతో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment