సాక్షి, హైదరాబాద్: సరదా కోసమో.. కాలక్షేపం కోసమో చేసే కొన్ని పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయనడానికి డేటింగ్ యాప్స్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని కొందరు.. ఒంటరితంతో మరికొందరు ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల వలలో చిక్కుతున్నారు.
ఈ తరహా మోసాలకు గురవుతున్న వారిలో యువకుల నుంచి వయోవృద్ధులు వరకు ఉంటున్నారు. ఎదుటివారి బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు... అందమైన యువతులతో న్యూడ్ వీడియోకాల్స్ మాట్లాడిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని మాటల్లో దింపి రెచ్చగొట్టి తర్వాత వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడేలా చేస్తున్నారు.
ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పరువు పోతుందని భావించి బాధితులు సైబర్ నేరస్తులు డిమాండ్ చేసినట్లు రూ. లక్షలు సమర్పిస్తున్నారు.
లింక్‌లు పంపి..
మనకు డేటింగ్ యాప్‌లపై ఆసక్తి లేకున్నా సోషల్ మీడియాలో మన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఈ తరహా లింక్‌లు పంపి రెచ్చిగొట్టి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నారాయణగూడ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వృద్ధుడికి వీడియోకాల్ చేసిన ఓ యువతి.. ఆ వృద్ధుడిని నగ్నంగా ఫోన్ మాట్లాడేలా చేసి దాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగింది.
ఇలా రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. లాలాపేటకు చెందిన 59 ఏళ్ల బీమా కంపెనీ ఉద్యోగి సైతం రూ. 8 లక్షలు ఇదే రీతిలో పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ప్రజల సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా డేటింగ్ యాప్ లింక్‌లు, వాట్సాప్ వీడియో న్యూడ్‌కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి ముప్పు నుంచి బయటపడగలుగుతామని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు మరవొద్దు...
♦ మన మానసిక పరిస్థితి ఏదైనా సరే ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్‌లైన్ స్నేహాల వల్ల మోసపోయే కంటే నిజమైన స్నేహితులను, సన్నిహితులను గుర్తించడం ఉత్తమమన్నది తెలుసుకోవాలి.
♦ ఆన్‌లైన్ మోసగాళ్లకు సోషల్ మీడియా అనేది ప్రధాన వేదిక. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం పెట్టే వ్యక్తిగత సమాచారం, ఫాలో అవుతున్న వ్యక్తులను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్‌ల లింక్‌లు పంపి మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడం ఉత్తమం.
♦ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో మన ఫొటోలు, వీడియోలు కేవలం స్నేహితులకే కనపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లు వాడాలి. దీనివల్ల ఇతరులకు మన వ్యక్తిగత అంశాలు వెల్లకుండా నిరోధించవచ్చు.
♦ అందమైన యువతుల ప్రొఫైల్ ఫొటోలతో (ఫేక్ ప్రొఫైల్స్‌తో) కొందరు సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఇలా వారి వలలో పడే అమాయకులను మోసగిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు.
♦ మొబైల్‌ఫోన్, ల్యాప్‌లాప్, డెస్క్‌టాప్‌లకు సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్, మాల్‌వేర్స్ నుంచి రక్షణ ఉంటుంది.
♦ డేటింగ్ యాప్స్ పేరిట లింక్‌లు పంపి స్నేహాలు చేసే వారిని వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం అడిగేందుకు ప్రయత్నించాలి. ప్రశ్నించడం ప్రారంభిస్తే ఫేక్‌గాళ్లు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యే స్నేహితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ఏ రకమైన ఆన్‌లైన్ యాప్‌లోనూ డబ్బు లావాదేవీలు చేయవద్దు.
Comments
Please login to add a commentAdd a comment