రాజమహేంద్రవరంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
(రాజమహేంద్రవరం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజలందరి వ్యక్తిగత సమాచారానికి కాపలాదారులుగా ఉండాల్సిన వారే దానిని దొంగిలిస్తే.. మళ్లీ మరోసారి అధికారాన్ని వారి చేతిలోనే పెడితే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇటీవల రాష్ట్రంలో టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా ప్రజల డేటా చోరీచేసిన కేసు గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపెద్ద సైబర్ క్రైమ్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. సేవామిత్రల పేరుతో ప్రజలందరి డేటాను వారి వద్ద పెట్టుకున్నారు. వాళ్లు సేవచేసే వారు కాదు, మనకేమీ మిత్రులు కాదు. ప్రజలను మోసం చేయడానికి వారందరి వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్లు దొంగిలించి వారి దగ్గర పెట్టుకున్నారు’.. అని ప్రధాని అన్నారు.
మోదీ తన ప్రసంగంలో సీఎం చంద్రబాబును పదే పదే ‘యూటర్న్’ బాబుగా పేర్కొంటూ.. రాష్ట్రంలో ఇప్పుడు ‘యూ టర్న్ బాబు’ పరిస్థితి ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రాజు భల్లాలదేవుడి పాత్ర మాదిరే ఉందని చెప్పారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వారైతే.. ఇక్కడి ‘యూటర్న్ బాబు’ మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారని ప్రధాని తూర్పారపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నదైతే.. యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత ‘హెరిటేజ్’ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరని దుయ్యబట్టారు.
కమీషన్ల కోసమే పోలవరం అంచనాల పెంపు
సాగు, తాగునీటి అవసరాల కోసం అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటే.. యూ టర్న్ బాబు మాత్రం ఆ పోలవరం ప్రాజెక్టు తనకు అవినీతి డబ్బులను తెచ్చి పెట్టే ఏటీఎం మాదిరిగా భావిస్తున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు నిర్మాణానికయ్యే వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించామన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ఈ ఐదేళ్లలో కేంద్రం రూ.7వేల కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని తెలిపారు. అయినా, యూటర్న్ బాబు తన కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూపోతూ, ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకుండా గాలిలోనే పెట్టారని తూర్పారబట్టారు. ఏపీ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు కూడా ఈ యూటర్న్ బాబు తన స్టిక్కర్లు వేసుకుంటూ స్టిక్కరు బాబుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం కేంద్రంలో తమ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేస్తుంటే ఈ యూటర్న్ బాబు దానికీ ఉత్సాహంగా తన స్టిక్కరు వేసుకున్నారని దుయ్యబట్టారు.
ఐదేళ్లు మీ కోసమే పనిచేశా.. మళ్లీ అవకాశమివ్వండి
21వ శతాబ్ధంలో ప్రజలు కోరుకుంటున్నట్టుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు శక్తివంతంగా తీర్చిదిద్దడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ ప్రజలను కోరారు. గడచిన ఐదేళ్లూ దేశ ప్రజల బాగోగుల కోసమే పనిచేశానని చెప్పారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఊరట కలిగించాలని ఐదు లక్షల ఆదాయంలోపు ఉన్న వారికి పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు. ఆ నిర్ణయం ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌లకు ప్రజల భవిష్యత్ పట్టదని, మార్పు కోసం కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు.
పాక్‌ను సమర్ధిస్తున్న బాబు బృందం
దేశద్రోహుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను వారి స్థావరాల దగ్గరికి వెళ్లి వాటితోపాటు ఉగ్రవాదులను కూడా మట్టుపెట్టామని మోదీ చెప్పారు. చంద్రబాబు సహా దేశంలో ప్రతిపక్ష పార్టీలు పాకిస్థాన్ వైఖరి సమర్థించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుపేద యువత కోసం పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ అమలుచేసినట్లు ఆయన చెప్పారు. దేశంలో సముద్ర తీర ప్రాంతంలో అత్యధికులున్న మత్స్యకారులకి ప్రత్యేక మంత్రిత్వ శాఖను తొలిసారి తమ ప్రభుత్వమే ఏర్పాటుచేసిందని.. వారికి కిసాన్ క్రెడిట్ కార్డుల తరహా రుణాలు పొందే కార్డులను అందజేశామని ప్రధాని చెప్పారు. రైతుల కోసం ధాన్యంతో పాటు 22 రకాల పంటల మద్దతు ధరలను రెండున్నర రెట్లు తమ ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర పార్టీ ఇన్‌చార్జి మురళీధరన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీమంత్రి మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను ప్రధాని మోదీ ప్రజలకు పరిచయం చేశారు.
టీడీపీ ఓడిపోతుందని నమ్ముతున్నాను
– మోదీ ట్వీట్
రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తాను నమ్ముతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రాజమహేంద్రవరం బహిరంగ సభలో పాల్గొనే ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఇది నా రెండో పర్యటన. టీడీపీ ఓడిపోతుందని నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment