16.8 కోట్ల మంది డేటా చోరీ! | Cyberabad Commissioner Stephen Ravindra On Data theft | Sakshi
Sakshi News home page

16.8 కోట్ల మంది డేటా చోరీ!

Published Fri, Mar 24 2023 3:37 AM | Last Updated on Fri, Mar 24 2023 8:02 AM

Cyberabad Commissioner Stephen Ravindra On Data theft - Sakshi

గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్‌ నంబర్లు, వాట్సాప్, ఫేస్‌బుక్‌ యూజర్ల వివరాలు క్రిమినల్స్‌ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్‌క్రైం పోలీసులు రట్టు చేశారు.

దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు.

రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్‌ విద్యార్థులు, డీమ్యాట్‌ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్‌బుక్‌ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్‌ ఫోర్స్‌ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ డేటాబేస్‌)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్‌ డయల్‌ అనే సెర్చ్‌ ఇంజన్‌ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు.  

నిందితులు వీరే... 
యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్‌ ఇన్ఫోటెక్, గోబల్‌ డేటా ఆర్ట్స్, ఎంఎస్‌ డిజిటల్‌ గ్రో అనే కంపెనీల (కాల్‌సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్‌ నితీష్‌ భూషణ్‌తోపాటు టెలికాలర్‌ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సుశీల్‌ తోమర్, క్రెడిట్‌ కార్డుల డేటా విక్రయించే అతుల్‌ సింగ్, ఎంఎస్‌ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్‌ హసన్, గ్లోబల్‌ డేటాఆర్ట్స్‌లో జస్ట్‌ డయల్‌ ద్వారా డేటాను విక్రయించే సందీప్‌ పాల్, బల్క్‌ మెసేజ్‌లు పంపే జియా ఉర్‌ రెహమాన్‌లను ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి 12 సెల్‌ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు.

నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్‌ క్రిమినల్స్‌కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్‌క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. 

భారీగా డేటా చోరీ... 
నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్‌ వాయిస్‌ డేటాబేస్‌ 3.47 కోట్లు, మొబైల్‌ నంబర్ల డేటాబేస్‌ 3 కోట్లు, స్టూడెంట్‌ డేటాబేస్‌ 2 కోట్లు, వాట్సాప్‌ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్‌ సీకర్స్‌ డేటాబేస్‌ 40 లక్షలు, సీబీఎస్‌ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్‌ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్‌ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్‌ సిటిజన్స్‌ 10.6 లక్షలు, వెబ్‌సైట్‌ ఓనర్స్‌ 17.4 లక్షలు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. 

గుర్తించిన అంశాలు... 
► పలు ఆర్థిక సంస్థలు, సోషల్‌ మీడియా, జస్ట్‌ డయల్‌ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. 
► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 
► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. 
► జస్ట్‌ డయల్‌ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. 
పోలీసుల సూచనలు...  
► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. 
► క్రెడిట్‌ కార్డులు, బ్యాంకింగ్‌ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. 
► మొబైల్, కంప్యూటర్, యాప్‌లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

కేసు దర్యాప్తు సిట్‌కు బదిలీ 
దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్‌) కల్మేశ్వర్‌ నేతృత్వంలో ‘సిట్‌’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్‌లో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ రితిరాజ్, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. 

క్రెడిట్‌ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్‌ 
గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. క్రెడిట్‌ కార్డుల వెరిఫికేషన్‌ చేస్తున్న థర్డ్‌ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్‌బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు.

ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్‌ అహ్మద్, మహ్మద్‌ సమాల్, మహ్మద్‌ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్‌ వాలియా, ఆకాశ్‌నిర్వాన్, విరాట్‌ పురి, అతీత్‌ దాస్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 13 సెల్‌పోన్లు, ల్యాప్‌టాప్, క్రెడిట్‌ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement