అడ్డిస్ అబాబాలోని ఆఫ్రికన్ యూనియన్ కేంద్ర కార్యాలయం
అడ్డిస్ అబాబా, ఇథియోపియా : చైనా అంటే స్నేహం కాదు.. ఓ నమ్మకం అనే భావనను ప్రపంచదేశాల్లో తీసుకురావడానికి ఆ దేశం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా చైనాపై ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ఫైర్ అయింది. స్నేహం పేరుతో గిఫ్ట్‌గా ఇచ్చిన భవనం ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆఫ్రియన్ ఏయూ ఆరోపించాయి.
అడ్డిస్ అబాబాలోని ఏయూ కేంద్ర కార్యాలయ కంప్యూటర్ల నుంచి ప్రతి రోజు రాత్రి సమాచారం తస్కరణకు గురవుతున్నట్లు ఫ్రెంచ్ వార్తపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో షాక్‌కు గురైన ఏయూ సర్వర్ల ద్వారా నిజంగానే డేటా తస్కరణకు గురవుతున్నట్లు గుర్తించింది. మిగిలిన సమాచారం చోరికి తరలిపోకుండా అడ్డుకుంది.
ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలు కలసి 2001లో ఆఫ్రికన్ యూనియన్‌గా ఏర్పడ్డాయి. 2002లో ఇథియోపియా రాజధానిలోని అడ్డిస్ అబాబాలో ఏయూ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచ శక్తిగా ఎదగాలని తపన పడుతున్న చైనా.. ఈ అతిపెద్ద కూటమిపైన కన్నేసింది. పేదరికంలో మగ్గుతున్న ఆ దేశాలకు వ్యాపార ఆశ జూపి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ)లో పెట్టుబడులు పెట్టాలని కోరింది. బీఆర్‌ఐలాంటి బృహత్తరమైన ప్రాజెక్టు ఆఫ్రికా గుండా వెళ్తే దేశాలు అభివృద్ధి చెందుతాయని నమ్మబలికింది.
చైనా మాటకు సరేనన్న ఆఫ్రికన్ దేశాలు ఆ దేశం నుంచి అప్పులు తీసుకుని బీఆర్‌ఐలో పెట్టుబడులు పెట్టాయి. బీఆర్‌ఐలో పెట్టిన పెట్టుబడుల మొత్తానికి ఏటా భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుండటంతో ఆఫ్రికన్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఈలోగా బహుమతి కింద ఆఫ్రికన్ యూనియన్‌కు చైనా నిర్మించి ఇచ్చిన కార్యాలయం నుంచి సమాచారం తస్కరణకు గురవుతోందన్న వార్త ఆఫ్రికన్ దేశాలను ఆత్మరక్షణలో పడేసింది. 200 మిలియన్ల డాలర్లతో అడ్డిస్ అబాబా కార్యాలయాన్ని నిర్మించిన చైనా 2012లో ఏయూకి దాన్ని అప్పగించింది.
ఆనాటి నుంచి నేటి వరకూ అంటే గత ఐదేళ్లుగా ప్రతి రాత్రి ఏయూకి చెందిన రహస్యాలు షాంఘైలోని ఓ బేస్‌కు చేరుతున్నాయి. ఫ్రెంచ్ పత్రికలో వార్తకథనాల తర్వాత జాగ్రత్తపడ్డ ఏయూ చైనా సర్వర్లను పక్కనపడేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త సర్వర్లను అందుబాటులోకి తెచ్చుకుంది. వాటి నిర్వహిస్తామని చైనా చేసిన ఆఫర్‌ను తిరస్కరించింది. అల్జీరియా నుంచి అబాబాకు వచ్చిన భద్రతా బృందం వెతుకులాటలో డెస్క్‌ల కింద పెద్దమొత్తంలో మైక్రోఫోన్‌లు కూడా లభ్యమయ్యాయి.
బీఆర్‌ఐలో భాగంగా పెట్టుబడుల పేరుతో వర్ధమాన దేశాలకు ఎదురుఅప్పులు ఇస్తున్న చైనా.. వడ్డీల రూపేణ వాటి రక్తాన్ని జలగలా పట్టిపీల్చుతోంది. ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌లకు బీఆర్‌ఐలో భాగంగా చైనా భారీగా నిధులు అప్పుగా ఇచ్చింది. కాగా, ఏయూ చేసిన గూఢచర్య ఆరోపణలను చైనా ఖండించింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఆఫ్రికా-చైనా సంబంధాలు దెబ్బతినే ప్రభావం ఉందని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment