
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ను కుదిపేస్తున్న కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ వినియోగదారులు సమాచారాన్ని తస్కరించి.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు అపఖ్యాతి ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, జీఎస్టీని ఉద్దేశించి ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ కామెంట్ వెనుక ఉన్నది ఆ సంస్థేనని కేంద్ర సమాచార ప్రసార శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
గుజరాత్ ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను కాంగ్రెస్ పార్టీ పొందిందని విమర్శించారు. అయితే, ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే విషయంలో హిట్లర్‌కు గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని, ఇప్పుడు ప్రధాని మోదీకి రవిశంకర్‌ప్రసాద్ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. బూటకపు కథనాలను సృష్టించే కార్ఖానా బీజేపీ ప్రభుత్వమేనని, అతిపెద్ద సమాచార దొంగే.. అందరికంటే గట్టిగా అరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇలా ఆరోపణలు ఎలా చేస్తారని మండిపడ్డారు.