సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి బాధ్యులైనవారిని విచారణకు పిలిపిస్తామని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటుచేసిన శాసనసభ ఉపసంఘం హోం, ఐటీ శాఖలతోపాటు ఇతర అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం సమావేశమైంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత డేటా, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంపై వివరాలు సేకరించింది. గత సమావేశంలో ఉపసంఘం అడిగిన వివరాలను హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని చెప్పారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. ఈ అంశంపై శాసనసభ ఉపసంఘం సమగ్రంగా విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కోటారు అబ్బయ్యచౌదరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
డేటా చోరీ బాధ్యులను విచారణకు పిలిపిస్తాం
Published Wed, Jul 6 2022 5:26 AM | Last Updated on Wed, Jul 6 2022 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment