
సాక్షి, అమరావతి : ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం తత్తరపాటు పడుతోంది. డేటా చోరీతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే.. తమ డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారని ఉల్టా ఆరోపణలు చేస్తోంది. పొంతనలేని సమాధానాలు చెబుతూ ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తమపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతుదంటూ గగ్గోలు పెడుతోంది. చోరీ చేయలేదంటూనే.. కేబినెట్ సమావేశాలు పెట్టి మరీ ఈ విషయంపై చర్చిస్తున్నారు. తమ దొంగతనాన్ని ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చడానికి నానాయత్నాలు చేస్తున్నారు.
తాజాగా డేటా చోరీపై మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీకి, ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పకొచ్చారు. తెలంగాణ పోలీసులే తమ డేటాను దొంగిలించారన్న మంత్రి కాల్వ.. డేటా చోరీ అయిందని అంగీకరిస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పలేక తడబడ్డారు. పొంతన లేని సమాధానం చెబుతూ నీళ్లు నమిలారు. ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే తెలంగాణ పోలీసు వైఖరిని విమర్శించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని మీడియా నిలదీయగా.. మంత్రి సమాధానం చెప్పలేక ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయారు.