డేటా చోరీ సూత్రధారి దొరికాడు | Cyberabad police arrested key mastermind in data theft case | Sakshi
Sakshi News home page

డేటా చోరీ సూత్రధారి దొరికాడు

Published Sun, Apr 2 2023 3:18 AM | Last Updated on Sun, Apr 2 2023 3:18 AM

Cyberabad police arrested key mastermind in data theft case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శా­తం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్ర­యిస్తున్న ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు.

రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. 

వెబ్‌ డిజైనర్‌ నుంచి... 
హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌ వెబ్‌ డిజైనర్‌గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్‌ డిజైనింగ్‌ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్‌ ఏజెంట్లకు, సైబర్‌ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్‌ సొహైల్, మదన్‌ గోపాల్‌లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. 

విక్రయం కోసం వెబ్‌సైట్‌.. 
తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్‌స్పైర్‌ వెబ్జ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్‌ డ్రైవ్‌ లింక్‌ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్‌ నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్‌ల కోసం సైబరాబాద్‌ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  

ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. 
నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్‌ సోర్స్‌ వెబ్‌సైట్‌లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్‌ భరద్వాజ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. 

ఈ డేటాతో ఏం చేసేవారంటే.. 
మార్కెటింగ్‌ బృందాలు, ఏజెన్సీలు, సైబర్‌ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్‌ కోసం బల్క్‌ మెసేజ్‌లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్‌ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్స్‌) కల్మేశ్వర్‌ శింగేన్వర్‌ తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. 
నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్‌కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా, ఈ–మెయిల్‌ ఐడీలు తదితర వివరాలున్నాయి. 

రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్‌.. 
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్‌ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. 

విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. 
విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్‌లైన్‌ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్‌ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement