సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు.
కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్‌స్టంట్ లోన్లని, మార్కెట్‌లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం!
తప్పక డిలీట్ చేయించాలి..
వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
కేస్ – 01
‘గుడ్‌మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు.
కేస్ – 02
‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్‌తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్‌ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్‌ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు.
లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ...
మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్‌లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్‌లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి.
డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం..
యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
వీలైనంత వరకు ఇవ్వొద్దు...
వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment